బిహార్ ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంది. 2015 ఎన్నికల్లో ఉందా..లేదా.. అన్నట్టుగా ఉన్న బీజేపీ.. ఇప్పుడు మాత్రం 76 చోట్ల విజయం సాధించింది.. రెండో అతిపెద్దపార్టీగా అవతరించింది. ఇది నిజానికి రికార్డే! అయి తే.. ఈ ఎఫెక్ట్.. ఏపీ అధికార పార్టీలో గుబులు రేపింది. ఏమాత్రం ప్రభావం లేని రాష్ట్రంలో అనూహ్యంగా బీజే పీ పుంజుకోవడం.. ఆ పార్టీ నేతలను కలవరపరుస్తోంది.
మరీముఖ్యంగా.. బీజేపీ జెండా కూడా పెద్దగా ఎగరని నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ పుంజుకోవడం మరింతగా జగన్ బృందాన్ని బాధల్లోకి నెట్టేసిందనే టాపిక్ విని పిస్తోంది. దీని వెనుక ఈవీఎంల ట్యాంపరింగ్ ఏమైనా జరిగిందా? అనే కోణంలో మెదళ్లకు పదును పెంచేసింది.
అంతే! ఇంకేముంది.. జగన్ పత్రిక సాక్షిలో దీనికి సంబంధించిన వార్తలు గుప్పుమన్నాయి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసేందుకు అనేక అవకాశాలు ఉన్నాయంటూ.. మేధావులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నా రని కథనాలను రాసేశారు. బీహార్లో బీజేపీ బలం అంతంత మాత్రమేనని.. అలాంటి చోట ఏకంగా 76 స్థానాల్లో కమలదళం పుంజుకోవడం ఏమిటనే విస్మయం.. మేధావులు వ్యక్తం చేస్తున్నారంటూ. రాసుకొచ్చిన జగన్ పత్రిక.. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండదని, అనుమానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటూ.. అవసరమైన చోట మాత్రం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసుకునే అవకాశం ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నట్టు పేర్కొంది.
అంటే.. మొత్తంగా అటు బీహార్, ఇటు దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు గుర్రం ఎక్కడం వెనుక ఈవీఎంలే ఉన్నాయనే కారణాన్ని పరోక్షంగా స్పష్టం చేసేసింది జగన్ పత్రిక. ఈ పరిణామాలతో అదే పరిస్థితివచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏర్పడితే.. తమ పరిస్థితి ఏంటనే భయం వైసీపీ నేతల్లో మొదలైందని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి 2019 ఎన్నికల్లోనూ ఇలాంటిదేదో జరిగి ఉంటుందని అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నెత్తీ నోరూ బాదుకున్నారు. తమకు కంచుకోటలైన నియోజకవర్గాల్లోనూ బలహీన స్థాయికి చేరిపోవడంపై ఆయన ఆశ్చర్యంవ్యక్తం చేశారు.
అంతేకాదు.. తాము పసుపు-కుంకుమ వంటి కీలక పథకాలను ప్రవేశ పెట్టామని.. వీటిని అందుకున్న మహిళలు.. అర్ధరాత్రి వరకు పోలింగ్ బూత్ల వద్ద నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని.. అలాంటప్పుడు తమకు కాక ఇంకెవరికి వేస్తారని.. ఇక్కడేదో మతలబు ఉందని పేర్కొంటూ.. ఆయన గగ్గోలు పెట్టారు. ఈ క్రమంలో కేంద్రంలో బీజేపీ వైపు వేళ్లు కూడా చూపించారు. కానీ, ఆ సమయంలో వైసీపీ నేతలు.. మాత్రం బాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక, జగన్ పత్రిక అయితే.. మరింత దూకుడుగా వ్యవహరించి.. ఈవీఎంలను బ్రహ్మాస్త్రాలుగా పేర్కొంది.
ఈవీఎంలు నిబద్ధతకు గీటురాళ్లని, పంచభూతాలకు అతీతమని.. చెరిపేస్తే.. చెరిగిపోవని, కాల్చేస్తే.. కాలిపోవని, మార్చేస్తే.. మారిపోవని.. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే.. చంద్రబాబు వంటివారు కాలుకాలిన కోతిలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ.. కథనాలు వండివార్చింది. ఇప్పుడు అదే పత్రిక, అదే పార్టీ.. నేతలు.. అవే ఈవీఎంలపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. ఏదైనా సరే.. తనదాకా వస్తేనే కానీ తెలియదంటారు అందుకే!! ఇప్పుడు వైసీపీ ఎలాంటి వాయిస్ వినిపిస్తుందో చూడాలి. వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలను కావాలంటుందో.. వద్దంటుందో కూడా గమనించాలి.