వైసీపీ అధినేత జగన్ పరిస్థితి డైలమాలో పడిపోయింది. తమ నాయకులను కాపాడడం ఇప్పుడు ఆయన ముందున్న అతి పెద్ద టాస్క్. ప్రధానంగా జగన్ను సపోర్టు చేసే కీలక నాయకులు.. చాలా మంది పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఒకరిద్దరు పార్టీకి రాజీనామా చేశారు. మరికొందరు మౌనంగా ఉన్నారు. అయితే.. యాక్టివ్గా ఉండి.. జగన్ను సమర్థించే నాయకులు మాత్రం ఇప్పుడు కేసుల్లో చిక్కుకున్నారు. నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం వంటి నాయకులు కేసులో ఉన్నారు.
వీరిలో నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి అరెస్టయ్యారు. మిగిలిన వారికోసం పోలీసులు వెతుకుతున్నారు. ముఖ్యంగా దేవినేని అవినాష్, జోగి రమేష్(చంద్రబాబు ఇంటిపై దాడికి సంబంధించిన కేసు) ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. వీరితోపాటు మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే.. వీరిని ఇప్పుడు కాపాడుకోకపోతే.. మిగిలిన నాయకులు కూడా జగన్కు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు సమర్థించిన నాయకుల్లో వీరు ముందు వరుసలో ఉన్నారు.
ఆ నాడు టీడీపీ ఆఫీసుపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి చేసినప్పుడు.. జగన్ మౌనంగా ఉన్నారు. పైగా వారిలో కొందరికి పదవులు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో అలాంటి వారు తర్వాత కాలంలో మరింత రెచ్చిపోయారు. ఇప్పుడు వారందరిపైనా కేసులు పెట్టేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఈ పరంపర కొనసాగితే.. అనేక మంది నాయకులు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురు కానుంది. దీంతో వీరిని కాపాడు కోవాల్సిన అవసరం, బాధ్యత కూడా జగన్కు ఏర్పడింది.
కానీ, కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నా.. బలమైన వాదనలు వినిపించలేని న్యాయవాద బృందం చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో నాయకుల చుట్టూ కేసుల ఉచ్చు బిగిసుకుంది. ఇప్పుడు ఏం చేయాలన్న విషయంపై జగన్ తర్జన భర్జన పడుతున్నారు. సుప్రీంకోర్టు కు వెళ్లాలని ఉన్నా.. హైకోర్టు నుంచి ఆ మేరకు వెసులుబాటు లేక పోవడంతో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మరోవైపు.. సోమవారం వరకు కూడా న్యాయపరమైన వెసులుబాటు లేకపోవడం.. పోలీసులు దూకుడుగా ముందుకు సాగుతుండ డంతో జగన్ తలపట్టుకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.