ఏపీ సీఎం జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పెను మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో నిర్మించిన ప్రజావేదికను ఉన్నపళంగా పడగొట్టించిన జగన్ పేరు మార్మోగిపోయింది. ఇక, అమరావతి రాజధానిగా కొనసాగడం ఇష్టం లేని జగన్….మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకున్నారు. దీంతోపాటు, సచివాలయానికి రాకుండా సీఎం క్యాంప్ ఆఫీసు నుంచే జగన్ పాలన కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఎన్ని విమర్శలు వస్తేనేం…జగన్ సచివాలయానికి వెళ్లిన సందర్భాలన వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ తన మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇకపై ప్రతి పది రోజులకోసారి సచివాలయానికి వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. కొద్ది రోజులుగా సచివాలయంలో జరుగుతున్న కీలక పరిణామాల నేపథ్యంలోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జగన్ ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకోవడంపై చర్చ మొదలైంది.
అమరావతి నుంచి విధులు నిర్వర్తించడం ఇష్టం లేని జగన్…ఇపుడు యూ టర్న్ ఎందుకు తీసుకున్నారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 3 రాజధానులపై జగన్ యూటర్న్ తీసుకున్నారని,ఈ క్రమంలోనే సచివాలయానికి వెళుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఖజానా ఖాళీ కావడం, ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో మూడు రాజధానులను నిర్మించే ప్రతిపాదనకు తాత్కాలికంగా బ్రేక్ వేశారని పుకార్లు వస్తున్నాయి. అమరావతిలో హైకోర్టు భవనాల విస్తరణ పనులే ఇందుకు నిదర్శనమని, కర్నూలుకు న్యాయ రాజధాని తరలించడం ఖాయమైతే…ఇక్కడ విస్తరణ చేపట్టడం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు.