కీలక వ్యాఖ్య ఒకటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో పోలిస్తే.. భావోద్వేగంగా తాను ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కమిట్ మెంట్ తనకు ఎంత ఎక్కువన్న విషయాన్ని ఆయన తాజాగా మరింత సూటిగా చెప్పుకున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం తపిస్తున్న చంద్రబాబు కానీ పవన్ కల్యాణ్ కు కాని లేని క్వాలిటీ తనకు మాత్రమే ఉందన్నట్లుగా జగన్ మాటలు ఉండటం ఆసక్తికరంగా మారాయి.
ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన శాంఖారావం బహిరంగ సభ సూపర్ సక్సెస్ కావటం.. ఆ వెంటనే తెలంగాణలోనూ.. ఏపీలోనూ చంద్రబాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు వీలుగా వరుస ప్రెస్ మీట్లను పెట్టేస్తున్న పరిస్థితి ఇలాంటి వేళ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం తనకున్న ప్రత్యేకతను.. చంద్రబాబుకు లేని క్వాలిటీని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ తన రాష్ట్రమని.. తన ప్రాధాన్యత రాష్ట్రానికేనని.. తన నివాసం కూడా ఏపీలోనే అంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘ఇదే నా రాష్ట్రం. ఇక్కడే నా నివాసం. ఇక్కడే నా మమకారం. ఐదు కోట్ల ప్రజలే నా కుటుంబం. ప్రజల సంక్షేమమే నా విధానం’ అంటూ కీలక వ్యాఖ్యలు చేసిన జగన్.. తాను దేవుడినని.. ప్రజల్నే నమ్ముకున్నట్లు చెప్పారు. అదే సమయంలో తన రాజకీయ ప్రత్యర్థులకు లేని క్వాలిటీ గురించి చెబుతూ.. వారిలో అదేమీ లేదన్న మాటను చెప్పేశారు. ‘నేను దేవుడ్ని.. ప్రజల్నే నమ్ముకున్నా. చంద్రబాబులా దత్తపుత్రుడ్ని.. ఎల్లో మీడియాను నమ్ముకోలేదు. గత ప్రభుత్వంలో ఏ పథకం కావాలన్నా లంచాలే. మనందరి ప్రభుత్వంలో లంచాలు లేవు. వివక్ష లేదు’ అని స్పష్టం చేశారు.
జగన్ నోటి నుంచి వచ్చిన మాటల్ని విన్నప్పుడు నిజమే కదా? ఆయన మాటల్లో ఎంత నిజం ఉందన్న భావన కలుగుతుంది. ఇలా మాటలతో మనసుల్ని దోచేసే శక్తి జగన్ కు కాస్త ఎక్కువే. కాకుంటే.. తర్కానికి పదును పెట్టి ఆయన చెప్పిన మాటలకే ప్రశ్నలు తగిలించి.. దాని గురించి వెతికితే అసలు విషయాలు ఇట్టే అర్థమవుతాయి. ఉదాహరణకు ఏపీలోనే తనకు ఇల్లు ఉందని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి.. అదే సమయంలో తాడేపల్లిలోని ఇంటితో పోలిస్తే.. అందుకు కొన్ని రెట్లు ఎక్కువగా ఉండే బెంగళూరు ప్యాలెస్ కానీ.. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ మాటేంటి?
ఆ విషయాన్ని పక్కన పెడదాం. నా రాష్ట్రం అంటూ పలువరిస్తున్న జగన్ కు.. ఆ భావన ఎప్పటి నుంచి ఉంది? మొదట్నించి ఉంటే.. తన మొదటి రాజ ప్రసాదం లాంటి ఇంటిని బెంగళూరులో ఎందుకు నిర్మించారు? ఆ తర్వాత హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకున్నారు? ఇవన్నీ పక్కన పెడదాం. ఆయన వ్యాపార సంస్థల్లో ముఖ్యమైన జగతి పబ్లికేషన్ విషయానికి వద్దాం. ఏపీ తన రాష్ట్రమన్నప్పుడు.. ఏపీకి ముఖ్యమంత్రిగావ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి.. తన కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థ జగతి పబ్లికేషన్ ను రిజిస్ట్రేషన్ చేసిందెక్కడ? దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందన్న విషయాన్ని చూసినప్పుడు తెలంగాణ అన్న మాట కనిపిస్తుంది.
మరి.. తాను ఏపీకి చెందిన వాడన్న మాటను జగన్ చెబుతున్న వేళ.. తమకు చెందిన జగతి పబ్లికేషన్ ను తెలంగాణ కింద రిజిస్ట్రేషన్ చేసి ఉండటం ఏమిటి? సరే.. ఉన్నదేదమో ఉన్నది తాను ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక కూడా హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎందుకు మార్చలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇదిలా చూసినప్పుడు రాజ ప్రసాదాల్లాంటి నివాసాలే కాదు.. తన వ్యాపారాల్లో కీలకమైన జగతి పబ్లికేషన్ పొరుగు రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కావటం ఏమిటి? దాన్ని ఎందుకు మార్చుకోలేదంటారు ముఖ్యమంత్రి వారు? ఈ ప్రశ్నలకు జగన్ నోటి నుంచి వచ్చే సమాధానం ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.