అనుకోనిది ఘటన చోటు చేసుకుంది. అమాయక ప్రజలు మరణించారు. శోక సంద్రంలో బాధితుల కుటుంబాలు ఉన్నాయి. అలాంటివేళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం చేస్తారు? అన్న ప్రశ్న అడిగితే.. మౌనంగా ఉంటారనో.. విపక్షానికి లింకు పెట్టి తిట్టి పోస్తారనో.. ఇలా ఎవరికి తోచిన సమాధానం వారు చెబుతారు. దీనికి కారణం.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇవి మాత్రమే తెలుసు కనుక. రాష్ట్రంలో ఏం జరిగినా సరే.. అయితే తమకు సంబంధం లేదన్నట్లుగా మిన్నకుండిపోవటం లేదంటే.. ఏదోలా విపక్ష లింకు బయటకు తీసి.. వారిపై విరుచుకుపడటం చూస్తుంటాం.
అందుకు భిన్నంగా వ్యవహరించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఆయన.. విపక్షాల విషయంలోనూ.. వారిని విమర్శించే విషయంలోనూ ఎలాంటి మొహమాటానికి గురి కారు. కానీ.. సంబంధం లేకున్నా.. వారి ప్రస్తావన తెచ్చి రాజకీయం చేయాలనుకోరు. తమ ప్రభుత్వం కారణంగా నష్టం వాటిల్లితే.. అదే విషయాన్ని చెప్పి.. దయచేసి క్షమించండి.. అని నిండు మనసుతో కోరుతారు.
తాజాగా జరిగిన ఒక దుర్ఘటన విషయంలో ఆయన ఇదే రీతిలో రియాక్టు అయ్యారు. ఈ రోజు ఉదయం ముంబయిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక మాల్ ను ప్రైవేటు ఆసుపత్రిగా మార్చటం.. అందులో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం జరిగి పెద్ద ఎత్తున ప్రాణనష్టం వాటిల్లింది. దీనిపై అనవసరమైన రచ్చ చేయని మహా సర్కారు.. సూటిగా తన తప్పును ఒప్పేసుకుంది. అంతేకాదు.. గంటల వ్యవధిలోనే ప్రమాదస్థలికి చేరుకున్న ఆయన పరిస్థితిని పరిశీలించారు.
‘‘ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాల వారిని క్షమించమని వేడుకుంటున్నా. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తాం. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తాం. మరణించిన వారిలో అత్యధికులు వెంటిలేటర్ మీద ఉన్న వారే. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకుసంతాపం ప్రకటిస్తూనే.. క్షమాపణలు వేడుకుంటున్నా’ అని ఉద్దవ్ పేర్కొన్నారు. ఇదంతా చూసినప్పుు రెండు తెలగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు నేర్చుకోవాల్సింది చాలానే ఉందన్న భావన కలుగక మానదు. కాదంటారా?
విజయవాడలో ఒక బిల్డింగులో అగ్నిప్రమాదం జరిగితే బాధితులను సీఎం అసలు పట్టించుకోలేదు. నష్టపరిహారం ఒకటి ప్రకటించి సరిపెట్టారు. పైగా ఆ సంఘటనను రాజకీయ కక్ష సాధింపుకోసం వాడుకున్నారు. మనసున్న ముఖ్యమంత్రిగా ఉద్దవ్ ప్రవర్తిస్తే… ఏపీ ముఖ్యమంత్రి శవ రాజకీయం చేశారు.