ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది నెలలుగా వింత పరిస్థితి సంగతి తెలిసిందే. సీఎం జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు…అధికారులతో పాటు ఆ ప్రాంత జనం కూడా ఉలికి పడుతున్నారు. జగన్ వెళ్లేదారిలోని దుకాణదారులు బెంబేలెత్తుతున్నారు. జగన్ వెళ్లే దారిలో చెట్లు కొట్టివేయడం, పరదాలు కట్టడం వంటి వ్యవహారాలపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా సరే, అంతా నా ఇష్టం అన్న రీతిలో వ్యవహరిస్తున్న జగన్…పద్ధతి మాత్రం మార్చుకోవడం లేదు.
ఏపీలోని ఈ పరిస్థితి చూసి జనం బెంబెలెత్తుతుంటే..తాజాగా ఈ తరహా వ్యవహారం తెలంగాణకూ పాకింది. సీఎం కేసీఆర్ కూడా జగన్ ను చూసి స్ఫూర్తి పొందినట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ పర్యటన సందర్భంగా సింగరేణి ప్రాంతంలో ఫంక్షన్ హాళ్ల నిర్వాహకుల తీరు అక్కడి జనానికి షాక్ ఇచ్చింది. నెల రోజుల క్రితం బుక్ చేసుకున్న ఫంక్షన్ హాల్ ను కూడా కేసీఆర్ పర్యటన నేపథ్యంలో రద్దు చేసిన వైనం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
మంచిర్యాల జిల్లా నస్పూర్ కు చెందిన పోతు సత్యనారాయణకు కేసీఆర్ షాక్ తగిలింది. సింగరేణి గనుల్లో సపోర్ట్ మ్యాన్ గా పనిచేస్తున్న ఆయన…తన కుమార్తె శిరీష వివాహాన్ని జూన్ 9న నిశ్చయించారు. పెళ్లి కోసం సింగరేణి గార్డెన్స్ ఫంక్షన్ హాల్ ను చాలా రోజుల క్రితమే బుక్ చేశారు. కానీ, జూన్ 9న కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఆ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు చెప్పిన మాట విని సత్యన్నారాయణకు షాక్ తగిలింది.
జూన్ 9న సీఎం కేసీఆర్ వస్తున్నారని, పెళ్లికి ఫంక్షన్ హాల్ ఇవ్వలేమని, మరో ఫంక్షన్ హాల్ చూసుకోవాలని సింగరేణి గార్డెన్స్ నిర్వాహకులు చెప్పడంతో సత్యన్నారాయణ అవాక్కయ్యారు. ఈ ఒక్క హాలే కాదు…జూన్ 9న మంచి ముహూర్తాలు ఉన్న నేపథ్యంలో ఆ రోజున చాలా పెళ్లిళ్లున్నాయి. కేసీఆర్ టూర్ నేపథ్యంలో, వాటి బుకింగ్ కూడా రద్దు చేసే యోచనలో నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇలా ఫంక్షన్ హాల్ నిర్వాహకుల నుంచి షాకింగ్ న్యూస్ రావడంతో వధూవరుల తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు.