వివేకా మర్డర్ మిస్టరీలో రోజుకో కొత్త వ్యవహారం వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే. వివేకా కారు డ్రైవర్ దస్తగిరి మొదలుకొని తాజాగా వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి వరకు అందరూ తమ వాంగ్మూలాలలో సంచలన విషయాలు వెల్లడించారు. ఇక, వైఎస్ సునీతా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి అయితే..డైరెక్ట్ గా సీఎం జగన్ తో హత్య జరిగిన రోజు, తదనంతరం జగన్ తో జరిగిన సంభాషణలను కూడా సీబీఐ అధికారులకు వాంగ్మూలమిచ్చారు.
ఈ నేపథ్యంలోనే జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకు స్వయంగా జగనే స్కెచ్ వేశారని లోకేశ్ షాకింగ్ ఆరోపణలు చేశారు. అంతేకాదు, ఈ కేసులో సీఎం జగన్‌ను కూడా సీబీఐ అధికారులు విచారణ జరపాలని లోకేశ్ డిమాండ్ చేశారు. వివేకా మర్డర్ కేసులో గొడ్డలి పోటు నుంచి గుండెపోటు డ్రామా వరకూ ఉన్న మిస్టరీ వీడిపోయిందని లోకేశ్ అన్నారు. వివేకాను కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలు కిరాతకంగా చంపించారి లోకేశ్ ఆరోపించారు.
వివేకాను చంపేసిన అవినాశ్ రెడ్డి, శివశంకర్‌రెడ్డిలు తనకు రెండు కళ్లు అంటూ జగన్ వ్యాఖ్యానించడం, కేసును సీబీఐకి అప్పగిస్తే అది 12వ కేసు అవుతుందని సునీతతో జగన్ చెప్పడంతో జగన్ పై అనుమానాలు కలుగుతున్నాయని లోకేశ్ అన్నారు. వివేకా హత్యకు స్కెచ్ వేసింది జగనేనని అర్థమవుతోందని లోకేశ్ ఆరోపించారు. బాబాయ్‌ని చంపింది అబ్బాయే అని చెబుతున్నారని, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారని అన్నారు.
సొంత బాబాయి హత్యకు గురయ్యారన్న ఆవేదన జగన్ లో కనిపించడం లేదని అన్నారు. సునీతను సజ్జల, మాజీ డీజీపీ సవాంగ్‌తో కలిసి జగన్ బెదిరించారని ఆరోపించారు. వివేకాను చంద్రబాబు చంపించారని అబద్ధలాడిన జగన్…సీఎం కాగానే సీబీఐ విచారణ వద్దన్నారని మండిపడ్డారు. ‘సాక్షి’పై పరువునష్టం దావా కేసుకు సంబంధించి సోమవారం విశాఖలో కోర్టు వాయిదాకు హాజరైన సందర్భంగా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు, జగన్ రెడ్డి పాలనలో దళితులకు రక్షణ కరువైందని, చిత్తూరు జిల్లా పెద్దకంటిపల్లిలో అప్పు చెల్లించలేదని దళితుడు చంద్రన్‌పై.. ఈశ్వర్‌రెడ్డి విచక్షణారహితంగా దాడి చేశాడని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి అనుచరుడే ఈశ్వర్‌రెడ్డి అని లోకేశ్ చెప్పారు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, ఏపీలో లా అండ్ ఆర్డర్ వైసీపీ అండర్లో ఉందని ఫైర్ అయ్యారు.
వైసీపీ నేత, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి 2024 ఎన్నికల్లో నరసరావుపేట నుంచి పోటీ చేయబోతున్నారన్న కథనం మహాటీవీలో వచ్చిందని, ఆ వార్తను కవర్ చేసిన పిడుగురాళ్ల మహాన్యూస్ ప్రతినిధి మల్లీశ్వరి స్కూటీని వైసీపీ నేతలే తగులబెట్టించారని ఆరోపించారు. మల్లీశ్వరికి ప్రాణహాని ఉందని, ఆమెకు ఏమైనా జరిగితే కాసు మహేష్ రెడ్డి, ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు.