ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను మార్చేస్తారా? ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ చేష్టలకు ఆయన ముకుతాడు వేయడం లేదా? ప్రభుత్వ పాలన, సీఎంను కట్టడి చేయడంలో గవర్నర్ ఉదాసీనంగా ఉన్నారా? ఈ నేపథ్యంలో గవర్నర్‌ను మార్చే దిశగా కేంద్రంలోని బీజేపీ నేతలు అడుగులు వేస్తున్నారా? అంటే.. తాజా పరిణామాలను గమనిస్తున్న పరిశీలకులు ఔననే అంటున్నారు. ఏపీలో వైసీపీ సర్కారు ఏర్పడి 16 నెలలు గడిచాయి. అయితే, తొలి ఏడాది ఒకింత ఫర్వాలేదనుకున్న తర్వాత నుంచి ముఖ్యమంత్రి జగన్ వ్యవహార శైలి.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ను మించిపోయిందనే భావన సర్వత్రా వినిపిస్తోందని అంటున్నారు.
రాజధాని అమరావతిని మార్చడం, ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులను ప్రతిపాదించడం.. విద్యత్ పీపీఈల ఒప్పందాలను తిరగదోడడం, భారీ ఎత్తున రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుండడం.. తాజాగా న్యాయవ్యవస్థపై బురద జల్లే చర్యలకు స్వయంగా ముఖ్యమంత్రే పూనుకోవడం వంటివాటిని చూస్తూ కూడా గవర్నర్ సీఎంను మందలించలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. ఇక, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ బాబు వ్యవహారంలోనూ ముఖ్యమంత్రి కులం పేరును ఆపాదించి చేసిన రగడ, హుటాహుటిన తమిళనాడు నుంచి రిటైర్డ్ జడ్జి కనగరాజ్‌ను తీసుకువచ్చి.. ఎన్నికల కమిషనర్‌గా నియమించడం వంటివి అనైతికమైనప్పటికీ.. గవర్నర్ నిలువరించలేక పోయారనే వాదన ఉంది.
పైగా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ను తిరిగి నియమించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం, ఈ విషయంలోనూ గవర్నర్ సరైన విధంగా జోక్యం చేసుకోకపోవడం వంటివి బీజేపీ పెద్దలకు ఆగ్రహం తెప్పించాయనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగి.. ఆలయాల్లో విగ్రహాలను ధ్వసం చేసినా.. అంతర్వేది రథం దగ్ధం, విజయవాడ కనకదుర్గ దేవాలయంలో రథానికి ఉన్న వెండి సింహాల చోరీ వంటి ఘటనలను కూడా జగన్ ప్రభుత్వం నాన్ సీరియస్‌గా తీసుకుంది. ప్రజల విశ్వాసాలు, మనోభావాలతో ముడిపడిన ఇలాంటి కీలక విషయాల్లో ప్రభుత్వం అనుసరించిన వైఖరిని గవర్నర్కట్టడి చేయలేకపోయారనేది బీజేపీ పెద్దల భావన.
రాజ్యాంగ బద్ధమైన న్యాయవ్యవస్థపై వైసీపీ నాయకులు కుట్రలు చేయడం, న్యాయమూర్తులకు కూడా కులాలు ఆపాదించడం, హైకోర్టు ఇచ్చిన తీర్పులకు కూడా దురుద్దేశాలను ఆపాదిస్తూ.. సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వంటివి వెలుగు చూసినప్పుడే.. గవర్నర్ వాటిని ఖండిచి.. సీఎంను పిలిపించి హెచ్చరించి ఉంటే బాగుండేదని.. కానీ, ఆయన కూడా లైట్ తీసుకోవడంతో ముఖ్యమంత్రి జగన్ పగ్గాలు లేకుండా రెచ్చిపోతున్నారని బీజేపీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఏకంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి, త్వరలోనే ప్రధాన న్యాయమూర్తిగా కూడా ప్రమోట్ అయ్యే జస్టిస్ ఎన్వీ రమణను కూడా రాజకీయ రచ్చలోకి ముఖ్యమంత్రి లాగారనే అభిప్రాయం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్‌ను మార్చి.. ముఖ్యమంత్రిని అజమాయిషీ చేసేలా వ్యూహాలు సిద్ధమవుతున్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.