- ఫిబ్రవరి వరకు 17 వేల కోట్ల పైమాటే
- మార్చి దాటితే 20 వేల కోట్లు రావచ్చు
- మధ్యలో ఒక నెలంతా బంద్
- అయినా భారీగా వచ్చిన రాబడి
- మద్య నిషేధ రాష్ట్రంలో విడ్డూరం
‘మద్యంపై వచ్చే ఆదాయం మాకొద్దే వద్దు. దశలవారీగా మద్య నిషేధం చేయబోతున్న మాకు మందుపై వచ్చే ఆదాయం అవసరమే లేదు. మా చర్యలతో విక్రయాలు భారీగా పడిపోయాయి. రాష్ట్రంలో తాగేవారి సంఖ్య చాలా తగ్గింది’ అని నవ్యాంధ్ర సీఎం జగన్మోహన్రెడ్డి, ఆయన మంత్రులు మొదట్లో ఊదరగొట్టారు.
ఆ మాటలు బూటకాలని తేలిపోయింది. గత ఆర్థిక సంవత్సరం (2019-20) మొత్తంలో మద్యంపై ప్రభుత్వానికి రూ.17,500 కోట్లు ఆదాయం వస్తే.. కరోనా కాలంలోనూ ఈ ఏడాది (2020-21) ఫిబ్రవరికే రూ.17 వేల కోట్ల ఆదాయం వచ్చేసింది. మార్చి ముగిసేసరికి 20 వేల కోట్లు దాటినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
నిజానికి కరోనా కారణంగా మార్చి 25 నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు మందు విక్రయాలు పూర్తిగా బంద్ అయ్యాయి. బార్లు దాదాపు నాలుగు నెలలు మూత పడ్డాయి. షాపుల సంఖ్య 500కుపైగా తగ్గించేశారు. ఉపాధి పనుల్లేక ప్రజలు నానా కష్టాలు పడ్డారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో మద్యం ఆదాయం తగ్గిపోవాలి.
కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అన్ని అవరోధాలనూ అధిగమించి భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. మద్య నిషేధానికి పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్న రాష్ట్రంలో ఇలా జరగడం విశేషమే మరి!
అన్ని రంగాలూ కుదేలైనా..
కరోనా కారణంగా 2020-21లో అన్ని రంగాలూ దెబ్బతినిపోయాయి. ఆదాయార్జన రంగాలైన స్టాంపులు, రిజిస్ర్టేషన్లు, రవాణా, మైనింగ్ లాంటివి కూడా ఆదాయంలో కుదేలయ్యాయి. ఎక్సైజ్ శాఖ మాత్రం అందుకు భిన్నంగా ఆదాయాన్ని అనుకున్నంత తెచ్చిపెట్టింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అధికారికంగానే ఎక్పైజ్ ద్వారా రూ.7,500 కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్లో పేర్కొంది. దానిపై వ్యాట్ కలిపితే దాదాపు రూ.20 వేల కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా. గతేడాది రూ.17,500 కోట్లకు ఇది రూ.2500 కోట్లు ఎక్కువ.
కానీ ఊహించని విధంగా మధ్యలో వచ్చిన కరోనా అందరి అంచనాలు తారుమారు చేసింది. కరోనా వల్ల మద్యం షాపులు నెల పాటు పూర్తిగా మూసేయాల్సి వచ్చింది. అయినా ప్రతి ఏటా 12 నెలల్లో వచ్చే ఆదాయం ఈ ఏడాది 11 నెలలకే వస్తోంది.
నిషేధం ఉత్తుత్తదే!
ఓ వైపు మద్య నిషేధ చర్యలు అనేకం తీసుకున్నా ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ 1,69,72,429 కేసుల లిక్కర్, 48,65,367 కేసుల బీరు అమ్ముడైంది. వీటి మొత్తం విలువ రూ.18,620 కోట్లు. ఇందులో ఉత్పత్తిదారుల వ్యయం, షాపుల నిర్వహణ, ఇతర ఖర్చులు తీసేసినా రూ.17 వేల కోట్లకు పైగా ఇప్పటికే ఆదాయం వచ్చింది.
అత్యధికంగా విశాఖపట్నంలో రూ.2,360 కోట్లు, తూర్పుగోదారిలో రూ.1,979 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లోనూ భారీ మందు అమ్ముడైంది. దీంతో ప్రభుత్వం తీసుకున్న దశలవారీ నిషేధ చర్యలన్నీ ఉత్తుత్తివేనని తేలిపోయింది. ప్రధానంగా 4380 మద్యం షాపుల్లో 33,శాతం షాపులు తగ్గించి ప్రస్తుతం 2,900కి కుదించారు.
మూడో వంతు షాపులు తగ్గించారు కాబట్టి అమ్మకాలు కూడా తగ్గిపోతాయని ప్రభుత్వ పెద్దలు చెబుతూ వచ్చారు. మద్యం షాపుల వద్దే మందు తాగేందుకు వీలుండే పర్మిట్ రూమ్‌లను పూర్తిగా తొలగించారు. పలుమార్లు మద్యం ధరలను పెంచారు. ఇన్ని చర్యలు తీసుకున్నా అమ్మకాలు ఎక్కడా తగ్గనేలేదు.
ప్రతికూల పరిస్థితులున్నా మద్యం అమ్మకాలు తగ్గకపోతే, ఇక నిషేధ చర్యల వల్ల ఉపయోగం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ నిజంగా అమ్మకాలు తగ్గించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే షాపుల్లో సరుకు కూడా తగ్గించాలి. అలా కాకుండా షాపుల సంఖ్య తగ్గించి, ఉన్న షాపుల్లోనే భారీగా మద్యం అందుబాటులో ఉంచితే అమ్మకాలు ఎలా తగ్గుతాయి?
ప్రభుత్వ దుకాణాల నుంచి ఒకేసారి భారీగా మద్యం తెచ్చి బెల్టు షాపుల్లో అమ్ముతున్నా పట్టించుకోవడం లేదు. గతంలో వ్యవస్థీకృతంగా అక్కడక్కడా బెల్టులు షాపులుంటే, ఇప్పుడు గ్రామానికి ఐదారు బెల్టులు తెరపైకి వచ్చాయి.
పొరుగు మద్యానికే ఎన్నికల్లో డిమాండ్
ఎన్నికలు వచ్చాయంటే… నోట్లు పంచాల్సిందే. మద్యం ప్రియులకు ‘క్వార్టర్’ కొట్టాల్సిందే! కానీ… ఏపీలో దొరికే ‘చీప్’ మద్యమే మహా ఖరీదైపోయింది. పైగా… పిచ్చి బ్రాండ్లతో ఏమాత్రం నాణ్యతలేని సరుకు! ‘ఏపీ సరుకు’ ఇచ్చి ఓటు అడిగితే… ‘ఛీ.. పో! ఇంత చీపా’ అని ఛీదరించుకునే ప్రమాదం ఉంది.
పైగా… అదే చీప్ సరుకుకు భారీ ధర పెట్టాలి. ఈ రెండు సమస్యలకు పరిష్కారంగా… అభ్యర్థులు పొరుగు మందుకు జై కొట్టారు. అంతా అధికార పార్టీ హవా కావడంతో… తనిఖీలు కూడా చూసీచూడనట్లుగా జరిగాయి. ఎన్నికల సమయంలో ఇక్కడి మద్యం విక్రయాలు భారీగా ఉంటాయనుకోగా… ఆ అంచనాలు తలకిందులయ్యాయి.
మందుబాబులు తమకు ఏపీ లిక్కర్ అక్కర్లేదని, పొరుగు రాష్ర్టాల నుంచి పాత బ్రాండ్లు తెప్పించి ఇవ్వాలని షరతులు పెడుతున్నారు. దీంతో పోలీసులు, ఎస్ఈబీని తప్పించుకుని రాష్ట్రంలోకి పొరుగు మద్యం తెచ్చుకోవాల్సిన భారం అభ్యర్థులపై పడింది.
మరీ ముఖ్యంగా తెలంగాణ నుంచి భారీగా మద్యం తీసుకొచ్చారు. దీని ఫలితంగా… ఏపీలో ఎన్నికల సందడి తెలంగాణ ఎక్సైజ్‌కు లాభాల వర్షం కురిపించింది.
పాపులర్ బ్రాండ్లు మాయం..
జగన్ ప్రభుత్వం వచ్చాక మంచి మద్యం అనుకున్న పాపులర్ బ్రాండ్లు కనుమరుగయ్యాయి. మునుపెన్నడూ చూడని, వినని బ్రాండ్లు తెరపైకి వచ్చాయి. దీనిపై మద్యం వినియోగదారుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా ప్రభుత్వం వెనకడుగు వేయకుండా అవే వింత బ్రాండ్లను రుద్దుతోంది.
చివరకు ఫలానా బ్రాండ్ కావాలని అడిగే స్థితి నుంచి ఫలానా ధర మందు కావాలి అని అడిగే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే వచ్చిన స్థానిక ఎన్నికల్లో మందుప్రియులు బ్రాండ్ల విషయంలో కొండెక్కి కూర్చున్నారు. ‘ఈ పిచ్చి మందు ఇస్తే ఓట్లు వేయం. మంచిది పోస్తేనే వేస్తాం’ అని హెచ్చరించడంతో అన్ని తనిఖీలను తట్టుకుని మరీ తెలంగాణ, కర్ణాటకల నుంచి మద్యం తీసుకొచ్చారు.
రాష్ట్రంలో మొత్తం 13 వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సగటున ఒక్కో పంచాయతీకి ఒక్కో అభ్యర్థికి 4 వేల క్వార్టర్ల మద్యం సీసాలు అవసరమని అంచనా వేసుకున్నారు. అంటే రెండు పార్టీలూ సగటున 8 వేల క్వార్టర్ల వరకూ పంపిణీ చేశాయన్న మాట. దాని ప్రకారం నాలుగు విడతల్లో 13 వేల గ్రామ పంచాయతీలకు 10కోట్ల క్వార్టర్ సీసాలు పంపిణీ అయ్యాయి.