సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. అమరావతి రాజధానిగా కొనసాగడం ఇష్టం లేని జగన్….మూడు రాజధానులంటూ అమరావతిని నిర్వీర్యం చేశారు. అమరావతిలో చేపట్టిన నిర్మాణాలను అర్ధాంతరంగా వదిలేసిన జగన్…అమరావతే రాజధాని అని హైకోర్టు చెప్పినప్పటికీ డెడ్ లైన్ లోపు పెండింగ్ లోని నిర్మాణాలను పూర్తి చేయడం చేతకాదంటూ చేతులెత్తేశారు.
ఇక, అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేస్తామన్న వంక చెప్పి అక్కడి భూములకు జగన్ బేరం పెట్టడంపై కూడా విమర్శలు వచ్చాయి. అమరావతిలో వందల కోట్ల విలువైన భూముల విక్రయానికి ఏపీసీఆర్డీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక, అమరావతి కోసం రైతులు ఇచ్చిన విలువైన భూములలో జగనన్న కాలనీలు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంపై కూడా విమర్శలు వచ్చాయి.
అమరావతి భూములలో 500 ఎకరాలను ఇళ్ల పట్టాలకు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కోర్టు కొట్టేసినా…జగన్ మాత్రం దొడ్డిదారిలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి భూముల పందేరానికి తెరతీశారు. ఈ నేపథ్యంలోనే జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మండిపడ్డారు. రైతుల నుంచి సేకరించిన భూములను దిగమింగేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. సీఆర్డీయే, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ చట్టాలకు ఇష్టానుసారం సవరణను చేస్తూ రాజధాని నిర్మాణ స్ఫూర్తిని దెబ్బతీస్తోందని విమర్శించారు.
అమరావతిలో ఎలాంటి అభివృద్ధి పనులను చేయకపోగా… ఆ భూములను కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. మాస్టర్ ప్లాన్ లో మార్పులు, చేర్పులు చేసేందుకు అవకాశం ఇస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.