ఈ రోజు వైసీపీ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎప్పటి లాగే జగన్ తన పక్కన బీసీ నేత ధర్మాన ప్రసాద రావును, ఎస్సీ నేత నందిగం సురేష్ ను కూర్చోబెట్టుకొని చిక్కటి చిరునవ్వులు చిందిస్తూ జాబితాను ప్రకటించారు. 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ సీట్లలో సగం సీట్లు..అంటే 100 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు కేటాయించిన జగనన్న చరిత్రలో నిలిచిపోతారని ధర్మాన, నందిగం ఆకాశానికెత్తేశారు. 100 సీట్లకు గాను ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీలకు 59 సీట్లు కేటాయించామని జగన్ గొప్పలు చెబుతున్నారు.
అయితే, మిగిలిన 100 సీట్లలో ఓసీలకు..అందులోనూ ప్రత్యేకించి తన రెడ్డి సామాజిక వర్గానికి జగన్ అక్షరాలా 57 సీట్లు కేటాయించి తన కులాన్ని పదిలపరుచుకున్న సంగతి మాత్రం బయటకు రానివ్వడం లేదు. దీంతో, జగన్ పై ట్రోలింగ్ జరుగుతోంది. నా బీసీలు అని చెప్పుకోవడమేగానీ వైసీపీలో బీసీలకు పవర్ ఉండదని, పవర్ లేని పదవులు బీసీలకు ఎందుకు అని ఆ పార్టీ మాజీ నేత, ప్రస్తుత టీడీపీ నేత, ఎంపీ సంజీవ్ కుమార్ దుయ్యబడుతున్నారు. రెడ్డి సామాజిక వర్గం బీసీ నేతలను కంట్రోల్ చేస్తుందని, అటువంటి సందర్భంలో పేరుకు, పబ్లిసిటీకి ఈ పదవులు ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. బీసీలను, దళితులను జగన్ దగ్గరకు రానివ్వడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
100 సీట్లలో 57 రెడ్లకు పోతే కమ్మ, బ్రాహ్మణ, ఆర్యవైశ్య తదితర ఓసీ వర్గాల నేతలకు ఎన్ని సీట్లు ఇచ్చి న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. పక్క పార్టీ మీద పడి ఏడ్చే ముందు తమ పార్టీలో తన రెడ్లకు ఎన్ని మేళ్లు చేస్తున్నారో జగన్ చూసుకోవాలని విమర్శలు వస్తున్నాయి.