జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టంతా నూరుశాతం మూడు రాజధానుల మీదే ఉన్నట్లుంది. ఈ నెలలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన సమగ్రమైన బిల్లు తీసుకొస్తారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఒకపుడు ఇదే విషయాన్ని స్వయంగా జగనే అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. అయితే ఎందుకనో మళ్ళీ ఆ ప్రస్తావనే తేలేదు. అప్పటినుండి మూడు రాజధానుల అంశంపై పెద్దగా ఎవరు మాట్లాడింది కూడా లేదు.
అలాంటిది మంత్రి అమర్ నాధ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లోపే మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా ఏర్పాటు చేయాలన్నది జగన్ ఆలోచన. ఇక ప్రస్తుతమున్న అసెంబ్లీ అమరావతిలోనే కంటిన్యూ అవుతుంది. అంటే శాసనరాజధానిగా అమరావతే కంటిన్యు అవుతుంది. అయితే జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులను ప్రతిపక్షాలు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నాయి.
ఒకవైపు జగన్ పట్టుదల మరోవైపు ప్రతిపక్షాల డిమాండ్లు చూస్తుంటే వచ్చే ఎన్నికలు ప్రధానంగా రాజధానుల అంశంగానే జరిగేట్లుంది. చంద్రబాబునాయుడు, మిగిలిన ప్రతిపక్షాలేమో అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని పదే పదే డిమాండ్లు చేస్తున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా ఉండటం జగన్ కు ఇష్టం లేదని అర్ధమైపోతోంది. అందుకనే మూడు రాజధానులని ప్రతిపాదించారు.
ఈ వివాదం మొదలైన తర్వాత జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ప్రజాతీర్పు వైసీపీకే అనుకూలంగా వచ్చింది. అయితే… ఆ ఎన్నికలు ఎంత నిర్బంధంగా నిర్వహించారో అందరికీ తెలిసిందే. అయినప్పటికీ అంతమాత్రాన జనాలంతా మూడు రాజధానులకు అనుకూలంగా తీర్పిచ్చారని అనుకునేందుకు లేదు. దానికి అమరావతి రైతుల యాత్ర విజయవంతం కావడం కూడా ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.
ఇదే ఎన్నికల ప్రధాన ఎజెండాగా అంటే మూడు రాజధానుల నినాదంతో జగన్, అమరావతి ఏకైక రాజధానిగా చంద్రబాబు+ప్రతిపక్షాలు రాబోయే ఎన్నికను ఎదుర్కోవాలి. అప్పుడు రాబోయే తీర్పే నిజమైన ప్రజాతీర్పని అనుకోవచ్చు. ఒకసారి జనాలు తీర్పిచ్చిన తర్వాత ఇక రాజకీయంగా మళ్ళీ వివాదాలు రాజుకునే అవకాశాలు దాదాపు ఉండవనే అనుకోవాలి. వాస్తవానికి ఇప్పటికే జనంలో జగన్ తన విశ్వాసాన్ని కోల్పోయారు. ఒక రాజధాని అంటూ లేకపోతే ప్రతి దానికి హైదరాబాదుకో బెంగుళూరుకో వెళ్లాల్సిన దుస్థితి రాక తప్పదు.
Comments 1