డైవర్షన్ పాలిటిక్స్..అంటే అధికార పార్టీ చేసిన తప్పులు, స్కామ్ లు బయట పడి ప్రభుత్వం పరువుపోతుందనుకున్న సమయంలో అధికార పార్టీ వాడే అస్త్రం ఈ డైవర్షన్ పాలిటిక్స్. అంటే, అసలు విషయాలపై నుంచి ప్రజల దృష్టిని మరల్చి…వేరే విషయాలపై ఫోకస్ చేసేలా ప్రేరేపించడం ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఉద్దేశ్యం. సరిగ్గా ఇదే ఫార్ములాను ఏపీ సీఎం జగన్ సమర్థవంతంగా వాడారు అనడానికి చంద్రబాబు అక్రమ అరెస్టే నిదర్శనం అని సోషల్ మీడియాలో వాదనలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్లుగా సైలెంట్ గా ఉన్న జగన్..సడెన్ గా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో పేరు లేని చంద్రబాబు ను ఏకంగా అరెస్టు చేయించి జైలుకు పంపడం కాకతాళీయం కాదని అంటున్నారు నెటిజన్లు.
ఆరోపణలే కాదు అందుకు తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో టీడీపీ సానుభూతిపరులు కొన్ని ఆసక్తికర విషయాలను వైరల్ చేస్తున్నారు. ఇటీవల సీఎం పేషీ లో డిజిటల్ సైన్ మిస్ యూజ్ అయిన అంశం సంచలనం రేపింది. ముఖ్యమంత్రి సంతకం దుర్వినియోగం కావడం మామూలు విషయం కాదని మీడియాలో రచ్చ జరిగింది. కానీ, చంద్రబాబు అరెస్టుతో ఆ విషయం పక్కకు పోయింది. అదే మాదిరిగా, తప్పుడు మెడికల్ కౌన్సిల్ లెటర్ తో దొంగ పీజీ సీట్లు అమ్ముకున్న అంశం, 40 కోట్ల టన్నుల ఇసుక స్వాహా అంశం, దొంగ ఓట్లు చేర్చడం, అర్హుల ఓట్లు తొలగించడం అంశం పక్కదోవబట్టాయి.
నీటి పారుదల ప్రాజెక్టులకు కేటాయింపులు చేయకుండా పనులు పెండింగ్ లో ఉంచడం, పోలవరం ప్రాజెక్టులో వైసీపీ నేతల నిర్వాకం, 8 సార్లు పెంచిన కరెంట్ బిల్లుల వ్యవహారం, విడుదల చేయని జాబ్ క్యాలెండర్ విషయం, క్రిమినల్ కేసులు నమోదు అయిన వారిని టీటీడీ బోర్డు లోకి తీసుకున్న వివాదం, వివేకా కేసులో అసలు సూత్రధారుల అరెస్టు వంటి వ్యవహారాల నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకే చంద్రబాబును ఆఘమేఘాల మీద అరెస్టు చేశారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.