రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కూడా వైసీపీదే ఘనవిజయమని, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను 175 వైసీపీ గెలుచుకుంటుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని సీఎం జగన్ పలు సందర్భాల్లో గట్టిగానే నొక్కి మరీ చెప్పారు. గత ఎన్నికల్లో తమకు ప్రజలు 151 సీట్లు కట్టబెట్టారని, ఈసారి తమ పార్టీని జనం 175 సీట్లలో గెలిపిస్తారని జగన్ ధీమాగా ఉన్నారు.
అయితే, ఈ మాటలు….వైసీపీ అభిమానులకు, కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలకు వినడానికి బాగానే ఉండొచ్చేమో గానీ…వాస్తవానికి 175 సీట్లకు 175 గెలుచుకోవడం అంత ఆషామాషీ విషయం ఏమీ కాదు. పైగా రాష్ట్రంలో నానాటికీ జగన్ సర్కారుపై వ్యతిరేకత పెరిగిపోతున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు గత ఎన్నికల మాదిరిగా నల్లేరు మీద నడక కాదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే జగన్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్య కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో జగన్ కు 51 శాతం మాత్రమే మద్దతు ఉందని, కాబట్టి పులివెందులలో గెలుపు కోసం ఏం చేయాలో జగన్ ఆలోచించాలని సత్యకుమార్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ విషయాన్ని తాను చెప్పడం లేదని, గత ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం కృషి చేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పారని అన్నారు.
పీకే సర్వేలో తన సొంత ఇలాకాలో బొటాబొటి మెజారిటీ తెచ్చుకున్న జగన్ రాష్ట్రంలోని 175 సీట్లు గెలవాలని తమ నేతలకు దిశానిర్దేశం చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇటీవల, కేంద్రం నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పీఎఫ్ఐ తో వైసీపీ పాలనను ఆయన పోల్చారు. ఈ రెండు పార్టీలు ఒకటేనంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీలవి విధ్వంసక ఆలోచనలేనని, రాష్ట్రంలో వైసీపీ విధ్వంసకర పాలనతో ముందుకు సాగుతుందని షాకింగ్ కామెంట్లు చేశారు.