ఆంధ్రావని వాకిట ఏం చేసినా రాజకీయం మాత్రం విభిన్నం అయి ఉంటుంది. పాపం పద్ధతైన రీతిలో జగన్ పదవులు ఇచ్చినా కూడా బీసీలు వచ్చేసారి ఆయన్ను నమ్ముతారు అని గ్యారెంటీ లేదు. ఆ మాటకు వస్తే అధికారం అంతా తన దగ్గరే ఉంచుకున్నారు అన్న వాదన ఒకటి ఎప్పటి నుంచో పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. గతంలో బొత్స కానీ పదవి రానంత కాలం ధర్మాన కానీ పదవి వచ్చాక ఏ సుఖం లేదని వాపోతున్న ఇంకొందరు మంత్రులు కానీ చెబుతున్నదే ఇది.
అంతా జగన్ చెప్పాలి అని, అన్నీ సజ్జల కు చెప్పి చేయాలి అని ఓ వింత వాదన ఒకటి గతంలో బొత్స వినిపించారు. కొన్ని ప్రయివేటు సంభాషణల్లో ధర్మాన ప్రసాదరావు కూడా అసహనం వ్యక్తం చేశారు. కొందరు మాత్రం నాని లాంటి వారిని వాడుకుని వదిలేశారు అని కూడా అంటున్నారు. నాని అయితే బీసీ కాదు కానీ బీసీ వర్గాల్లో ఫాలోయింగ్ ఉన్న లీడర్. జోగి రమేశ్ లాంటి వారు మాత్రం పదవి ఉన్నా లేకపోయినా వీర విధేయతతో ఉంటున్నారు.
ఆ మాటకు వస్తే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అనే విధేయుడు కూడా ఇలానే ఉంటున్నారు. కానీ మంత్రి పదవి దక్కాక చాలా మంది కన్నా భిన్నంగా జోగి రమేశ్ మాటలు ఉన్నాయి. జగన్ ను ఉద్దేశిస్తూ ఆయన ఓ సామాజిక విప్లవకారుడు అనే మాట మంత్రి అన్నారు. బాగుంది.. అంటే ఏంటి సర్ ? చెవులు కొరుకుతున్నా యి కొన్ని వర్గాలు!
సామాజిక విప్లవం అంటే పదవుల కేటాయింపా లేదా అట్టడుగు వర్గాల సంక్షేమం తో పాటు వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఏ మయినా రాచమార్గం వేసేది ఉందా? అన్నది డౌట్.. ఏమంటే ఏడాదికి 55 వేల కోట్ల రూపాయలు పంచుతున్నాం… ఇంటికి లక్షన్నర నుంచి మూడు లక్షలు పంచుతున్నాం ..మాకు కాక ఇంకెవ్వరికి ఓట్లేస్తారు అని అడుగుతున్నారు జగన్.
ఈ ప్రశ్న కాస్త అమాయకంగానే ఉంది. డబ్బులు పంచితేనే ఓట్లు వేస్తారా? అంటే వాళ్లకంటూ ఓ నిర్ణయం ఉండి ఉండదా?అంటే స్వీయ నిర్ణయాలకు అతీతంగా ప్రజా స్వామ్యంలో ప్రజలు నాయకులను ఎన్నుకుంటున్నారా? అయితే ఆరోజు పసుపు కుంకుమ పేరిట డబ్బులు పంచిన చంద్రబాబు కదా గెలవాలి ? మరి! మీరెలా గెలిచారు అని అంటున్నారు ఇంకొందరు.
కనుక సామాజిక విప్లవకారుడు లాంటి పెద్ద పెద్ద పదాలు వద్దులే కానీ, హాయిగా నాలుగు గుంతలు కప్పి వెళ్లండి చాలు అని వేడుకుంటున్నారు ఉత్తరాంధ్ర తో సహా ఇతర ప్రాంతాల వాసులు కూడా !