కరోనా దెబ్బకు అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. సినిమా రంగంతో ముడిపడిన అనేక విభాగాలు కూడా మహమ్మారి వైరస్ దెబ్బకు కుదేలయ్యాయి. షూటింగ్ లు లేక కొందరు…థియేటర్లు తెరుచుకోక మరికొందరు నానా ఇబ్బందులు పడ్డారు. ఇక, కొద్ది రోజులుగా థియేటర్లు తెరుచుకున్నప్పటికీ…అనేక సమస్యలు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులను పీడిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలోని థియేటర్లలో టికెట్ల ధర పెంపుపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవికి ఏపీ సీఎం జగన్ నుంచి పిలుపు వచ్చింది. టాలీవుడ్ కు సంబంధించి, ఏపీలోని థియేటర్లకు సంబంధించిన పలు సమస్యలపై చర్చించేందుకు చిరుతోపాటు మరికొంతమంది సినీ ప్రముఖులకు జగన్ ఆహ్వానం పంపించారు. జగన్ తరఫున చిరుకు పేర్ని నాని ఫోస్ చేసి ఆహ్వానం పలికారు. సినీపెద్దలతో కలిసి వచ్చి తమ సమస్యలను సీఎం జగన్ కు వివరించాల్సిందిగా నాని ఆహ్వానించారు.
ఆగస్టు చివరి వారంలో జగన్ తో సినీ ప్రముఖుల భేటీ ఉండవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ భేటీలో ముఖ్యంగా థియేటర్ల సమస్య, టికెట్ ధరలు, థియేటర్లపై ఆధారపడిన కార్మికుల ఉపాధి తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. దీంతోపాటు, డిస్ట్రిబ్యూటర్లు ఎదుర్కొంటోన్న సమస్యలు… పంపిణీ వర్గాల వేతనాలు, రోజువారీ షోల పెంపునకు అనుమతి వంటి పలు విషయాలు చర్చించవచ్చని ప్రచారం జరుగుతోంది.
ఏపీలో సవరించిన టికెట్ ధరలతో ఎగ్జిబిషన్, పంపిణీ రంగాలు చిక్కుల్లో పడడంతో థియేటర్ల సమస్య ఓ కొలిక్కి రాలేదు. దీంతో, జగన్తో భేటీ అయ్యేందుకు సినీపెద్దలు ప్రయత్నిస్తున్నారని కథనాలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే చిరుకు నాని ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. గతంలోనూ సినీరంగం సమస్యల పరిష్కారానికి నాని చొరవ తీసుకున్నారు. సీఎం జగన్ తో చిరంజీవి- నాగార్జున – రాజమౌళి- సురేష్ బాబుల బృందం సమస్యలు విన్నవించేందుకు పేర్ని నాని సాయం చేశారు. అదే తరహాలో వారితో భేటీ ఏర్పాటు చేయాలన్న జగన్ సలహాతో చిరుకు నాని ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.