తెగే వరకు లాగితే.. ఏదైనా కష్టమే. రాజకీయాల్లో అయినా.. సాధారణ పరిస్థితి అయినా.. ఏదైనా కొంత వరకు మాత్రమే దూకుడు చూపించాలి. కానీ, వైసీపీ అధినేత, సీఎం జగన్ అనుసరిస్తున్న వైఖరి.. రాజకీయాల్లో విమర్శలకు, వివాదాలకు తావిస్తోంది. తాను పట్టిన పట్టు సాధించాలనే కోణంలో కొందరిని టార్గెట్ చేసిన తీరు.. రాజకీయంగా తిరిగి ఆయనకే ఇబ్బందులు తేవడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
ప్రధానంగా అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, అనంతపురం మాజీ ఎంపీ.. జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్ రెడ్డిల కుటుంబాన్ని జగన్ టార్గెట్ చేసిన తీరు.. ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురి చేస్తోంది. జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబం ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన ఫ్యామిలీ కాదు. దాదాపు 40 ఏళ్లకు పైగానే రాజకీయాల్లో కుదురుకున్న కుటుంబం. తాడిపత్రి నియోజకవర్గం నుంచి ఏకధాటిగా 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చక్రం తిప్పారు దివాకర్ రెడ్డి. తర్వాత అనంతపురం ఎంపీగాను ఆయన 2014లో పార్టీ మారి(టీడీపీలోకి వచ్చి) విజయం సాధించారు.
బలమైన ఆర్థిక, అంగబలం ఉన్న నాయకుడిగా కూడా ఆయన గుర్తింపు సాధించారు. అయితే.. రాజకీయంగా ఈ కుటుంబాన్ని జగన్ టార్గెట్ చేయడం తెలిసిందే. గతంలో అంటే.. తాడిపత్రి ఎమ్మెల్యేగా దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ ఉన్నప్పుడు సాక్షిలో కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు వచ్చాయి. ఈ సందర్భంగా పత్రిక ప్రతులను ప్రభాకర్ తగలబెట్టడం.. పరుష వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అయితే.. ఎక్కడైనారాజకీయాల్లో ఇవన్నీ కామన్. చూసీ చూడనట్టు పోవాలి. లేదా.. ఏదైనా ఉంటే.. కూర్చుని మాట్లాడుకోవాలి.. లేదా మరో రూపంలో సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ, వేధించడమే పనిగా జగన్ వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే ప్రభాకర్‌రెడ్డిని, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలను అరెస్టు చేసి.. దాదాపు నెల రోజులు జైల్లో ఉండేలా చేశారు. ఇక, ఆ తర్వాత కూడా ప్రభాకర్‌ను మరోసారి అరెస్టు చేశారు. ఇక, దివాకర్ రెడ్డి కుమారుడు .. గత ఏడాది ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓడిన పవన్‌పైనా కేసులు నమోదు చేశారు.
నిజానికి ఇంతగా వేధించాన్ని రాజకీయ పరిశీలకులు కూడా హర్షించడం లేదు. రాజకీయంగా కక్షలు కార్పణ్యాలు సాధారణమే అయినా.. అదే పనిగా పెట్టుకోవడం వల్ల జగన్‌కే మొదటికి మోసం వస్తుందని అంటున్నారు. ఎందుకంటే బీజేపీ జేసీకి గాలం వేస్తోందట. జేసీ కూడా జగన్ పై కసితో బీజేపీలోకి చేరితో ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారని తాజాగా వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం జేసీ కుటుంబం టీడీపీలో ఉంది. నిజానికి ఈ కుటుంబం వల్ల టీడీపీకి పెద్దగా లబ్ధి జరిగింది లేదు. టీడీపీకి సంస్థాగతంగా ఉన్న కేడర్ అలానే ఉంది. జేసీ టీడీపీలోకి వచ్చినా అతను కాంగ్రెస్‌లో ఉన్నపుడు అతనితో ఉన్న కేడర్ కొంత వైసీపీ వైపు, కొంత టీడీపీ వైపు వచ్చింది. అదే తాడిపత్రిలో కూడా జేసీ కుటుంబం ఓడిపోవడానికి కారణం. రేపు.. జగన్ పెడుతున్న వేధింపుల కారణంగా జేసీ కుటుంబం బీజేపీలో చేరితే.. అక్కడి నుంచి జగన్‌కు కష్టాలు తప్పవనే సంకేతాలు వస్తున్నాయి.
ఇప్పటివరకు ఏ దూకుడుతో అయితే.. జగన్ వ్యవహరిస్తున్నారో.. రేపు జేసీ కుటుంబం బీజేపీలోకి చేరితే.. ఇలానే వ్యవహరిస్తారా? కేసులు పెట్టే సాహసం చేయగలరా? అనే ప్రశ్నలతోపాటు.. జేసీ కుటుంబం.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నాక.. ఖచ్చితంగా జగన్‌ను టార్గెట్ చేయడం ప్రారంభిస్తుందని అంటున్నారు పరిశీలకులు. బీజేపీకి ఎదురు నిలిచి.. మాట్లాడే సాహసం జగన్ చేయలేరు. సో.. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. వేధింపులు పెరిగితే.. ఎంతటివారైనా తమకున్న అవకాశం చూసుకుని.. సమయం వచ్చే వరకు వెయిట్ చేసి.. అంతకు అంత సాధించడం సాధరణమే!!
ఇదే కనుక జగన్‌కు ఎదురైతే.. ఎక్కడైతే.. గెలిచి(తాడిపత్రి ఎమ్మెల్యే స్థానం) రికార్డు సృష్టించామని చెప్పుకొంటోందో.. అక్కడ వైసీపీ ఘోర పరాజయం పొందడంతోపాటు.. కార్యకర్తలకు, పార్టీకి కూడా తీవ్ర నష్టం చేకూరడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి దీనిని జగన్ గుర్తిస్తారో.. గుర్తించరో.. చూడాలి. రోజులు అన్నీ ఒకేలా ఉండవుకదా!!