- కేంద్రం ఎప్పుడో చెప్పింది
- అయినా సీఎం కిమ్మనలేదు
- పార్లమెంటరీ కమిటీలో ఉన్న అవినాశ్‌రెడ్డి వ్యతిరేకించలేదు
- పోస్కో ప్రతినిధులతో తరచూ జగనే చర్చలు
- ఇప్పుడు తనకేమీ తెలియదని బుకాయింపు
- వారు తనను కలిసినా విశాఖకు రారని వెల్లడి
- అంతలోనే చీకటి ఒప్పందం బహిర్గతం
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఏడాదిన్నర కిందే తెలుసన్న విషయం బహిర్గతమైంది. సంవత్సరం కిందే దక్షిణ కొరియా కంపెనీ పోస్కోతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో చెప్పడం గమనార్హం.
అది కూడా వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నిరుడు ఫిబ్రవరి 2న అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనినిబట్టి చూస్తే జగన్‌కు కచ్చితంగా తెలిసే ప్రైవేటీకరణ, పోస్కోతో ఒప్పందం నిర్ణయాలు జరిగినట్లు అవగతమవుతోంది.
కేంద్రం వెల్లడించిన తర్వాత కూడా ముఖ్యమంత్రి, ఆయన పార్టీ ఎంపీలు కిమ్మనలేదు. సీఎం సమీప సమీప బంధువు, కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ప్రభుత్వ రంగ సంస్ధల పార్లమెంటరీ కమిటీలో సభ్యుడు.
గత ఏడాది మార్చిలో ఈ కమిటీ దేశంలో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన నివేదికను కేంద్రానికి సమర్పించింది. విశాఖ ఉక్కు విక్రయ ప్రతిపాదన విషయం ఈ కమిటీకి స్పష్టంగా తెలుసు.
ఈ ప్రతిపాదనపై కడప ఎంపీ ఆ కమిటీ సమావేశాల్లో నిరసన తెలపలేదు. తన అభ్యంతరాన్ని రికార్డు చేయలేదు. మౌనంగా కూర్చున్నారు. జగన్ ఆదేశాలతోనే వైసీపీ ఎంపీలు విశాఖ ఉక్కు విషయంలో మౌనం పాటించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పుడు ఆయన, వారు ఏ స్థాయిలో డ్రామా ఆడుతున్నారో యావత ప్రపంచం చూస్తోంది.
ముఖ్యంగా విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు, విశాఖ ఉక్కు ఉద్యమ ప్రభావం లేకుండా చూసేందుకు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఏకంగా ఆ నగరంలో పాదయాత్ర చేశారు. పోరాటం చేయాల్సిన ఢిల్లీలో నోరెత్తకుండా కూర్చుని విశాఖలో పాదయాత్ర చేయడం వెనుక రాజకీయ దురుద్దేశమే ఉంది.
ఢిల్లీలో నోరెత్తితే కేంద్ర పెద్దలకు కోపం వస్తుందని భయం. కార్పొరేషన్ ఎన్నికల్లో విశాఖ ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడానికి పాదయాత్ర చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పోస్కో కంపెనీకి కట్టబెట్టడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసిన తర్వాతే ఆ కంపెనీ ప్రతినిధులను రాచమర్యాదలతో తాడేపల్లి ప్యాలెస్‌కు ఆహ్వానించి జగన్ చర్చలు జరిపారు.
నిజానికి వారు ఆయన గద్దెనెక్కిన కొద్ది రోజులకే వచ్చి కలిశారు. అప్పటి నుంచే విశాఖ ఉక్కులో పరస్పర ప్రయోజనాలపై వారి మధ్య తరచూ చర్చలు జరుగుతూ వచ్చాయి. ఒప్పందాలు కుదురుతున్నాయి.
పూటకో మాట..
ఉక్కు ప్రైవేటీకరణ వద్దని తాను ప్రధాని మోదీకి లేఖ రాశానని జగన్ చెప్పారు (రాశారో లేదో దేవుడికి తెలియాలి). అంతలోనే.. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ అని.. దానిపై రాషా్ట్రనికి ఎటువంటి అధికారం లేదని స్పష్టంచేశారు.
అయితే అందరూ కోరుతున్నట్లుగానే ప్రతిపక్షంతో కలిసి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దాని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేస్తామని విశాఖలో శారదాపీఠాధిపతి వద్దకు వెళ్లినప్పుడుస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న అఖిల పక్ష నేతలు ఆయన్ను ఎయిర్‌పోర్టులో కలిశారు. ఈ సందర్భంగా.. తాను మోదీకి రాసిన లేఖను చూపిస్తూ.. అందులోని సారాంశాన్ని వివరించారు.
తన లేఖకు కేంద్రం నుంచి సానుకూల సమాధానం వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. విశాఖ కర్మాగారానికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే.. నిరుపయోగంగా ఉన్న భూములను లేఅవుట్లుగా వేసి విక్రయిస్తే బాగా డబ్బులు వస్తాయని, వాటిని ప్లాంట్‌లో పెట్టుబడులుగా పెడితే సమస్యలన్నీ తీరిపోతాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
అయితే భూములపై కేంద్రానికే హక్కులు ఉన్నాయని, వారు ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే.. రాష్ట్రప్రభుత్వం తరపున ల్యాండ్ కన్వర్షన్‌కు సహకరిస్తామని చెప్పారు. పోస్కో బృందం తనను కలిసిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు.
అయితే తాను కడపలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుచేయాలని కోరగా.. వారు పెద్దగా ఆసక్తి చూపలేదన్నారు. తాజాగా ఆ బృందం కృష్ణపట్నం సందర్శనకు వెళ్లిందన్నారు. వారు భావనపాడు కూడా చూస్తున్నారని.. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుచేసే ఆలోచన వారికుందని తెలిపారు. కానీ తనతో సంప్రదించాకే కేంద్రం పోస్కోతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్న వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారు.
ఎయిర్‌పోర్టులో కార్మిక సంఘాల నేతలు తనను నిలదీస్తారనే భయంతో.. వైసీపీకి సన్నిహితంగా ఉండేవారినే పిలిచారని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న పలువురు నేతలు ఆరోపించడం వేరే విషయం.
ఎవరి మాటలు నిజం?
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు ప్రైవేటుపరం కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలు చేస్తున్న ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకు జగన్ పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. పోస్కో కంపెనీ విశాఖలో మరో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది.
ఇక్కడి పరిస్థితులన్నీ అధ్యయనం చేశాక.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో దఫదఫాలుగా చర్చించి, ఒప్పందం కూడా చేసుకుంది. స్టీల్ ప్లాంట్‌లో 3 వేల ఎకరాలు కావాలని పోస్కో డిమాండ్ చేయగా, తొలి దశలో 1,100 ఎకరాలు ఇవ్వడానికి అంగీకారం కుదిరిందని సమాచారం.
పనులు ప్రారంభించాక మిగిలిన భూములు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చినట్లు కార్మిక సంఘ నాయకులు చెబుతున్నారు. ఇంకోవైపు.. విశాఖ ప్లాంట్‌ను అమ్మి తీరతామని.. నూటికి నూరు శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల లోక్‌సభలో తెగేసి చెప్పారు.
జగన్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా వెల్లడించారు. అంతకుముందే ఏమీ తెలియదన్నట్లుగా విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేటీకరణపై ప్రశ్నించారు. ఉక్కు మంత్రి ప్రధాన్ స్పష్టంగా జవాబిచ్చారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ మిగులు భూముల్లో పోస్కో గ్రీన్‌ఫీల్డ్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తుందని, దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందం 2019 అక్టోబరులోనే జరిగిందని వెల్లడించారు. ఈ కొత్త ప్లాంట్‌లో పోస్కోకు 50 శాతం వాటా ఉంటుందని, స్టీల్‌ప్లాంట్ ఇచ్చే భూముల ఆధారంగా వాటా నిర్ణయిస్తారని పేర్కొన్నారు.
ఈ రెండు సంస్థలు సమాచారం ఇచ్చి పుచ్చుకోవడానికి జాయింట్ వర్కింగ్ గ్రూపును కూడా ఏర్పాటు చేసుకున్నాయన్నారు. పోస్కో విశాఖ రాదని జగన్ అంటున్నారు. దీనినిబట్టి ఎవరు అసత్యమాడుతున్నారో అర్థమైపోతోంది.
నాడు చంద్రబాబు అడ్డుకున్నారు..
నష్టాల సాకుతో విశాఖ ఉక్కును విక్రయించాలని వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్రం ప్రయత్నించింది. కానీ చంద్రబాబు గట్టిగా అడ్డుకున్నారు. పార్లమెంటులో కాంగ్రెస్, సీపీఎం ఎంపీలను కూడా కలుపుకొని ఆ ప్రతిపాదనపై టీడీపీ నిరసన తెలిపింది.
ఇప్పుడు వైసీపీ ఆ పని ఎందుకు చేయడం లేదన్నది ప్రశ్న. పైగా ఢిల్లీలో రసవత్తరంగా నాటకమాడుతున్నారు. ఆ పార్టీ ఎంపీలు మిథున్‌రెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, వంగా గీత, చింతా అనూరాధ, సత్యవతి, గొట్టేటి మాధవి తదితరులు కేంద్ర హోంమంత్రి అమితషాను కలిసి ప్రైవేటీకరణ వద్దని ఓ వినతి పత్రం సమర్పించారు.
ప్రధాని కార్యాలయంలో కూడా దాని ప్రతిని అందజేశారు. పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం జరిగిపోయిందని కరాఖండీగా చెప్పిన కేంద్ర మంత్రులు నిర్మల, ప్రధాన్లకు కూడా మొక్కుబడిగా ఆ వినతిపత్రాలు ఇచ్చారు.