తన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల్నిఎన్నికల ప్రచారంలో భాగంగా సోదరులుగా.. మహిళా అభ్యర్థుల్ని తల్లులుగా.. సోదరీమణులుగా పేర్కొంటూ సీఎం జగన్ చేసిన ఎన్నికల ప్రచారం గురించి తెలిసిందే. తన పార్టీ అభ్యర్థుల మీద ఇంతటి ప్రేమాభిమానాలు ప్రదర్శించే వైసీపీ అధినేత తన సొంత తల్లి.. చెల్లి విషయంలో మరెంత ప్రేమగా.. అప్యాయంగా వ్యవహరిస్తారనుకోవటం మామూలే. అయితే.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు అందుకు భిన్నంగా ఉండటం తెలిసిందే.
ఇటీవల కాలంలో తన సోదరి షర్మిల సూటిగా తన సోదరుడు జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరగటం తెలిసిందే. ఆమె సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే కీలకమైన ఎన్నికల వేళ ఓటర్లు తన కుమార్తె షర్మిలకు ఓటు వేయాల్సిందిగా కోరుతూ వీడియో సందేశాన్ని విదేశాల నుంచి పంపటం తెలిసిందే. బరిలో తన కొడుకు కూడా ఉన్నాడని.. అది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కోసం మరోసారి పోటీ పడుతున్నప్పటికీ మాట వరసకు కూడా విజయమ్మ ఆ అంశాన్ని ప్రస్తావించకపోవటం గమనార్హం.
ఇదే అంశంపై రాజకీయ వర్గాల్లోనూ.. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. తనకు దన్నుగా నిలవని తల్లిపై జగన్మోహన్ రెడ్డి అలకబూనారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. మదర్స్ డే ను పురస్కరించుకొని తన సోదరి షర్మిల తన తల్లి విజయమ్మకు శుభాకాంక్షలు తెలుపగా.. సీఎం జగన్ మాత్రం ఎలాంటి విషెస్ చేయకపోవటం ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల వేళ.. షర్మిల విజయాన్ని కాంక్షిస్తూ వీడియోను విడుదల చేయటం.. తనకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవటంతో ఆయన ఆగ్రహంతో ఉన్నట్లుగా చెబుతున్నారు. కడప ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న షర్మిలను గెలిపించాల్సిందిగా వీడియో సందేశాన్ని విజయమ్మ శనివారం విడుదల చేయటం తెలిసిందే. తర్వాతి రోజున వచ్చిన మదర్స్ డే వేళ.. విషెస్ ను చెప్పకపోవటంతో తన తల్లి విషయంలో సీఎం జగన్ ఆగ్రహంతో ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ అభ్యర్థుల విషయంలో పెద్ద మనసుతో వ్యవహరించే జగన్.. సొంత తల్లి.. చెల్లి విషయంలో మరింత ప్రేమాభిమానాల్ని వ్యక్తం చేయటం లేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
మానవ సంబంధాల గురించి.. విలువల గురించి అదే పనిగా ఉపన్యాసాలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి.. తన ఇంట్లో.. తన కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న విభేదాల్ని పరిష్కరించుకోవటంలో ఎందుకు తప్పటడుగులు వేస్తున్నారన్నది చర్చగా మారింది. ఇప్పటివరకు జగన్ ఎదుర్కొన్న ఎన్నికలన్ని కూడా తన తల్లి.. చెల్లెలు అండగా నిలిచినవే. అందుకు భిన్నంగా మొదటిసారి భిన్నమైన వాతావరణంలో ఎదుర్కొంటున్న ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందన్ది ఇప్పుడు ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.