నవ్యాంధ్ర రాజధాని అమరావతి అని కోర్టులు చెబుతున్నా సరే అంగీరించేందుకు మాత్రం వైసీపీ నేతలకు మనసొప్పడం లేదు. అమరావతి కోసం గత ప్రభుత్వం 9,165 కోట్లు ఖర్చు చేసిందని, ఇంకా లక్ష కోట్లను ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, ఆలస్యమయ్యే కొద్దీ ఆ ఖర్చు పెరుగుతుందన్నది వారి వెర్షన్. మాకు ఏపీలోని మూడు ప్రాంతాలు మూడు కళ్ల లాంటివి, అటువంటిది ఒక్క అమరావతిలోని 29 గ్రామాల్లోనే లక్ష కోట్లు కుమ్మరించి అభివృద్ధి చేయలేమంటోంది జగన్ సర్కార్.
ఇంకా చెప్పాలంటే మా దగ్గర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వడానికే డబ్బుల్లేవు, ఇక లక్ష కోట్లు ఎక్కడి నుంచి తెస్తామంటూ వాదిస్తోంది. కానీ, వైసీపీ వాదనతో టీడీపీ నేతలు విభేదిస్తున్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని, దానిపై ప్రభుత్వం డబ్బులు పెట్టాల్సిన పనే లేదని అంటున్నారు. టీడీపీ హయాంలో అమరావతిపై చంద్రబాబు పక్కా ప్రణాళికలు వేశారని, వాటిని జగన్ యథావిధిగా అమలు చేసుంటే రాజధాని పూర్తయి ఉండేదని చెబుతున్నారు.
ఎప్పుడెప్పుడు ఎంతెంత ఖర్చు పెట్టాలి, ఎలా నిధులు సమీకరించానలి అన్న అంశాలపై గత ప్రభుత్వం ఓ బ్లూ ప్రింట్ రెడీ చేసుకుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అమరావతి ఫైనాన్షియల్ ప్లాన్ గురించి ఫిబ్రవరి 2019లో టీడీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 50ను కూడా విడుదల చేసిందని చెబుతున్నారు. దాని ప్రకారం అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చు 55,343 కోట్లు. రాబోయే 8 ఏళ్లలో ఖర్చు పెట్టాల్సింది కేవలం 6629 కోట్లు మాత్రమే.
భూములకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. ఆ తర్వాత ఆ భూముల విలువ దానంతట అదే పెరుగుతోంది. అప్పుడు ప్రభుత్వానికి మిగిలే భూమితో ఆదాయం వచ్చే ప్రణాళికలు ఆ జీవోలో స్పష్టంగా ఉన్నాయి. అంతేకాదు, పట్టణీకరణకు అది ఓ అద్భుతమైన విధానమని అంతర్జాతీయంగా ప్రశంసలు కూడా దక్కాయని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. కేవలం చంద్రబాబుకు క్రెడిట్ రాకూడదని, ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయాలన్న ఉద్దేశ్యంతోనే జగన్ ఆ జీవోను తుంగలో తొక్కి అమరావతిని అధోగతి పాలుచేశారని మండిపడుతున్నారు. తన తప్పును చంద్రబాబుపైకి నెట్టాలని జగన్ చూస్తున్నారని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.