ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లేది, వివేకానందరెడ్డి హత్య కేసులో పీకల్లోతు కూరుకుపోయిన, తన పార్టీ నాయ కుడు ఎంపీ అవినాష్ రెడ్డిని రక్షించేందుకేనని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.
ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. నిజాల నిగ్గు తేలుతుందని చెప్పారు.
వివేకా కేసులో ఎవరూ తప్పించుకోలేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
సీబీఐ గట్టిగానే పోరాడుతోందని.. దాక్కున్న వారిని బయటకు తెస్తోందని అన్నారు.
ఇదిలావుంటే.. ప్రతి ఇంటిపై తన స్టిక్కర్ వేయించి జగనే మీ భవిష్యత్ అంటూ పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు విరుచుకుపడ్డారు.
వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఈ రాష్ట్ర, మీ పిల్లల భవిష్యత్ కోసం వైసీపీని ఓడించాలి.
రాబోయే రోజుల్లో ప్రతి పేదవాడినీ కోటీశ్వరుడిని చేసే కార్యక్రమం చేపట్టబోతున్నాను, అని చంద్రబాబు ప్రకటించారు.
మార్కాపురం జిల్లా కావాలని అడిగేందుకు వచ్చిన జేఏసీ సోదరులను అరెస్టు చేశారని, అందుకే వెనకబడిన పశ్చిమ ప్రాంతానికి తాను అండగా నిలుస్తానని చంద్రబాబు తేల్చి చెప్పారు.
ఈ ప్రాంత ప్రజల పట్ల అభిమా నంతో తన పుట్టిన రోజును ఇక్కడే నిర్వహించుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసి నీరిస్తానన్నారు.
అమరావతి-అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే నిర్మించడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతానని చెప్పారు.
మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటుచేస్తానని చంద్రబాబు ప్రకటించారు.
ఫలితంగా సుదీర్ఘకాలంగా ఇక్కడి వారు ఎదురు చూస్తున్న కోరిక ఫలించినట్టు అవుతుందని చంద్రబాబు చెప్పారు.
జగన్ మాటలు విని కులమతాల ఉచ్చులో పడకుండా టీడీపీని గెలిపించాలని బాబు ప్రజలకు పిలుపిచ్చారు.