అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లరాదని.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నిర్ణయించారు. సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు సభకు వెళ్లిన.. జగన్, ఆయన ఎమ్మెల్యేలు.. గవర్నర్ ప్రసంగానికి అడుగడుగునా అడ్డుపడిన విషయం తెలిసిందే. అంతేకాదు.. తమకు ప్రధాన ప్రతిపక్షం హోదా ఇవ్వాల ని పట్టుబట్టారు. ప్రజా సమస్యలు ప్రస్తావించేందుకు ఇదొక్కటే మార్గమని, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని ఖూ నీ చేసినట్టేనని వ్యాఖ్యానించారు. ఒకవైపు గవర్నర్ ప్రసంగం సాగుతున్న సమయంలోనే జగన్ బృందం సభ నుంచి వాకౌట్ చేసింది.
కట్ చేస్తే.. సభ నుంచి వెళ్లిపోయిన అనంతరం.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ సభకు వెళ్లేదీ లేనిదీ వారి అభిప్రాయా లు తెలుసుకున్నారు. ప్రజాపక్షంగా మరింత ముందుకు వెళ్లడంపై చర్చ జరిగింది. భవిష్యత్లో అనుస రించాల్సిన వ్యూహాలపైనా సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ చర్చించి.. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
“మనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఇక, మనం వెళ్లినా.. సభలో వారు చెప్పే మాటలు వింటూ.. నోట్లో వేలుసుకుని కూర్చోవాలి. ఇంతకన్నా.. గమ్మునుంటే పోతుంది.“ అని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ సందర్భంగా ఓ ఎమ్మెల్యే.. సభ్యత్వం రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు కదా? అని ప్రశ్నించినప్పుడు.. “చేసుకోనీ అబ్బా.. నీకు నేనున్నా. మనకు ప్రజలున్నారు. ప్రజల మధ్యకు వెళ్తాం“ అని వ్యాఖ్యానించినట్టు సమాచారం.
అయితే.. జగన్ చేసిన వ్యాఖ్యలపై మెజారిటీ ఎమ్మెల్యేలు మౌనం వహించారు. కొందరు ఒకటి రెండు రోజులువెళ్లి.. ప్రభుత్వ వైఖరి చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని.. తొలి రోజే ఇలా నిర్ణయించడంపై ఆలోచన చేయాలని సూచించారు. దీనిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా.. ఇప్పటి వరకు ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం కదా! అని వ్యాఖ్యానించారు. కాగా.. మరో 30 ఏళ్లు తాను రాజకీయాల్లో ఉంటానని… తనతో పాటు ఉండేవాళ్లే తనవాళ్లు అని జగన్ చెప్పుకొచ్చారు.