సీఎం జగన్ అధ్యక్షతన నేడు జరిగిన వైసీఎల్పీ సమావేశంలో జగన్ సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణ, మంత్రులపై వేటు, ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వంటి అంశాలతో ఈ సమావేశం వాడీవేడిగా జరిగిందని సమాచారం. ఏప్రిల్ 2వ తేదీ ఉగాది రోజు ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మార్చి 27న మంత్రులంతా రాజీనామా చేయబోతున్నారట.
పనితీరు, సామాజిక సమీకరణాల ఆధారంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నానిలను జగన్ కొనసాగించబోతున్నారట. బుగ్గన, బాలినేనిలకూ కొనసాగింపు దక్కే చాన్స్ ఉందట. బొత్సకు పార్టీ రీజినల్ కమిటీ బాధ్యతలు, విజయసాయికి విజయవాడలో పార్టీ కేంద్ర కార్యాలయ బాధ్యతలు అప్పగించాలని జగన్ అనుకుంటున్నారట. మరోసారి మహిళనే ఏపీ హోం మంత్రిగా చూడాలని జగన్ భావిస్తున్నారట. బీసీలకు 50 శాతం మంత్రి పదవులు, మహిళలకు 33 శాతం మంత్రి పదవులు ఫిక్స్ అయ్యాయట.
ఐదు సామాజిక వర్గాల నుంచి అయిదుగురు డిప్యూటీ సీఎంలు, మహిళా మంత్రులుగా మూడు రీజియన్ల నుంచి ముగ్గురికి అవకాశం దక్కనుందట. కొత్తగా ఏర్పడనున్న 25 జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కేలా కేబినెట్ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. బీసీ వర్గాల్లో ఇప్పటివరకు అవకాశం దక్కని సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యతనిస్తారని తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి నాలుగు, బీసీ – ఎస్సీ వర్గాలకు ప్రస్తుత కేబినెట్ లో ఉన్న నిష్ఫత్తిలో, ఉభయ గోదావరి జిల్లాల్లో పాత సమీకరణాల ఆధారంగా, రాయలసీమ నుంచి బీసీ వర్గాల ప్రాధాన్యత ప్రకారం మంత్రి పదవులు దక్కే అవకాశముందట.
ఇక, 50 మంది ఎమ్మెల్యేలపై పనితీరుపై ఇంటిలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్న జగన్…వారికి రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారట. పనితీరు, ఆరోపణలు, పార్టీ పట్ల నిబద్దత, పార్టీ మారే అవకాశం ఉన్న ఇంకొందరిపై వేటు వేయాలని జగన్ ఫిక్సయ్యారట. తొలిసారి ఎన్నికైన 30 మంది ఎమ్మెల్యేలు, 12 మంది సీనియర్ ఎమ్మెల్యే, 8 మంది మహిళా ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తితో ఉన్న జగన్ వారిపై వేటు వేసే చాన్స్ ఉందట.