నాటి ప్రతిపక్ష నేత జగన్ ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీ నేటి సీఎం జగన్ మెడకు గుదిబండగా మారింది. 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అలవిగాని హామీలను అడ్డగోలుగా ఇచ్చేసిన జగన్ నేడు తలపట్టుకుంటున్న పరిస్థితి. సీపీఎస్ రద్దు చేయాల్సిందేనన్న ఉద్యోగుల డిమాండ్ జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. జగన్ ఇచ్చిన హామీపై ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్ధితి..లేక వెనక్కు వెళితే ఉద్యోగులు ఊరుకునే అవకాశం లేక…కుడితిలో పడ్డ ఎలుకలా అయింది పరిస్థితి. దీంతో, ఉద్యోగులకు సమాధానం చెప్పుకోలేక వారిని బెదిరించి…వారిపై కేసులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
అయితే, ఇలా ఉద్యోగులను టార్గెట్ చేయడం వల్ల రాబోయే ఎన్నికల్లో జగన్ కు చిక్కులు తప్పవన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీపీఎస్ కు బదులుగా జగన్ సర్కార్ సూచిస్తున్న ప్రత్యామ్నాయానికి ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై రగిలిపోతున్న ఉద్యోగులు వరుస ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కార్యచరణ రూపొందిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో రద్దవుతున్న సీపీఎస్ ఏపీలో మాత్రమే ఎందుకు రద్దు కావడం లేదని ఉద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సరైన సమాధానం లేని పరిస్థితి.
చాలాకాలం ఓపికగా ఎదురుచూసిన ఉద్యోగులు…చివరకు సెప్టెంబర్ 1న మిలియన్ మార్చ్ పేరుతో భారీ నిరసనకు శ్రీకారం చుట్టారు. అయితే, వినాయక చవితి పండుగతోపాటు నిరసన వాయిదా వేసుకోవాలన్న మంత్రుల రిక్వెస్ట్ మేరకు తాత్కాలికంగా ఆ కార్యక్రమానికి బ్రేక్ వేశారు ఉద్యోగులు. కానీ, కొందరు ఉద్యోగులపై ప్రభుత్వం బైండోవర్ కేసులు పెట్టం, వేధించడం చేయడంతో ఈ రోజు మరో నిరసనకు తెర తీశారు. సీపీఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగుల అరెస్టులకు నిరసనగా ఉద్యోగ సంఘాలు ఇవాళ బ్లాక్ డే(విద్రోహ దినం)గా పాటించాలని నిర్ణయించాయి.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టాయి. సీపీఎస్ రద్దయే వరకూ ఈ ఆందోళనలు కొనసాగుతాయని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. ఇక, సీపీఎస్ కోసం ఉద్యోగ సంఘాలు చేపడుతున్న ఈ ఆందోళనలకు మిగతా ఉద్యోగ సంఘాలు కూడా మద్దతిస్తుండడంతో జగన్ సర్కార్ కు తిప్పలు తప్పేలా లేవు. సీపీఎస్ వ్యవహారం…జగన్ ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారయింది.