ఏపీ ముఖ్యమంత్రి జగన్ గురించి.. నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా విందు, వినోదా లకు దూరంగా ఉండే నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఎప్పుడో తప్ప.. అంతగా ఇలాంటి కార్య క్రమాల్లో పాల్గొనరు.
అయితే.. తాజాగా హైదరాబాద్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి మనవరాలి వివాహానికి ముఖ్యమంత్రి జగన్ హాజరుకావడంపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి విందులకు హాజరు కావడం అవసరమా? అనే ప్రశ్నను సంధిస్తున్నారు.
గడిచిన ఐదు రోజులుగా రాయలసీమ ప్రాంతంలోని మూడు జిల్లాలు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పరిస్థితి భీతావహంగా ఉంది. అదేసమయంలో ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప అయితే.. వరద నీటిలో నానుతోంది. ఇక నెల్లూరులోనూ వరద సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు.
రోజుల తరబడి ఇక్కడి ప్రజలు ఆహారం నీరు లేక.. కంటిపై కునుకు లేక.. ఇళ్లు నేలమట్టమై.. లబోదిబో అంటున్నారు. ఇలాంటి సమయంలో జగన్ వారికి అండగా ఉండేందుకు.. క్షేత్రస్థాయిలో పర్యటించి ఉంటే బాగుండేదని.. సూచిస్తున్నారు. అలా కాకుండా.. కేవలం అధికారులకు వదిలేసి.. ఆయన వివాహ వేడుకలకు హాజరుకావడం ఏంటని నిలదీస్తున్నారు.
ఈ సందర్భంగా గతంలో తుఫాన్లు, వరదలు వంటివి వచ్చినప్పుడు.. వృద్ధుడు అయినప్పటికీ.. అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అహోరాత్రులు.. సచివాలంలోనే ఉండి.. సమీక్షించిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఇక, టీడీపీ అదినేత చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన తుఫాన్ల వేళ.. ప్రజలను ఆదుకునేందుకు ఆయన ఎంతో శ్రమించారని.. కేవలం ఆఫీసుకే పరిమితం కాకుండా.. ఆయన క్షేత్రస్థాయిలో ప్రజలకు ఊరట కలిగించేందుకు కృషి చేశారని. దీనివల్ల ప్రజల్లో నైతికస్థయిర్యం పెరిగి.. బాధను మరిచిపోయిన సంఘటనలు ఉన్నాయని. కానీ, ఇప్పుడు సీఎం జగన్ వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోందని అంటున్నారు.
వైసీపీలోని ఓ వర్గం నాయకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చేయాల్సింది ఎలాగూ చేస్తారు. ఆదుకుంటారు. అయితే.. ప్రజలను ఊరడించే సమయంలో ఇలా వ్యవహరించడం.. కేవలం అధికారులపైనే భారం వేయడం వంటివి సరిగా లేవని.. వారు అభిప్రాయపడుతుండడం గమనార్హం.
ఇది విపక్షానికి మరిన్ని ఆయుధాలు అందిచినట్టు అయిందని అంటున్నారు. ఏదేమైనా.. ప్రస్తుతం ముంచెత్తిన వరదలతో ప్రజలు మాత్రం తిప్పలు పడుతున్నారు.