పేషీ లేదు.. పీఏ లేడు.. అటెండర్లూ లేరు..
ఫైళ్లు పంపరు.. మీటింగ్‌లకూ పిలవరు
ప్రభుత్వం మారినా పదవి నుంచి తప్పుకోలేదన్న కక్ష
రూల్-17 ప్రకారం కీలకాధికారాలన్నీ చైర్మన్‌కే
అయినా అధికారాలన్నీ సెక్రటరీ గుప్పిట్లోకి
హైకోర్టు, గవర్నర్ జోక్యంతోనూ మారని తీరు
గ్రూప్-1 ఇంటర్వ్యూల రద్దులోనూ ఏకపక్షమే
అది రాజ్యాంగబద్ధ సంస్థ. నిరుద్యోగుల కలలు సాకారానికి నియమించిన సంస్థ. దాని పేరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ). దాని చైర్మన్‌కు ఎన్నో కీలక అధికారాలు ఉంటాయి.
ప్రస్తుతం పిన్నమనేని ఉదయభాస్కర్ చైర్మన్‌గా ఉన్నారు. ప్రభుత్వ కొలువులకు జరిగే పరీక్షలన్నీ ఆయన ఆధ్వర్యంలోనే జరగాలి. కానీ జగన్ ప్రభుత్వం ఆయనపై కక్షగట్టింది. ఇదేదో నామినేటెడ్ పోస్టు అనుకుంది.
చంద్రబాబు ప్రభుత్వం పడిపోయింది కాబట్టి ఆయనా రాజీనామా చేయాలని భావించింది. అయితే ఆయన పదవీకాలం కు ఈ ఏడాది నవంబరు 26 వరకు ఉంది. ఆయన తనంత తాను వైదొలగలేదని.. ఆయనపై యథాప్రకారం కులముద్ర వేసేశారు.
రెండేళ్లుగా నానా అవమానాలకు గురిచేస్తున్నారు. ఆయన అధికారాలన్నీ హైజాక్ చేసేశారు. కనీసం ఆయన ఉనికినే గుర్తించడం లేదు., ఆయనకో పేషీ లేదు. పీఏ లేడు. చివరకు ఆయన చాంబర్ తెరిచేందుకు అటెండర్ కూడా లేడు.
ఆయన లేకుండానే ముఖ్యమైన సమావేశాలు జరిగిపోతున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. అదే ఏడాది నవంబరు 25న ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఉదయభాస్కర్‌ను నియమించింది.
అప్పటినుంచి నాలుగున్నరేళ్ల పాటు కమిషన్ పాలన పద్ధతి ప్రకారమే నడిచింది. కానీ 2019లో జగన్ గద్దెనెక్కడానే ఏపీపీఎస్సీలో పరిస్థితులు మారాయి.
ప్రభుత్వం మారింది కాబట్టి చైర్మన్ పదవికి రాజీనామా చేయాలంటూ ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు తమదైన శైలిలో ఒత్తిడి తెచ్చారు. ఆయన అంగీకరించకపోవడంతో పరిణామాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా చూపించడం మొదలుపెట్టారు.
సెక్రటరీ సర్వాధికారి..
రూల్-17 ప్రకారం ఏపీపీఎస్సీలో కీలక అధికారాలన్నీ చైర్మన్వే. ఇప్పుడు అవన్నీ కమిషన్ కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. జగన్ అధికారానికి తలొగ్గిన కమిషన్ సభ్యులు చైర్మన్‌కు సహకారం అందించడం మానేశారు. చైర్మన్ ఆధ్వర్యంలో ఒక్క నిర్ణయమూ తీసుకోవడం లేదు.
నిబంధనల ప్రకారం అడ్మినిస్ట్రేషన్, ఎగ్జామినర్ల నియామకం, ఇంటర్వ్యూ బోర్డుల ఏర్పాటు, సభ్యులకు పని కేటాయింపు, సమావేశాల నిర్వహణ, అజెండా, మినిట్స్ తయారీ వంటి కార్యకలాపాలన్నీ కూడా ఆయన అధీనంలోనే జరగాలి. ప్రస్తుతం ఇవేమీ జరగడం లేదు.
కమిషన్ చైర్మన్ గానీ, ఆయన లేకుంటే సీనియర్ సభ్యుడు గానీ సమావేశాలకు అధ్యక్షత వహించాల్సి ఉండగా.. ఈ కార్యక్రమం ఇప్పుడు ఆంజనేయులు కనుసన్నల్లోనే నడుస్తోంది. రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన ఈ సంస్థ తన అస్తిత్వాన్ని కోల్పోయి ప్రభుత్వంలోని ఓ ఉప విభాగంగా మారిపోయింది.
గవర్నర్ అధికారాలూ హైజాక్
2019 డిసెంబరు నుంచే ఉదయభాస్కర్‌ను పనిచేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. చాంబర్‌కు వచ్చి కూర్చోలేని పరిస్థితులు కల్పించారు. చైర్మన్ ఉండగానే ఎలాంటి సమాచారం, కారణం లేకుండా కమిషన్ సభ్యుడు రంగ జనార్దన్‌ను ఇన్చార్జి చైర్మన్‌గా నియమించారు.
వాస్తవానికి ఇన్చార్జి చైర్మన్‌ను నియమించే అధికారం గవర్నర్‌కు మాత్రమే ఉంది. అంటే గవర్నర్ అధికారాలను కూడా హైజాక్ చేశారన్న మాట. దీనిపై ఉదయభాస్కర్ హైకోర్టుకు వెళ్లగా.. సదరు ఇన్చార్జి నియామకం చెల్లదని తీర్పు చెప్పింది.
అప్పటి నుంచి కక్ష సాధింపులు ఎక్కువయ్యాయి. ఆయనకు పేషీ గానీ, పీఏ గానీ లేకుండా చేశారు. చివరకు చైర్మన్ రూం తెరిచేందుకు డోర్ అటెండర్ సైతం లేడు. ఆయన చాంబర్లో ఉన్న సీసీ కెమెరాలు తొలగించారు. రూం లాక్ చేయడంతో చైర్మన్ మరోసారి హైకోర్టును ఆశ్రయించగా, ఎవరైనా అడ్డుకుంటే క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించింది.
ఏపీపీఎస్సీలో తనకు కొనసాగుతున్న సహాయ నిరాకరణ, నిబంధనల ఉల్లంఘనపై ఆయన మూడుసార్లు గవర్నర్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. అయినా ప్రయోజనం లేకపోయింది.
గత ప్రభుత్వం 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ల తాలూకు రిక్రూట్మెంట్లను ఆయనతో ప్రమేయం లేకుండానే పూర్తి చేశారు. చైర్మన్ అనుమతి, సంతకాలు లేకుండానే ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటు చేసుకుని ప్రక్రియలను నిర్వహించారు.
గ్రూప్-1 పరీక్షల్లో స్కాం!
రాష్ట్ర సర్వీసుల్లో కీలకమైన గ్రూప్-1 పరీక్షల్లో భారీ కుంభకోణం హైకోర్టు సాక్షిగా బయటపడింది. అభ్యర్థులకు తెలియజేయకుండా.. మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలను ఏపీపీఎస్సీ డిజిటల్ విధానంలో థర్డ్ పార్టీ చేత కమిషన్ మూల్యాంకనం చేయించింది.
ఏ రాష్ట్రంలోనూ ఇలా జరగదు. అభ్యర్థుల అభ్యంతరాలను ఖాతరు చేయకుండా హడావుడిగా ఇంటర్వ్యూలు కూడా పిలిచింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
ప్రధాన పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయని.. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని, అదేవిధంగా ప్రధాన పరీక్షను తిరిగి నిర్వహించేలా ఆదేశించాలని పిటిషన్లు కోరారు. దీనిపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
ఇంటర్వ్యూలను నాలుగు వారాలపాటు నిలిపివేసింది. ‘రాజ్యాంగంలోని315 నుంచి 320 అధికరణల ప్రకారం గ్రూప్-1 సివిల్ సర్వెంట్లను నియమించే బాధ్యతను రాజ్యాంగం ఏపీపీఎస్సీకి అప్పగించింది. కమిషన్ నిబంధనల ప్రకారం.. పరీక్షకు సంబంధించిన అంశాలను సమీక్షించే అధికారం చైర్మన్‌కు ఉంది.
2020 అక్టోబరు 28న నిర్వహించిన సమావేశానికి చైర్మన్ ఎందుకు హాజరుకాలేదో.. దీనికి కారణాలేంటో కోర్టుకు సమర్పించిన వివరాల్లో పేర్కొనలేదు. నిబంధన 17 ప్రకారం పరీక్ష నిర్వహించారో లేదో స్పష్టత లేదు. ఏపీపీఎస్సీ మూల్యాంకనం కోనం థర్డ్ పార్టీని ఎంపిక చేసేందుకు ఏవిధమైన విధి విధానాలు పాటించారో పేర్కొనలేదు.
జవాబు పత్రాల మూల్యాంకనం చేసిన వారి అర్హతపై పిటిషనర్లు అభ్యంతరాలు లేవనెత్తినప్పుడు.. ఆ వివరాలను చెప్పాల్సిన బాధ్యత ఏపీపీఎస్సీకి ఉంది. కౌంటర్ అఫిడవిట్లో అలాంటి వివరాలు లేవు’ అని స్పష్టం చేసింది. దీంతో కోర్టుపైనా ప్రభుత్వం కోపం పెంచుకుంది.
ఎలాంటి అధ్యయనం చేయకుండా.. హడావుడిగా ఏపీపీఎస్సీ గ్రూప్ పరీక్షలన్నిటికీ ఇంటర్వ్యూలను రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. డిజిటల్ మూల్యాంకనంలో కుంభకోణం బయటపడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. అయితే 2018 నాటి నోటిఫికేషన్లో ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు.
ఇప్పుడు ఆకస్మికంగా రద్దుచేయడం కుదరదు. రాబోయే నోటిఫికేషన్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వివాదాస్పద నిర్ణయం ఎంతవరకు చెల్లుబాటవుతుందో చూడాలి.