ఎన్నికల్లో ఓ పార్టీ ఓడిందంటే వెంటనే ఆ ఓటమికి కారణాలేంటో విశ్లేషించుకోవాలి. ఆ తప్పులను సరిదిద్దుకుని తిరిగి ప్రజల్లోకి వెళ్లాలి. అలా చేస్తేనే పార్టీకి మనుగడ ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం వైసీపీకి, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ కు ఆ ఆలోచన లేనట్లే కనిపిస్తోంది. ఎన్నికల్లో దారుణ పరాభవం తర్వాత కూడా జగన్‌లో పశ్చాత్తాపం కనిపించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎంతసేపు ఈవీఎంల ట్యాంపరింగ్‌పై పస లేని ఆరోపణలు చేయడం తప్పా వైసీపీ ఏం చేస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక తాజాగా జగన్ కూడా బాబుపై పడి ఏడవడం తప్పా పార్టీ పునర్నిర్మాణం కోసం ఏ చర్యలు తీసుకోవాలనే ఆలోచనే చేయడం లేదని విశ్లేషకులు అంటున్నారు.
తాజాగా తన క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని, మళ్లీ ఉవ్వెత్తున పైకి లేచే కాలం వస్తుందని జగన్ అన్నారు. తమ నాయకుల్లో భరోసా నింపే ప్రయత్నం చేయడం మంచిదే. కానీ తమ పార్టీ ఓడిపోవడానికి కారణాలపై మాత్రం ఆయన దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. తప్పుల్ని సరిదిద్దుకుని, తిరిగి ప్రజల ఆదరణ పొందేందుకు అవసరమైన కార్యచరణ తయారు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు లేడు. ఎందుకంటే తమ తప్పుల గురించి కాకుండా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పాపాలు చేస్తారంటూ జగన్ మాటలే అందుకు కారణమని చెప్పాలి.
చంద్రబాబు హయాంలో చాలా త్వరగా పాపాలు పండుతాయని, మన కళ్ల ముందే చంద్రబాబు పాపాలు ఎలా పండుతాయో గతంలో చూశామని జగన్ అన్నారు. బాబు తప్పులు శిశుపాలుడి పాపాల మాదిరి మొదలయ్యాయని, పాపాలు పండేదాకా ఆత్మస్థైర్యం కోల్పోవద్దని జగన్ పాపాల పాట పడారు. కానీ అదే సమయంలో తాను అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలే పండి ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయామని జగన్ ఎందుకు అర్థం చేసుకోవడం లేదో తెలియడం లేదు. ఏపీ సీఎంగా బాబు బాధ్యతలు చేపట్టడంతో ఆంధ్రను మళ్లీ అభివృద్ధి వైపు నడిపిస్తారని, వ్యవస్థలను చక్కదిద్దుతారని అన్ని వర్గాల ప్రజలు నమ్మకంతో ఉన్నారు. జగన్ మాత్రం పాపాలు చేస్తారని అంటున్నారు. ఇప్పటికైనా చేసిన తప్పులు గుర్తించి ప్రజల పక్షాన నిలబడితే తప్పా జగన్‌కు భవిష్యత్ ఉండదని టాక్.