తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల ముదిరిపాకాన పడింది. మేము ఫ్రెండ్స్… కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీపడేది లేదని పైకి కేసీఆర్ గాంభీర్యం ప్రదర్శించడం, నేను కట్టే తీరతానని అలా కాలయాపన చేయడం… గత 16 నెలలుగా ఇదే జరిగింది. ఇంతకీ ఇవన్నీ ఆల్రెడీ ప్రారంభం అయిన ప్రాజెక్టుల కోసమే.
గత ప్రభుత్వ హయాంలో సాఫీగా పట్టిసీమ పూర్తి చేసి… ఆ మేరకు గోదావరి నీటిని కృష్ణాకు తెచ్చి మిగిలిన వాటాను కృష్ణా నుంచి రాయలసీమకు తరలించారు చంద్రబాబు. దీంతో అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో చాలా ప్రాంతాలకు నీరు చేర్చగలిగాడు. అయితే, ఏపీ సర్కారు వద్ద డబ్బుల్లేకపోవడంతో ప్రాజెక్టులు కట్టలేక… ఈ జల వివాదం ఒక సాకుగా చూపి ప్రాజెక్టులు వాయిదా వేస్తోంది ప్రభుత్వం అని తెలుగుదేశం ఆరోపిస్తోంది.
అసలు ఎపుడో పూర్తయిన హంద్రీనీవాను చంద్రబాబు 90 శాతం పూర్తిచేశారు. అలాగే పోలవరాన్ని 80 శాతం పూర్తి చేశారు. ఆ మిగిలిన 20 శాతం జగన్ పూర్తి చేస్తే చాలు. కానీ అదీ చేయడు జగన్ రెడ్డి. అలా టెండర్లు పొదుపు అంటూ కాలయాపన చేస్తుంటే మరోవైపు కేంద్రం పోలవరం డబ్బులు తగ్గించేసింది.
అత్యధిక సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచుతాను అన్న జగన్… ప్రత్యేక హోదాను గాలికొదిలేశారు. చివరకు చంద్రబాబు ఒత్తిడి తెచ్చి సాధించుకున్న ప్రాజెక్టు అంచనా వ్యవయం పెంపుదలను కూడా కేంద్రం తగ్గిస్తే జగన్ రెడ్డి ఒక్క మాట అనలేక పోయారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, పోలవరం డబ్బులు తగ్గించినా మోడీకి అండగా నిలబడ్డారు.
ప్రజల్లో డ్యామేజ్ జరగడంతో నీటి గొడవ తెరపైకి తెచ్చారు. ఇద్దరు ఫ్రెండ్స్ అని చెబుతూ నీటి కోసం కొట్టుకుంటున్నాం అని చెబితే ఎవరూ నమ్మరు కదా అందుకే అపెక్స్ కౌన్సిల్ వ్యవహారం తెరపైకి తెచ్చారు. దానికోసం ఈరోజు ఢిల్లీ వెళ్లారు. అటు, కేసీఆర్ జగన్ ఇద్దరు మీడియా మనుషులు కాదు. ఇక కేంద్రం వాళ్లకే అవసరం లేనపడు నాకెందుకు అంటుంది. అక్కడేం జరిగింది. వారు చెబితే వినడమే గాని అవి నిజాలో కాదో మనకు తెలిసే పరిస్థితి లేదు.
ఇద్దరు సీఎంలతో సమావేశం అయిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అన్ని అంశాలు చర్చించామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. రెండు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో కృష్ణా, గోదావరి పరిధిలోని సమస్యలపై అన్ని సమస్యలు చర్చించాం, ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చారని షెకావత్ చెబుతున్నారు. వారు ఆల్రెడీ ఏకాభిప్రాయంతోనే ఉన్నారని తెలుగు ప్రజలకు తెలుసు.
అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే… ఆరేళ్లు గడిచినా గోదావరి బోర్డు పరిధి నిర్ణయం కాలేదని గజేంద్రసింగ్ షెకావత్ కామెంట్ చేశారు. ఏర్పాటుచేయాల్సిన కేంద్రమంత్రి ఈ విషయాన్ని ఎవరికి చెబుతున్నారో అర్థం కాని పరిస్థితి.