- కొత్తగా వచ్చేవారికి సకల సౌకర్యాలట!!
- పరిశ్రమల విషయంలో జగన్ వింత వైఖరి
- మల్లవల్లి పార్కుపై నీలినీడలు
- రాష్ట్రానికి తరలివచ్చిన..
- పారిశ్రామికవేత్తలకు చుక్కలు
- నీళ్లు, రోడ్లు లేక నానా కష్టాలు
- మూడేళ్ల హబ్ కల ఆవిరి
తినడానికి తిండి లేదు గానీ.. మీసాలకు సంపెంగ నూనె కావాలన్నట్లుగా ఉంది జగన్ ప్రభుత్వ తీరు. ఉన్న పరిశ్రమలకు కనీస వసతులు కల్పించకుండా.. కొత్త వారికి సకల సౌకర్యాలు సమకూర్చుతామని డాబుసరిగా చెబుతోంది.
పరిశ్రమలు స్థాపించిన పారిశ్రామికవేత్తలను బెదిరించి.. వాటిలో వాటాలు తీసుకుంటూ.. కుదిరితే పూర్తిగా కబళించాలని చూస్తున్న ప్రభుత్వ పెద్దలను చూసి కొత్త పరిశ్రమలు పెట్టేందుకు రాష్ట్రానికి రావాలంటేనే భయపడుతున్నారు.
కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కు, విశాఖ ఐటీ పార్కుపై సీఎం జగన్మోహన్రెడ్డి శీతకన్ను వేశారు. ఇప్పటికే రాజధాని అమరావతి, దాని చుట్టుపక్కల ప్రాంతాలను నిర్వీర్యం చేశారు. విజయవాడ, గుంటూరు దరిదాపుల్లో పరిశ్రమలే ఉండకూడదని కంకణం కట్టుకున్నారు.
ఇందులో భాగంగా మల్లవల్లి పార్కుపై కత్తిగట్టారు. కృష్ణా జిల్లా మల్లవల్లిలో మోడల్ ఇండసి్ట్రయల్ పార్కును చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నవ్యాంధ్రపై అభిమానంతో పలువురు పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు తరలివచ్చారు.
ఎంతో ఉత్సాహంగా, పారిశ్రామికవేత్తలకు కొత్త కేంద్రంగా మారుతుందన్న ఆశతో ప్రారంభించిన ఈ పార్కు.. విజయవాడకు 43 కిలోమీటర్ల దూరంలో అప్పట్లో నూతన పారిశ్రామిక హబ్‌ను తలపించేది.
ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్.. ఇలా పలు రంగాల్లో ఉత్పత్తులు సాధిస్తున్న ఆంధ్ర, తెలంగాణ పారిశ్రామికవేత్తలెందరో తరలివచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. అలా ముందుకొచ్చిన వారందరికీ మూడేళ్ల క్రితం దాదాపు 1,341 ఎకరాల్లో స్థలాలు కేటాయించారు.
మరి ఈ స్థాయిలో కేటాయింపులు చేస్తే.. ఏ స్థాయిలో యూనిట్లు రావాలి! కానీ పార్కులో చెప్పుకోవడానికి అశోక్ లేలాండ్ లాంటి నాలుగైదుకు మించి ‘గట్టి’ యూనిట్లే లేవు. భూములు తీసుకొన్నవారు ఎకరానికి రూ.16.5లక్షలు చొప్పున డబ్బు చెల్లించారు. వారి పేరుమీద అమ్మకం అగ్రిమెంట్లు కూడా ఇచ్చారు. కానీ యూనిట్లు పెట్టి ఉత్పత్తి ప్రారంభించినవి చాలా తక్కువ.
ఉత్సాహంగా వచ్చిన పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, ప్రోత్సాహకాలు కరువవడమే దీనికి కారణం. మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్ర జాప్యం, రోడ్లు వేయకపోవడం, అప్రోచ్ రోడ్డు లేకపోవడం, చాలాకాలం పాటు కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించకపోవడం తదితర కారణాలు పార్కు ప్రగతిని దెబ్బతీశాయి.
మరోవైపు పలువురికి 20 అడుగులు, 30 అడుగుల లోతున్న గోతులను చూపించి.. ఇవే ప్లాట్లు అని చెప్పారు. వాటిని సరిచేసి, ఫిల్లింగ్ చేసి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యతను ఏపీఐఐసీ విస్మరించింది. దీంతో ఈ గోతుల్లో యూనిట్‌ను ఎలా పెట్టాలో తెలియడం లేదని పలువురు వాపోతున్నారు.
చాలామంది తమకు ఈ గోతుల సైట్లు వద్దని, మంచి స్థలాలు ఇవ్వాలని అడుగుతున్నారు. వచ్చినవారందరిపైనా జగన్ సర్కారు మొదటే కులముద్ర వేసేసింది. ఈ పార్కును పట్టించుకున్న పాపానే పోలేదు. పైగా అశోక్ లేలాండ్ అక్కడ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభించగానే తన ఘనతేనని చాటుకోవడానికి పెద్దఎత్తున ప్రచారం చేసుకుంది.
మల్లవల్లి పారిశ్రామిక యూనిట్లలోని సమస్యలతో విసిగిపోయిన పలువురు పారిశ్రామికవేత్తలు న్యాయస్థానాలను ఆశ్రయించారని సమాచారం. దాదాపు వందకుపైగా కేసులు అక్కడ పెండింగ్‌లో ఉన్నాయి. దీనినిబట్టే దాని పురోగతి ఎలా ఉందో అర్థమవుతోంది.
స్థలం కేటాయింపులోని అంశాల నుంచి మౌలిక సదుపాయాల కల్పన, అప్రోచ్ రోడ్డు ఏర్పాటు వరకు అనేక అంశాలపై పారిశ్రామికవేత్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే యూనిట్లు ఏర్పాటుచేసిన వారే అక్కడ సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడుతుండడంతో…ఇక కొత్తవారు తమ యూనిట్లను ప్రారంభించేందుకు అంత ఉత్సాహం చూపించడం లేదు.
అయితే భూమిమీద అంత పెట్టుబడి పెట్టి.. ప్రారంభించేందుకు అనువైన పరిస్థితులు లేకపోవడంతో తమకేం చేయాలో తోచడం లేదని అంటున్నారు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు.. పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిని కలిస్తే ఇది సీఎం పరిధిలోనిదంటూ తప్పించుకుంటున్నారు.
సీఎం అపాయింట్మెంట్ ఇవ్వరు. 13 నెలలుగా రెండు పరిశ్రమల యూనిట్ల యజమానులు సీఎం కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కనీసం సీఎంవో అధికారులు కూడా ఏదో ఒకటి తేల్చిచెప్పరు.
స్వరాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్, కర్ణాటకల నుంచి తరలివచ్చిన తమ పట్ల ఇంత నిరాదరణ చూపడంపై ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర రంగాలు కలగలిసి.. బహుళ ఉత్పత్తుల పారిశ్రామిక పార్క్‌గా అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించిన ఈ పార్కు.. జగన్ నిర్లక్ష్యం కారణంగా దీనావస్థకు వెళ్లింది.
ఎండమావులే..
ఏ పారిశ్రామిక యూనిట్‌కైనా తొలుత కావాల్సింది పారిశ్రామికవేత్తలే. అసలంటూ పెట్టుబడి పెట్టేవారుంటే.. భూమి, మౌలిక సదుపాయాల కల్పన చేయడం తేలికే. అలాంటిది మల్లవల్లి పార్కులో భూమి సిద్ధంగా ఉంది.. యూనిట్లను ప్రారంభించేవారూ ఉన్నారు.. అందులోనూ రాష్ట్రంపై ప్రేమతో తరలివచ్చారు.
ప్రభుత్వం మారడంతో ఇది అటకెక్కింది. ఫలితంగా మళ్లీ వారు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారు. అయితే ఇప్పటికే భూములు కొన్నందున పూర్తిగా నిష్క్రమించడానికి మనసు రావడం లేదు.
ఎప్పటికైనా జగన్ మనసు మారకపోతుందా అని వారు ఎదురుచూస్తున్నారు. వారు ఎండమావులను చూసి నీరుగా భ్రమిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉన్నవాటిని నాశనం చేస్తూ.. ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రం పారిశ్రామికంగా ఎదుగుతుందని.. ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని.. అప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని జగన్ పదే పదే ఊదరగొడుతున్నారు.
గుర్తుకు వచ్చినప్పుడల్లా ప్రధాని మోదీకి లేఖలు రాస్తుంటారు. ఇటీవల సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ ఇదే మాట చెప్పారు. ఇప్పటికే ఉన్నవాటికి చిత్తశుద్ధితో చేయూతనిచ్చి.. మౌలిక వసతులు కల్పిస్తే.. ప్రత్యేక హోదాతో పనిలేదని కొందరు పారిశ్రామికవేత్తలు అంటున్నారు.
హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం తెగేసిచెప్పాక అది ముగిసిన అధ్యాయమేనని చెప్పాలి. రానిదాని కోసం వెంపర్లాడడం కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనన్న విమర్శలు వస్తున్నాయి.