ఏపీ సీఎం నోరు విప్పితే.. మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు అంటారు. కానీ, వాస్తవంలోకి వస్తే.. ఆయన కేవలం 17 రోజుల్లోనే టంగ్ స్లిప్ అయ్యే వ్యాఖ్యలు చేశారు. అప్పుడు అంటే.. 17 రోజుల ముందు.. ఒకలా.. కేవలం 17 రోజుల తర్వాత మరోలా జగన్ వ్యవహరించడం రాజకీయంగా ఆయనపై తీవ్ర విమర్శలకు కారణమైంది.
మాట తప్పేదే లే! – అంటూ వైసీపీ నేతలు.. సీఎం జగన్ గురించి ప్రచారం చేసుకుంటారు. కానీ, ఆయన యువతకు ఉద్యోగాల కల్పన విషయంలో.. ఎన్నికలకు ముందు ఒక మాట.. తర్వాత మరోమాట.. ఇలా. ఎప్పుడు అవకాశం వస్తే.. అప్పుడు జగన్.. మాట మారుస్తూ.. నే ఉన్నారు. ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు దీనిపై క్లారిటీ లేదు.
ఇదే విషయాన్ని కోట్ చేస్తూ.. టీడీపీ యువ నాయకుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు.. సీఎం జగన్పై ప్రశ్నలు సంధించారు. ఎన్నికలకుముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేక పోయారంటూ.. ఫైరయ్యారు. అదేసమయంలో యువతను పచ్చిగా మోసం చేస్తున్నారని.. రామ్మోహన్ నిప్పులు చెరిగారు.మాట తప్పం.. మడమ తిప్పం.. అనే.. పార్టీ అధినేత.. జగనే 17 రోజుల్లో పచ్చిగా మాట మారుస్తారా? అంటూ.. ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఉద్యోగ కల్పనపై.. సీఎం జగన్.. మే 31వ తేదీన ఒకవిధంగా మాట్లాడరని.. పట్టుమని 17 రోజులు తిరిగే సరికి.. ఒక విధంగా చెప్పారని.. అయితే.. ఈ రెండు కూడా శుద్ధ అబద్ధాలేనని.. ఎంపీ రామ్మోహన్ అన్నారు. “సీఎం జగన్ రెడ్డీ.. మే 31న మీరు మాట్లాడుతూ.. 4,77,953 ఉద్యోగాలు సృష్టించామన్నారు. జూన్ 18న.. అంటే పట్టుమని 17 రోజులు తిరిగముందే.. 6,03,756 ఉద్యోగాలిచ్చామన్నారు. మీరు ఏ అబద్ధాన్ని ప్రచారం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి“ అని వ్యాఖ్యానించారు.
ఉద్యోగాల కల్పన విషయంలో ముఖ్యమంత్రి జగన్ అనుసరిస్తున్న వైఖరిపై ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ పీఠం ఎక్కగానే.. జాబ్ క్యాలెండర్ను అమలు చేస్తామని.. చెప్పిన జగన్.. రెండేళ్లకు కానీ.. దీనిని పట్టించుకోలేదు. ఇక, 2 లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన జగన్.. ఎలాంటి భద్రతా లేని, పెద్ద ఆదాయమూ లేని వలంటీర్ పోస్టులను కూడా ఈ ఖాతాలోనే జమ చేసుకుని ఉద్యోగాలు ఇన్నిచ్చాం.. అన్నిచ్చాం.. అని ప్రచారం చేసుకుంటున్నారని యువత కూడా పెద్ద ఎత్తున నిప్పులు చెరుగుతోంది. ఈ క్రమంలో జగన్.. అబద్ధాలను చెప్పడం.. వీటిని ఎంపీ రామ్మోహన్ కోట్ చేయడం గమనార్హం.