మనదేశంలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందుకే భారతదేశంలో కులమతాలకు అతీతంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా ప్రతి ఏటా రాఖీ పండుగను ఘనంగా నిర్వహిస్తుంటారు. రాఖీ పండుగ సమయానికి అన్నాచెల్లెళ్ల మధ్య, అక్కా తమ్ముళ్ల మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉన్నా సరే వారికి రాఖీ కట్టి ఆ మనస్పర్ధలను దూరం చేసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. కుటుంబం అన్న తర్వాత అన్న , చెల్లి, అక్క, తమ్ముడుల మధ్య చిన్న చిన్న కలహాలు, మనస్పర్ధలు రావడం సహజం.
కొన్ని కుటుంబాలను మినహాయిస్తే మెజార్టీ కుటుంబాల్లో ఆ చిన్న చిన్న గొడవలను వదిలేసి అన్నా చెల్లెళ్లు ఏదో ఒక సందర్భంలో కలిసిపోయేందుకే ప్రయత్నిస్తుంటారు. ఒకవేళ అన్నాచెల్లెళ్ల మధ్య మనస్పర్ధలు ఉన్నప్పటికీ చెల్లెలు ఏదైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు, ఆమెకు అవమానం జరిగినప్పుడు అన్న తప్పకుండా అండగా ఉంటాడు..ఉండాలి కూడా. కానీ, ఇటువంటి అన్నా చెల్లెళ్ల ప్రేమకు ఏపీ సీఎం జగన్ మాత్రం అతీతుడనే చెప్పాలి.
తెలంగాణలో వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కారును ఆమె కూర్చుని ఉండగానే టోయింగ్ చేసిన వైనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. షర్మిలకు జరిగిన ఘోర అవమానాన్ని జాతీయ మీడియా సైతం హైలెట్ చేయగా తాజాగా ప్రధాని మోడీ కూడా ఆమెకు ఫోన్ చేసి పరామర్శించారు. ఇక, షర్మిల ఘటనపై జగన్ ఎందుకు స్పందించలేదు అని కూడా మోడీ నిలదీసినట్టుగా పుకార్లు వస్తున్నాయి. ఒకవేళ నిజంగానే జగన్, షర్మిళల మధ్య మనస్పర్ధలు ఉన్నా సరే తన చెల్లెలికి అంత అవమానం జరిగితే అన్న హోదాలో అయినా జగన్ వ్యక్తిగతంగా పరామర్శించి ఉండాల్సింది అని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
తోడబుట్టిన చెల్లెల్ని పరామర్శించడం అన్నగా జగన్ కనీస బాధ్యత అని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు తన అన్న జగన్ సీఎం గా ఉన్న రాష్ట్రంలో తన తండ్రి వివేకా హత్య కేసు విచారణ ముందుకు సాగడం లేదని, అందుకే ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని వైఎస్ సునీత రెడ్డి చెప్పడం కూడా జగన్ పై తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఈ రెండు ఘటనల నేపథ్యంలో దేశంలో జగన్ కన్నా కఠినాత్ముడైన సోదరుడు మరొకడు ఉండరేమనంటూ సోషల్ మీడియాలో జగన్ ట్రోలింగ్ జరుగుతుంది.