ఏపీలో రాబోయే సార్వత్రిక ఎన్నికల వేడి ఇప్పుడే రాజుకున్న సంగతి తెలిసిందే. ఏ పార్టీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకుంటుంది అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. అసలు మా పార్టీ వేరే పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదంటూ వైసీపీ మాత్రం బీరాలు పోతోంది. కానీ, కేంద్రంలోని బీజేపీతో వైసీపీకి ఉన్న చీకటి ఒప్పందం అందరికీ తెలుసని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఆల్రెడీ బహిరంగంగా ప్రధాని మోడీ కాళ్లు జగన్ పట్టుకోబోయారని, ఇప్పటికీ అదే పరిస్థితి అని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తుంటారు.
ఈ క్రమంలోనే జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశఆరు. జగన్ సింహం కాదు పిల్లి అని, ఓటమి భయంతో అందరి కాళ్లు పట్టుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని, 2024లో ఓడిపోతే వైసీపీ ఇక ఉండదని జగన్కు అర్థమైందని జోస్యం చెప్పారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.
తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను పొత్తులపై మాట్లాడినట్లు పెడర్థాలు తీశారని చంద్రబాబు అన్నారు. అంతేకాదు, భీమిలి పర్యటనలో ప్రజలు జై బాబు అంటూ నినాదాలు చేస్తే…జై జగన్ నినాదాలు చేశారన్నట్లు వీడియోలు మార్ఫింగ్ చేశారని మండిపడ్డారు. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. అటువంటి అసత్య వీడియోలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు.
కాగా, ఇటీవల చంద్రబాబు మూడు జిల్లాల పర్యటన విజయవంతమైన సంగతి తెలిసిందే. చంద్రబాబు పర్యటనకు జనం తండోపతండాలుగా తరలివచ్చి జగన్ పాలనతో తాము విసిగిపోయామని చెప్పడంతో వైసీపీ నేతలకు షాక్ తగిలింది. అందుకే, చంద్రబాబు సభలో జై జగన్ నినాదాలు చేశారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.