మాట తప్పను…మడమ తిప్పను…ఇది ఏపీ సీఎం జగన్ తరచుగా చెప్పే డైలాగ్…తమ జగనన్న మాటంటే మాటేనని….వెనకడుగు వేసేదే లేదని వైసీపీ నేతలు అంటుంటారు. ఇక, జగన్ కూడా జనానికి నేనున్నాను…విన్నాను అంటూ గొప్పలు చెబుతుంటారు. అయితే, జగన్ మాట మీద నిలబడరని…ఆ మాటకొస్తే అసలు సవాళ్లకు స్పందించరని నేటితో తేలిపోయింది.
వివేకా హత్య కేసుతో తనకు సంబంధం లేదని చెప్పేందుకు జగన్ తిరుమల వెంకన్నపై ప్రమాణానికి సిద్ధమా అంటూ లోకేశ్ విసిరిన సవాల్ కు జగన్ స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుతో వివేకా మర్డర్ మిస్టరీ వీడిపోయిందని, బాబాయ్ ని వేసేసింది అబ్బాయే అని లోకేశ్ షాకింగ్ కామెంట్లు చేశారు.
కత్తితో బతికే వాడు కత్తికే చస్తాడని, జగన్ రెడ్డి ఇక్కడకు ఎందుకు రావడం లేదని లోకేశ్ ప్రశ్నించారు. దైవ సాక్షిగా ప్రమాణం చేసేందుకు జగన్ ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. జగన్ తన నివాసం నుంచి 45 నిమిషాల్లో ఇక్కడకు రావచ్చని, కానీ, ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వివేకా హత్యలో తనకు, తన కుటుంబానికి ఎలాంటి పాత్ర లేదని తిరుమల వెంకన్న సాక్షిగా ప్రమాణం చేశానని లోకేశ్ అన్నారు.
తనలాగే ప్రమాణం చేయాలని తాను విసిరిన ఛాలెంజ్ కు భయపడి పులివెందుల పిల్లి పారిపోయిందని జగన్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. లోకేశ్ సవాల్ కు జగన్ స్పందించకపోవడంతో వివేకా హత్య కేసు వెనుక ఉన్నవారిని కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్న విమర్శలకు బలం చేకూరినట్లయిందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.