మూడు రోజుల పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించేందుకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబుకు అక్కడి పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి భారీ స్వాగతం లభించింది. కిలో మీటర్ల మేర .. పార్టీ తమ్ముళ్లు ర్యాలీ చేపట్టి.. చంద్రబాబును స్వాగతించారు.
గజ మాలలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఓర్వకల్లు విమానాశ్రయంలో చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికి.. గజమాలతో సత్కరించారు. అనంతరం అక్కడికి వచ్చిన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ అధినేత, సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం అంటే అభివృద్ధికి మారుపేరని తెలిపారు. జగన్ మాట్లాడితే ఏదో జరిగిపోతుందని నమ్మి.. ప్రజలు మోసపోయారని తెలిపారు.
రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలకు ప్రజలు ఫిదా అయ్యారని, ఏదో జరిగిపోతుందని అనుకుని.. ఆయనకు ఓట్లేసి గెలిపించారని.. కానీ, బాదుడే బాదుడు తప్ప ఏమీ జరగలేదని దుయ్యబట్టారు.
కర్నూలులో ఓర్వకల్లు విమానాశ్రయాన్ని తానే కట్టించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం అంటే అభివృద్ధికి మారుపేరని స్పష్టం చేశారు. హైదరాబాద్కు ధీటుగా అమరావతిని నిర్మించాలని భావించానని తెలిపారు. ప్రజల్లో చైతన్యం రావాలని కోరారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు, చదివించే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని.. అమరావతిలో రైతుల భూములను కబ్జా చేస్తున్నారని విమర్శించారు.
విశాఖలో ప్రజల మెడపై కత్తి పెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారని వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. రాయలసీమ యూనివర్సిటీ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని.. విద్యార్థులు, సిబ్బంది సమస్యలు పరిష్కారం కావాలంటే ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రమంతా రివర్స్ పాలన నడుస్తోందని.. యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తనదేనని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
కర్నూలు చేరుకున్న @ncbn గారు.. pic.twitter.com/OY78gENbhs
— iTDP Official (@iTDP_Official) November 16, 2022