టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర పలమనేరు నియోజకవర్గంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. 6వ రోజు పాదయాత్ర సందర్భంగా నక్కపల్లి గ్రామంలో భూముల రీసర్వే సరిహద్దు రాళ్ళను లోకేష్ పరిశీలించారు. భూ సర్వే తర్వాత భూమి తక్కువ చేసి చూపిస్తున్నారని, బలవంతంగా పాస్ బుక్ చేతిలో పెడుతున్నారని లోకేష్ దగ్గర రైతులు వాపోయారు. సమస్య ఉంటే అర్జీలివ్వాలని చెప్పి వెళ్లిపోతున్నారని, ఎన్నో ఏళ్లుగా ఉన్న భూమి ఎలా తగ్గుతుందని వారు ప్రశ్నిస్తున్నారు.
భూముల రీ సర్వే పేరుతో భారీ స్కాం జరుగుతోందని లోకేష్ ఆరోపించారు. రైతుల భూములు జగన్ రెడ్డి కొట్టేస్తున్నాడని, అది భూరక్ష కాదు జగన్ రెడ్డి భూ భక్ష అని ఎద్దేవా చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని, జనం భూమిని డ్రోన్ సర్వే పేరుతో జగన్ ప్రభుత్వం దోచుకోవాలని చూస్తోందని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే జగన్ దోచుకున్న భూమి తిరిగి ప్రజలకి ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
మరోవైపు, కొలమాసనపల్లిలో మహిళలతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. రూ.5 లక్షలు లోన్లు ఇస్తామని మాటిచ్చి ఇప్పటిదాకా ఇవ్వలేదుని, ఇంటి పన్నులు పెంచి, తమ భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. ఎవరికీ చెప్పుకునే పరిస్థితి లేదని, ఎమ్మెల్యే, పోలీసులు కూడా వైసీపీ వాళ్లనే పట్టించుకుంటున్నారని గోడు వెళ్లబోసుకున్నారు.
మాయమాటలతో మహిళలను జగన్ మోసం చేశారని, 45సంవత్సరాల వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు పెన్షన్లు ఇస్తామని ఇవ్వలేదని దుయ్యబట్టారు. అమ్మఒడి కూడా ఒక్కరికే ఇస్తున్నాడని, సంపూర్ణ మద్య నిషేధం పేరుతో కల్తీ మద్యం తెచ్చి ప్రజల ప్రాణాలు బలిగొంటున్నాడని మండిపడ్డారు. ఏపీలో మద్యం మాత్రం పురుగుల మందుల్లాగా పనిచేస్తున్నాయని సెటైర్లు వేశారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నులను సరిచేసి, నిత్యావసర ధరలు తగ్గించడానికి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. వైసీపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చెరుకు రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతామని భరోసానిచ్చారు. వైసీపీ పాలనలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారిందని, టీడీపీ అధికారంలోకి వచ్చాక పాత ఉచిత ఇసుక విధానం తీసుకొస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.