ప్రజాహితం నవ్యాంధ్ర సీఎం జగన్ కు పట్టదు. ప్రతి దానిలోనూ ఆయన స్వీయ రాజకీయ లబ్ధే చూసుకుంటారు. ఆ కోవలోనే ఎన్నికల వేళ మరో పాచిక విసిరారు. ప్రకాశం జిల్లాలో అసంపూర్తిగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మరో మూడేళ్లు పట్టే అవకాశం ఉన్నప్పటికీ.. అందులోని సొరంగాలను మార్చి 7వ తేదీన ఏకంగా ప్రారంభోత్సవమే చేసేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వెలిగొండ పూర్తి చేసి నీరిస్తామని గత ఎన్నికల ముందు జగన్ పదేపదే చెప్పారు. గద్దెనెక్కి ఐదేళ్లు కావస్తున్నా దానిని పూర్తి చేయలేకపోయారు.
అంతేకాక సుమారు రూ.5 వేల కోట్లు అవసరం ఉన్నా ఈ ప్రాజెక్టు కోసం ఈ ఐదేళ్లలో కేవలం రూ.978 కోట్లను మాత్రమే ఖర్చుపెట్టారు. కీలకమైన పలు పనులు గత టీడీపీ కాలంలోనే కొలిక్కి రాగా.. ఈ ఐదేళ్లూ ఒట్టి మాటలకే పరిమితమయ్యారు. మార్చి 7వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు రెండు సొరంగాలు ప్రారంభిస్తూ.. ప్రకాశం ప్రజల 20 ఏళ్ల కల నెరవేరిందన్నారు. కానీ ఈ ఐదేళ్లలో టన్నెల్‌కి ఒక్క మీటర్ మేర కూడా లైనింగ్ పనులు చేయడం చేతకాలేదు. అయినా వెలిగొండ సొరంగాలు పూర్తయి నీటి విడుదలకు సిద్ధంగా ఉన్నాయని జగన్ చేసిన ప్రకటన పచ్చి అబద్ధమని పశ్చిమ ప్రకాశం, బద్వేలు(కడప), ఉదయగిరి (నెల్లూరు) ప్రజలు మండిపడుతున్నారు.
గత టీడీపీ హయాంలో స్పీడు…
2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చేనాటికి వెలిగొండ ప్రాజెక్టు పనులు ఆగిపోయి రెండేళ్లు అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాల్లో వెలిగొండను చేర్చి ప్రత్యేక దృష్టి సారించారు. పోలవరంతోపాటు వెలిగొండపైనా తరచూ సమీక్షలతోపాటు పలు మార్లు ప్రాజెక్టును సందర్శించి వాస్తవ పరిస్థితుల ఆధారంగా కాంట్రాక్టర్లను మార్చి పనుల్లో వేగం పెంచారు. 2014 నాటికి 11 కిలోమీటర్లు మాత్రమే పూర్తయిన తొలి సొరంగం, చంద్రబాబు ఐదేళ్ల కాలంలో దాదాపు 17.50 కిలోమీటర్ల వరకు తవ్వడంతోపాటు అత్యంత క్లిష్టమైన హెడ్ రెగ్యులేటరీ పనులు మొదలయ్యాయి. రెండో టన్నెల్ దాదాపు 3 కిలోమీటర్లు తవ్వారు. నిర్వాసితులకు పరిహారం, పునరావాస ప్యాకేజీలపై విస్తృత కసరత్తు చేశారు. 2014-19 మధ్య కాలంలో వెలిగొండపై దాదాపు రూ.1,450 కోట్ల ఖర్చు చేశారు.
వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యం
ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వెలిగొండపై ఆరంభంలో హడావుడి చేసినా, అనంతరం తీవ్ర నిర్లక్ష్యం చూపింది. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ఏడాదిలో వెలిగొండ పూర్తి చేస్తామని జగన, ఇతర వైసీపీ నేతలు ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం చేశారు. నిజానికి గత టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో చేసిన పనుల వల్ల వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదికే కొరవ ఉన్న తొలి సొరంగం తవ్వకం పూర్తయింది. తద్వారా తొలి సొరంగం నుంచి ప్రాజెక్టులోకి నీరు తీసుకొనే అవకాశం ఏర్పడింది. నిర్వాసితుల తరలింపును వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో అది వీలు కాలేదు.
సొరంగాల లైనింగ్‌కే ఏడాది అవసరం
ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం వెలిగొండ ప్రాజెక్టు కోసం రూ.8,043 కోట్లు కేటాయించగా, దాదాపు రూ.5,974 కోట్లు వెచ్చించారు. అందులో వైసీపీ ప్రభుత్వ కాలంలో చేసింది కేవలం రూ.958 కోట్లు మాత్రమే. ఆ విషయం అలా ఉంచితే తాజాగా అధికారుల అంచనా ప్రకారం ప్రాజెక్టు వ్యయ అంచనా సుమారు రూ.10 వేల కోట్లకు చేరింది. అంటే ప్రాజెక్టు పూర్తికి ఇంకా రూ.4వేల కోట్లు అవసరం. అలాగే సొరంగాల లోపల లైనింగ్ పూర్తికి కనీసం ఏడాది, మొత్తం ప్రాజెక్టు పనుల పూర్తికి మరో మూడేళ్లు పడుతుందని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు ప్రభుత్వానికి కూడా నివేదికిచ్చారు.
ఇవేమీ పట్టించుకోకుండా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ లబ్ధి, ఓట్లు దండుకునే లక్ష్యంతోనే వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం అంటూ జగన్ ఆర్భాటం చేశారు. రెండో సొరంగంలో ఉన్న టన్నెల్ బోరింగ్ మెషీన్ చెడిపోయి అందులోనే ఉండిపోయింది. దానిని బయటకు తీయడం సాంకేతికంగా కుదరదు. అక్కడే ఒక చిన్న బైపాస్ చేసి అందులో పూడ్చిపెట్టాలి. ఈ విషయం తెలిసి కూడా రెండేళ్ల నుంచి ఈ పని చేయడం లేదు. ఇప్పుడు ఎన్నికల వేళ జనాన్ని మోసగిండానికి ప్రారంభోత్సవ డ్రామా ఆడారు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు లేనందున నల్లమల సాగర్‌కు నీళ్లు పంపలేకపోతున్నామని ప్రచారం చేసుకుంటున్నారు.
వాస్తవం ఏమిటంటే శ్రీశైలంలో నీళ్లున్నా వెలిగొండకు విడుదల చేయలేరు. ఇది పచ్చి నిజం. రెండో టన్నెల్లో బోరింగ్ మెషీన్ అడ్డంగా ఉంటే నీళ్లు ఎలా వదులుతారు? వైసీపీ హయాంలో ఒక్కరికి కూడా పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించలేదు. ఒక్కరిని కూడా ముంపు నుంచి తరలించకుండా నల్లమలసాగర్‌లో నీరు ఎలా నింపుతారు? ఏమీ చేయకుండా ప్రారంభోత్సవాలా? గత ప్రభుత్వాలు నిర్మించిన ఫీడర్ కెనాల్ అధ్వాన పరిస్థితిలో ఉంది. దాని గుండా నీరు నల్లమలసాగర్‌కు వదిలితే అది కనీసం ఐదారు చోట్ల తెగిపోయి నల్లమలసాగర్‌లోకి వెళ్లే బదులు సమీప గ్రామాల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. ఈ విషయం వైసీపీ ప్రభుత్వమే నియమించిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలో ఉంది.
మరి ఈ ఐదేళ్లూ దానిని సరిచేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు? మొదటి సొరంగంలో ఒక కిలోమీటర్, 2వ సొరంగంలో 7 కిలోమీటర్ల లైనింగ్ పనులు ఇంకా పూర్తికాలేదు. ఇది పూర్తి చేయకుండా నిర్దేశిత పరిమాణంలో నీరు ఎలా వెళ్తుంది? ఎక్కడైనా వీక్‌జోన్ ఉండి, సొరంగం కూలిపోతే దీనికి బాధ్యులెవరు? జగన్ ఈ ఐదేళ్లలో ఒక్క మీటర్ లైనింగ్ పనులు కూడా చేయలేదు. నల్లమల సాగర్‌లో ఒకవేళ నీరు నింపగలిగినా.. కాలువల ద్వారా వదిలే పరిస్థితి లేదు. డిస్ర్టిబ్యూటరీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయకపోవడమే దీనికి కారణం.
ముహూర్తంపై జగన్‌ది రోజుకో మాట
వెలిగొండ ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తున్నామని.. మొదటి టన్నెల్‌ను 2022 ఆగస్టు నాటికి పూర్తి చేసి దాని ద్వారా 3000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని.. 2023 ఫిబ్రవరి నాటికి రెండో టన్నెల్‌ను కూడా పూర్తి చేసి 9000 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టుకు అందిస్తామని 2021 అక్టోబరు 7న ఒంగోలులో జగన్ ప్రకటించారు. కానీ అదేమీ జరుగలేదు. ఆ తర్వాత 2022 ఆగస్టు 23న చీమకుర్తిలో మాట్లాడుతూ… 2023 సెప్టెంబరు నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి నీటిని విడుదల చేస్తామని.. నీళ్లిచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని గంభీర స్వరంతో చెప్పారు. అదీ పోయింది.
2023 ఏప్రిల్ 12న మార్కాపురంలో మాట్లాడుతూ.. మొదటి టన్నెల్ తవ్వకం ఇప్పటికే పూర్తయిందని.. రెండో టన్నెల్‌ను సెప్టెంబరు లేదా అక్టోబరు నాటికి పూర్తిచేస్తామని వెల్లడించారు. నంద్యాల జిల్లా లక్షవరంలో 2023 సెప్టెంబరు 20లో మాట్లాడుతూ.. ఆ ఏడాది అక్టోబరులో వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు. తీరా ఈ ఏడాది మార్చి 7న ప్రాజెక్ట్ పూర్తికాకుండానే జాతికి అంకితం పేరుతో ప్రజలను మోసం చేశారు. ఆ సందర్భంగానే మరో మాయమాట చెప్పారు. జూన, జూలై నెలల్లో వర్షాలు కురిసి శ్రీశైలానికి వరద వస్తే అప్పుడు విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే వెలిగొండను ప్రారంభించినట్లు తేలిపోయింది.