ప్రపంచ స్థాయి రాజధాని నగరం, నవ్యాంధ్ర రాజధాని అమరావతి విషయంలో మే 2019 తర్వాత ఏం జరిగింది? అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిర్మాణాలు చేపట్టింది? ఎంత మేరకు ఖర్చు చేసింది?
గతంలో అంటే.. మే 2019కి ముందు ఏం జరిగింది? ఎన్ని నిర్మాణాలు సాగాయి? ఎవరెవరు ఇక్కడ పెట్టుబడులు పెట్టారు? ఎన్ని కాంట్రాక్టులు కొనసాగాయి? హ్యాపీ నెస్ట్ కింద ఎంత మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరింది. `అమరావతి ఇటుక` ఆన్లైన్ కలెక్షన్ ఎంత?.. ఇలా అనేక ప్రశ్నలకు జగన్ ప్రభుత్వం తడుముకోకుండా సమాధానం చెప్పేసింది.
విజయవాడ, గాంధీనగర్ ప్రాంతానికి చెందిన అడ్వొకేట్ పి. పాల్.. అమరావతికి సంబంధించిన అంశాలపై గత ఏడాది డిసెంబరు 22న ప్రభుత్వానికి పైవిధంగా పలు ప్రశ్నలు సంధించారు. సమాచార హక్కు చట్టం కింద.. ఆయన అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. వాటి వివరాలు ఇవ్వాలని కోరారు.
పాల్ అభ్యర్థనకు ప్రభుత్వం స్పందించింది. అమరావతి మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ.. పాల్ అడిగిన ప్రతిప్రశ్నకు తడుముకోకుండా సమాధానం చెప్పేసింది. ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఇప్పటి వరకు ఏం జరిగింది? మే 2019 తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసింది? అనే విషయాలను వివరించింది.
ఇవీ సమాధానాలు..
+ అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలకు గత ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రభుత్వ భవనం, హైకోర్టు, అసెంబ్లీ, మండలి భవనాలను తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టింది. అదేసమయంలో అమరావతిలోని భూమిలేని పేదకు పింఛన్ ఇచ్చింది. దీనిని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు.
+ గత 2019, మే వరకు 245 పనులకు సంబంధించిన టెండర్లు చేపట్టారు. మొత్తం 21.7 వేల కోట్లు ఖర్చు చేశారు.
+ 129 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు అమరావతిలో 1227 ఎకరాలు కేటాయించారు.
+ 2019, మే తర్వాత ఒక్క రూపాయి కూడా అమరావతి నిర్మాణాలకు, అభివృద్ధికి ఖర్చు చేయలేదు.
+ అయితే.. ఇక్కడివారికి పింఛన్లు మాత్రం అందిస్తున్నారు. అదేవిధంగా హడ్కో రుణాలకు వడ్డీలు కడుతున్నారు. అమరావతి బాండ్లకు త్రైమాసికం చొప్పున వడ్డీలు చెల్లిస్తున్నారు.
+ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1500 కోట్లు ఇచ్చింది. ఇది గ్రాంట్ ఇన్ ఎయిడ్.
+ అమరావతి బాండ్ల ద్వారా .. 2 వేల కోట్లు అందాయి
+ హ్యాపీ నెస్ట్ ద్వారా 93,48,22,551 రూపాయలు ప్రభుత్వానికి చేరాయి.