ప్రజలను తనను ఎందుకంత ఘోరంగా ఓడించారో ఆలోచనా లేదు.. ఆత్మవిమర్శా లేదు.. క్షేత్ర స్థాయిలో ఏం జరిగిందో వైసీపీ నేతలతో కనీసం సమీక్షలు కూడా లేవు. గుడ్డెద్దు చేలో పడిన రీతిలో నోటికి వచ్చినట్లు పేలడమే జగన్ నైజం. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా మనిషిలో ఆవగింజంతైనా మార్పు లేదు. ప్రజలపైనే గౌరవం లేని వ్యక్తి.. వారిచ్చిన తీర్పును స్వాగతిస్తారని ఆశించడం పొరపాటే. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తంచేశారు.
ఇక భవిష్యతలో పేపర్ బ్యాలెట్‌కే వెళ్లాలని పిలుపిచ్చారు. ఇదే పేపర్ బ్యాలెట్లపై నిరుడు మూడు పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరిగితే.. మూడింటిలోనూ టీడీపీ అభ్యర్థులను విద్యావంతులు భారీ మెజారిటీతో గెలిపించిన విషయాన్ని ప్రజలు మరచిపోయి ఉంటారని ఆయన భావిస్తున్నట్లు కనబడుతోంది. జనం భూములు కొట్టేసేందుకు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టే తన కొంప ముంచిందని ఆయన గ్రహించడం లేదు.
ప్రతి ఇంటికీ సంక్షేమం అందించామని.. లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాలో వేశామని.. వారి ఆప్యాయత, అభిమానం ఏమయ్యాయోనని జగన్ వాపోయారు. నిజంగా అంత సంక్షేమం అంది ఉంటే జనం ఎందుకు ఓడిస్తారు? అందులో ఎన్ని లొసుగుతున్నాయో ఆయనకు తెలుసా? తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారా?
ఉచితాలతో అభివృద్ధి అడగరని..
ప్రజలకు ముష్టి వేస్తే చాలు.. తానెంత అడ్డగోలుగా దోచుకున్నా అడిగేవాడు ఉండడన్నది జగన్ నిశ్చితాభిప్రాయం. రూపాయి ఉచితంగా ఇస్తే అభివృద్ధి గురించి ఎవరూ మాట్లాడరని ఆయన నేరుగా తన సహచరులు, అధికారులతోనే అంటారని ఆయన పార్టీ నేతలే చెబుతుంటారు. 2009లో తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇలాగే రెండోసారి గెలిచారని.. అప్పట్లో రూ.60గా ఉన్న సామాజిక పింఛన్‌ను రూ.200 చేశారని.. ఉచిత విద్యుత ఇచ్చారని.. తానూ రూ.3 వేలు పింఛను ఇస్తున్నానని.. అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్ద, రైతులకు ఏటా రూ.13,500 (కేంద్రం ఇచ్చే 6 వేలతో కలిపితే) అందిస్తున్నానని.. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఏదో రూపంలో సాయం అందుతోందని.. అందుచేత తనకే జనం ఓట్లేశారని.. పాజిటివ్ సైలెంట్ ఓటింగ్ జరిగిందని పోలింగ్ తర్వాత తన పార్టీ వందిమాగధులతో తెగచెప్పారు.
అయితే 2014లో చంద్రబాబు నవ్యాంధ్ర తొలి సీఎం కాగానే.. రూ.200 పింఛన్‌ను ఒకేసారి వెయ్యి రూపాయలు చేశారు. 2019 జనవరి నుంచి దానిని రూ.2 వేలు చేశారు. అధికారంలోకి వచ్చాక రూ.3 వేలు చేస్తామన్నారు. అయితే 2019లో జనం జగన్‌ను నమ్మారు. కానీ ఆయన గద్దెనెక్కిన తొలి ఏడాదిలో రూ.250 మాత్రమే పెంచారు. అంటే 2,250 మాత్రమే ఇచ్చారు. ఇదేమిటని విపక్షాలు, మీడియా నిలదీస్తే.. ఐదేళ్లలో 3 వేల వరకు పెంచుకుంటూ పోతానని చెప్పానని.. తన యాస మీకు అర్థం కాలేదని బుకాయించారు.
ఇది విని జనం బిత్తరపోయారు. ఐదేళ్లలో వెయ్యి రూపాయలను అప్పుడు కాస్త అప్పుడు కాస్త పెంచుతూ ఈ ఏడాది జనవరి నుంచి 3 వేలు చేశారు. 2014-19 నడుమ చంద్రబాబు ఎంత సంక్షేమం, అభివృద్ధి చేసినా.. జనం ఒక్క చాన్స్ కోరిన జగన్‌కు పట్టం కట్టారు. దక్కిన చాన్స్‌ను నిలబెట్టుకోవడానికి ఆయన చేసింది శూన్యం. రాజధాని అమరావతిని సర్వనాశనం చేసి.. బాబు చేసిన అభివృద్ధి ఆనవాలే కనిపించకుండా చేయడానికి జనం సొమ్ముతో నిర్మించిన ప్రజావేదికను నిర్దయగా కూల్చివేయించారు. నాటి నుంచి కుర్చీ దిగిపోయేదాకా ఆ విధ్వంసాన్ని ఆయన కొనసాగించారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును అటకెక్కించారు.
మద్యనిషేధమని చెప్పి..
2019లో జగన్ సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చి మహిళల ఓట్లు వేయించుకున్నారు. కానీ ఉన్నవాటిని తీసివేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపులు పెట్టారు. కమీషన్లు ఇవ్వలేదని పాపులర్ బ్రాండ్లను తీసివేశారు. కనీవినీ ఎరుగని కొత్తరకం జగన్ బ్రాండ్లను తీసుకొచ్చారు. ఈ ఐదేళ్లూ అవే అమ్మారు. జనం ఉసురుతీశారు. వారిని అనారోగ్యం పాల్జేశారు. ఊపిరితిత్తుల నుంచి కిడ్నీల వరకు దెబ్బతిన్నవారు కనీసం 62 లక్షల మంది ఉన్నారని ప్రభుత్వ వర్గాల అంతర్గత సర్వేలో తేలింది. ప్రైవేటు డిస్టిలరీలను ఆక్రమించుకుని.. వాటిలో నాసిరకం, ప్రాణాంతక మద్యం తయారుచేసి జనంలోకి వదిలారు.
అంతేకాదు… పాపులర్ బ్రాండ్లకు మించిన ధరలు వసూలు చేశారు. డిజిటల్ పేమెంట్లు లేవు.. పేపర్ రశీదులే కావడంతో అమ్మిన మందుకు, వచ్చిన ఆదాయానికి లెక్కలే లేకుండా పోయాయి. అటు చెత్త మద్యంతో పురుషుల ఒళ్లు, మహిళల ఇళ్లు గుల్లయిపోయాయి. భవిష్యతలో 25 ఏళ్ల మద్యం విక్రయాలను తాకట్టుబెట్టి మరీ వేల కోట్లు అప్పుగా తీసుకొచ్చారు.
గంజాయికి బానిసలు..
జగన్ ఈ ఐదేళ్లలో కొత్త పరిశ్రమలను తీసుకురాకపోగా.. ఉన్నవాటిని సైతం తరిమివేశారు. ఉపాధి కోల్పోయి యువత రోడ్డునపడ్డారు. వారు తిరుగబడకుండా ఉండేందుకు గంజాయిని ప్రయోగించారు. వారిని దానికి బానిసలుగా మార్చారు. హైస్కూళ్ల నుంచి విశ్వవిద్యాలయాల వరకు ఎక్కడ చేసినా గంజాయిని విచ్చలవిడిగా విక్రయించారు. ఇక మంగళగిరి, విశాఖల నుంచి ఐటీ పరిశ్రమలను తరిమివేయడంతో.. ఐటీ సంబంధ ఉద్యోగాలు చేసుకునేవారు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు. రాష్ట్రంలో భవన నిర్మాణ రంగమే అత్యధికులకు ఉపాధి అవకాశాలు కల్పించేది.
జగన్ అధికారంలోకి వచ్చీ రాగానే ఇసుక దొరక్కుండా చేశారు. సిండికేట్‌గా ఏర్పడి సిమెంటు ధరలు పెంచేశారు.. ఎమ్మెల్యేలకు కప్పం కట్టనిదే ఎవరూ ఇల్లు కట్టుకోవడానికి వీల్లేని పరిస్థితులు తెచ్చారు. ముందుగానే రియల్ ఎస్టేట్ వ్యాపారులను భయపెట్టడంతో వారు కూడా పనులు ఆపేశారు. దీంతో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు కుదేలయ్యారు. కూలి పనులు చేసుకునేవారు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాలకు వలసోయారు. ఇవన్నీ జనం మరచిపోయి జగన్‌కు ఎలా ఓట్లు వేస్తారు?
అప్పుడు జగన్ ఏమన్నారు?
2019 ఎన్నికల్లో వైసీపీ అనూహ్యంగా 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాలు గెలవడం చూసి సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. ఈవీఎంలలో ఏదో తేడా ఉందని విమర్శలు గుప్పుమన్నాయి. దీనిపై జగన్ ఘాటుగా స్పందించారు. ‘80 పర్సెంట్ జనాభా ఓటు వేశారు. బటన నొక్కిన తర్వాత ఏ పార్టీకి ఓటు వేశారో వీవీ ప్యాట్‌లో వాళ్లకు కనిపిస్తా ఉంది. ఏ ఓటరు కూడా కంప్లయింట్ చేయలేదు. నేను ఉన్నాను.
ఫ్యాను గుర్తుకు నొక్కినాక వీవీప్యాట్‌లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే ఎందుకు గమ్మునుంటా? బూతలో అక్కడే ఉండి గొడవ చేసి ఉండేవాడిని కదా! చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే అన్నీ బాగున్నాయి.. ప్రజలు తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తే మాత్రం ఎంత దారుణంగా డెమోక్రసీని అవహేళన చేస్తూ.. ప్రజల తీర్పును అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే.. ఈ మనిషి నిజంగా మనిషేనా’ అని చంద్రబాబును విమర్శించారు. నిజానికి ఒక్క చాన్స్ నినాదంతోనే జగన్ గెలిచారని చంద్రబాబు తొలుత అన్నారు. ఈవీఎంలలో తేడా ఉందని ఆయన అనలేదు. కానీ గుమ్మడికాయ దొంగలా జగన్ భుజాలు తడుముకున్నారు.
తాజా ఉవాచ..
2024లో ఓడిపోయాక జగన్‌లో ఇన్నాళ్లూ లేని ప్రజాస్వామ్యవాది పుట్టుకొచ్చాడు. ‘న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు. జరిగినట్లు కనిపించాలి కూడా. అలాగే ప్రజాస్వామ్యం గెలవడంతో పాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి కూడా. ప్రపంచం మొత్తమ్మీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్న అత్యధిక దేశాల్లో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారు. ఈవీఎంలు కాదు. ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దిశగా ముందుకు కదలాలి’ అని ఆయన ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.
ప్రజాతీర్పును జగన్ ఏ మాత్రం గౌరవించరనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం.. 2014లో టీడీపీ-బీజేపీ కూటమిని ప్రజలు గెలిపించినప్పుడు.. చంద్రబాబు ఇచ్చిన తప్పుడు హామీలు నమ్మి జనం ఆయనకు ఓట్లేశారని అన్నారు. 2019లో వైసీపీ గెలిచాక ఈవీఎంలపై ఆరోపణలు వచ్చినప్పుడు.. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తీర్పునూ అపహాస్యం చేశారని విమర్శించారు. అదే 2024లో ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఓడించడంతో తట్టుకోలేక.. వారి ఆప్యాయత, అభిమానం ఏమయ్యాయోనని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
మాట తప్పను.. మడమ తిప్పనని పదే పదే చెప్పుకొనే జగన తీరు చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతోందని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఓటమిని జీర్ణించుకోలేక ప్రజాతీర్పును కించపరుస్తూ.. తప్పంతా ఈవీఎంలపై నెట్టేయడంపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. ఓటమికి కారణాలను విశ్లేషించుకుని వాటిని సరిదిద్దుకోకపోగా.. కుంటిసాకులు చెబితే జనం నమ్మరని వారు అంటున్నారు. ఎన్నికల్లో ఓటమి రుచి చూసిన ఆ పార్టీ నేతలంతా ఇందుకు జగనే కారణమని.. ఆయన తప్పుడు విధానాల వల్లే ఓడిపోయామని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును అమలు చేయవద్దని ఎంత చెప్పినా జగన వినలేదని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసారి రాంభూపాల్‌రెడ్డి బాహాటంగానే అన్నారు. గడప గడపకూ పర్యటించినప్పుడు ఈ చట్టంపై ప్రజాగ్రహం పెద్దఎత్తున వ్యక్తమైందని.. ఈ యాక్టు అమలు నిర్ణయమే తమ కొంప ముంచిందని మెజారిటీ అభ్యర్థులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. మహిళలు వైసీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. కూటమికి సానుకూలంగా ఓట్లు వేశారంటూ పోలింగ్ తర్వాత జగనను తాడేపల్లిలో కలసినప్పుడు సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు చెప్పారు.
కానీ ఆయన పట్టించుకోలేదు. గతంలో గెలిచిన 151 సీట్ల కంటే ఎక్కువే వస్తాయని దబాయించారు. కానీ జనం తనకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 సీట్లే ఇవ్వడంతో తట్టుకోలేక తప్పంతా ఈవీఎంలదే అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇదే నిజమైతే 2019లో ఆయన గెలుపు ఈవీఎంలను తారుమారు చేయడం వల్లే వచ్చిందా అని రాజకీయ వర్గాలు నిలదీస్తున్నాయి.
పట్టభద్ర ఎన్నికలు బ్యాలెట్ పేపర్లు కావా?
ఎన్నికలకు ఏడాది ముందు జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైసీపీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఆ ఎన్నికలు ఈవీఎంలతో కాకుండా కాకుండా బ్యాలెట్ పేపర్లతోనే జరిగాయి. జగన్ ఓటమికి అంకురార్పణ పట్టభద్ర ఎన్నికల్లోనే జరిగింది. గత ఏడాది ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు తప్ప మిగిలిన అన్ని జిల్లాల పట్టభద్ర ఓటర్లు ఆ ఎన్నికల్లో పాల్గొన్నారు. మొత్తం మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలు ఒక నియోజకవర్గం కాగా… ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు రెండో నియోజకవర్గంగా, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు మూడో నియోజకవర్గంగా ఉన్నాయి. ఈ ఎన్నికలు జరిగే నాటికి చంద్రబాబు అరెస్టు జరగలేదు. అప్పటికి టీడీపీకి ఏ పార్టీతోనూ పొత్తు లేదు. ఈ మూడు చోట్లా వైసీపీ, టీడీపీ పోటీ చేశాయి. మొత్తం 5 లక్షల మంది పట్టభద్రులైన ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. వీరందరూ బ్యాలెట్ పేపర్లు వినియోగించి ఓట్లు వేశారు. ఓటర్లు ఈ ఎన్నికల్లో ప్రాధాన్య క్రమం ప్రకారం ఓటు వేయాల్సి ఉంటుంది.
బాగా నచ్చిన వారికి మొదటి ఓటు, తర్వాత వారికి రెండో ఓటు, ఆ తర్వాత వారికి మూడో ఓటు.. ఇలా బ్యాలెట్ పేపర్ మీద పెన్నుతో సంఖ్య వేయాల్సి ఉంటుంది. పోలింగ్ తర్వాత ఈ బ్యాలెట్ పేపర్లన్నింటినీ లెక్కించి ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని గెలిచినట్లుగా ప్రకటిస్తారు. ఈ మూడు సీట్లలో వైసీపీ చిత్తుగా ఓడిపోయి టీడీపీ అభ్యర్థులు అనూహ్యంగా భారీ మెజారిటీతో గెలుపొందారు. తమకు బాగా బలం ఉందని భావించిన రాయలసీమలోని రెండు స్థానాల్లోనూ ఓటమి ఎదురు కావడం జగన్ అండ్ కోను దిగ్ర్భాంతపరచింది.
నాటి ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలో కూడా మెజారిటీ ఓట్లు టీడీపీకే పడ్డాయి. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకూ చెందిన టీడీపీ నేత భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందారు. విశాఖ పాలనారాజధాని అంటూ జగన్ అప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయినా ఆ ప్రాంతంలో కూడా వైసీపీ అభ్యర్థి భారీ తేడాతో ఓడిపోయారరు. వైసీపీ కాళ్ల కింద నేల జారిపోతోందన్న సంకేతాలు ఆ ఎన్నికల్లోనే వెలువడ్డాయి. ఇప్పుడు ఈవీఎంలపై నెపం తోయాలని చూస్తున్న జగన్.. బ్యాలెట్ పేపర్లతో జరిగిన పట్టభద్ర ఎన్నికల్లో ఓటమికి ఏం చెబుతారు? దారుణ పరాజయాన్ని తట్టుకోలేకనే ప్రజల తీర్పును అపహాస్యం చేయాలని చూస్తున్నారు.