సస్పెన్షన్ వేటుపడిన నలుగురు ఎంఎల్ఏల్లో ఒకరైన మేకపాటి చంద్రశేఖరరెడ్డి స్పందన ఇది. ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగుకు పాల్పడ్డారని చెప్పి పార్టీ నలుగురు ఎంఎల్ఏలను పార్టీనుండి సస్పెండ్ చేసింది. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై సస్పెన్షన్ వేటువేసినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే. అయితే తమపై సస్పెన్షన్ వేటు విషయంలో ఒక్కో ఎంఎల్ఏ ఒక్కో విధంగా స్పందించారు.
మేకపాటి మాట్లాడుతు తన తలపై పెద్ద భారం దిగిపోయిందన్నారు. తాను క్రాస్ ఓటింగ్ చేశానని ఆరోపించటం, నిర్ధారణ చేయటం తప్పన్నారు. పార్టీ ఎవరికైతే ఓటేయమని తనకు చెప్పిందో వాళ్ళకే ఓటేసినట్లు మేకపాటి స్పష్టంచేశారు. అలాగే తాను పార్టీకి ద్రోహం చేయలేదని జగనే తనను వెన్నుపోటు పొడిచారని ఎదురు ఆరోపించారు. తనపై అనేకమంది చెప్పిన తప్పుడు ఆరోపణలను, మాటలను జగన్ నమ్మటం అన్యాయమన్నారు.
పైకి కనిపిస్తున్నంత సవ్యంగా పార్టీ సజావుగా సాగటంలేదని మండిపడ్డారు. పార్టీలో కొంతమంది పెత్తనమే సాగుతోందన్నారు. తాను వేసిన ఓటుతోనే జయమంగళ వెంకటరమణ గెలిచినట్లు చెప్పారు. ఈ విషయాన్ని దేవుడిపై ప్రమాణం చేసి చెప్పటానికి రెడీగా ఉన్నట్లు కూడా చెప్పారు. తనను సస్పెండ్ చేసినా తనకు వచ్చే నష్టం ఏమీలేదన్నారు. తనలాంటి నేతను వదులుకున్నందుకు పార్టీయే నష్టపోతుందన్న థీమాను వ్యక్తంచేశారు. రాబోయే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పార్టీ ఓడిపోవటం ఖాయమని జోస్యం చూడా చెప్పారు.
ఏ పార్టీలో చేరుతాను, ఎక్కడినుండి పోటీచేస్తాననేది భవిష్యత్తే తేలుస్తుందన్నారు. తన పదవీకాలం నాలుగేళ్ళుండగానే గతంలో ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇపుడు తన అవసరం లేదన్నట్లుగా పార్టీ వ్యవహరించటమే ఆశ్చర్యంగా ఉందన్నారు. పార్టీలో ఏ ఎంఎల్ఏకీ సరైన గౌరవంలేదని మండిపడ్డారు. ఇన్నాళ్ళూ పార్టీలో అవమానాలు భరించామని సస్పెన్షన్ తో ఇక అవమానాలు పడాల్సిన అవసరంలేదన్నారు. కాబట్టే తన తలపై పెద్ద భారం దిగిపోయినట్లు తాను ఫీలవుతున్నానని మేకపాటి చెప్పారు.