రాజకీయాలు చేసేందుకు ఏదీ అనర్హం కాదు… అన్నట్టుగా ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్నారని రాష్ట్ర రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమది వ్యవసాయ పక్షపాతప్రభుత్వమని, రైతన్న సర్కారని.. చెప్పుకొనే జగన్.. అనుసరిస్తున్న తీరుతో.. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు గగ్గోలు పెట్టే పరిస్థితి వస్తోంది.
ఒకవైపు రైతులకు మేలు చేస్తున్నామని చెబుతూనే .. వారికి కీలకమైన విత్తనాల వ్యవహారంలో జగన్ చేస్తున్న రాజకీయం.. విస్మయానికి గురిచేస్తోందని విశ్లేషకులు కూడా పేర్కొంటున్నారు. గతంలో చంద్రబాబు రైతుల మేలు కోసం చేసిన.. ఒక నిర్ణయం.. ఇప్పుడు జగన్ వ్యవహరిస్తున్న తీరుతో రైతులకు శాపంగా మారింది.
విషయంలోకి వెళ్తే.. రాష్ట్ర విత్తనోత్పత్తి భాండాగారంగా పేరు పొందిన.. కర్నూలు జిల్లాలోని తంగడంచె భూములు బీడుగా దర్శనిమస్తున్నాయి. వందలాది ఎకరాలు ఇప్పుడు ముళ్ల పొదలతో నిండిపోయాయి. నిధులు, సౌకర్యాల్లేక విత్తనోత్పత్తి చేయలేని దుస్థితికి కర్నూలు జిల్లా మెగా సీడ్ పార్క్ చేరుకుంది.
కర్నూలు జిల్లా తంగడంచెలో 1625 ఎకరాల సారవంతమైన భూములు ఉన్నాయి. ఇందులో జైన్ ఇరిగేషన్‌కు, మెగా సీడ్ పార్క్‌కు 625 ఎకరాలు చొప్పున గత చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. దేశంలో వివిధ రాష్ట్రాలు సహా విదేశాలకూ విత్తనాలు సరఫరా చేసే భాండాగారంగా మెగా సీడ్ పార్క్‌ను తీర్చిదిద్దేందుకు 2017లో రూ. 325 కోట్లు కేటాయించారు.
అయితే.. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవన్నీ మూలనపడ్డాయి. ఎందుకంటే.. ఏ మాత్రం డెవలప్ చేసినా.. ఆ పేరు బాబుకు పోతుందనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.
వాస్తవానికి తంగడంచె భూములను ఆనుకుని కేసీ కాలువ ఉంది. గతంలో కాలువల ద్వారా భూములకు నీరు మళ్లించి సాగు చేసేవారు. ఇప్పుడు కాలువలు పూర్తిగా దెబ్బతినటం వల్ల వర్షంపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో కేవలం 91 ఎకరాలే సాగులోకి వచ్చాయని.. మిగతా భూములన్నీ నిరుపయోగంగా మారుతున్నాయని రైతు సంఘం నాయకులు చెబుతున్నారు.
తంగడంచె విత్తనోత్పత్తి కేంద్రంలో ప్రస్తుతం ముగ్గురు ఏవోలు ఉన్నారు. సరిపడా నిధులు కేటాయించి ఈ కేంద్రం నుంచి విత్తనోత్పత్తి జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. కానీ, దీనిచుట్టూ.. రాజకీయాలు ముసురుకోవడంతో పూర్తిగా మూలనబడడం గమనార్హం.