- పర్యాటకం ముసుగులో కొత్త షాపులు
- దానిపై అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను
- రూ.21,500 కోట్ల రుణ సమీకరణ
నవ్యాంధ్ర సీఎం జగన్మోహన్రెడ్డి.. ఎన్నికల సమయంలో ఇచ్చిన సంపూర్ణ మద్యనిషేధం హామీని తుంగలో తొక్కేశారు. దశలవారీగా నిషేధాన్ని కూడా అటకెక్కించారు. ఆదాయార్జనకు, రుణ సమీకరణ కోసం మద్యాన్నే ప్రధాన వనరుగా మార్చుకున్నారు.
దశలవారీగా నిషేధమంటూ మూడో వంతు షాపులు తగ్గించినా.. ఆదాయం ఎక్కడా తగ్గకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభుత్వం.. తాజాగా భవిష్యతలో తాగబోయే మద్యంపై పన్ను వేసేసి.. దానిని ఆదాయంగా చూపి ఏకంగా రూ.21,500 కోట్ల రుణం తెచ్చేసింది. ఇది చాలదన్నట్లు.. జనంతో మరింత తాగించి ఆదాయం పెంచుకోవడానికి ఇంకో 300 దుకాణాలు కొత్తగా ఏర్పాటు చేయబోతోంది.
వైసీపీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన కీలక హామీల్లో మద్య నిషేధం ఒకటి. దశలవారీగా మద్య నిషేధం చేస్తామని, స్టార్ హోటళ్లలో తప్ప మందు ఎక్కడా అందుబాటులో ఉండదని సీఎ జగన్ పదే పదే చెప్పారు. అందులో భాగంగా తొలి విడతలో 880 షాపులు తగ్గించారు. దీంతో షాపుల సంఖ్య 4,380 నుంచి 3,500కు చేరింది.
తర్వాత పలు కారణాలతో ఆ సంఖ్యను 2,934కు కుదించారు. దీనికి కారణం కరోనా అయినప్పటికీ అది కూడా దశలవారీగా మద్య నిషేధంలో భాగమని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఇంకొన్ని మద్యం షాపులు తగ్గించాల్సిన సమయం వచ్చింది. కానీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. సరికదా.. ఇప్పుడున్న 2,934 షాపులకు అదనంగా మరో 300 దుకాణాల ఏర్పాటుకు చర్యలు ప్రారంభిస్తోంది.
పన్ను ఆదాయం పెంచడానికి..
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎస్డీసీ) పేరు మీద జగన్ సర్కారు రూ.21,500 కోట్లను అప్పుగా తెచ్చింది. మందుపై వేసే పన్నుల్లో ఒకటైన ‘అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్ఈటీ)’ ద్వారా ఆ రుణం తీరుస్తామని అప్పిచ్చిన సంస్థకు హామీ ఇచ్చింది. అంటే ప్రతి నెలా మందుపై వచ్చే రాబడిలో ఏఆర్ఈటీ ద్వారా వచ్చే ఆదాయాన్ని నేరుగా ఆ సంస్థకు చెల్లించాలి.
ఇప్పుడా పన్నును మరింత పెంచుకునేందుకు కొత్తగా 300 మద్యం షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. షాపులు తగ్గిస్తామని చెప్పి పెంచుతున్నారేమిటన్న అనుమానాలు ప్రజల్లో రాకుండా.. వాటిని పర్యాటక ప్రాంతాల్లో పెడుతున్నామనే సాకు చూపుతూ రంగం సిద్ధంచేసింది.
ఉన్నపళంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలుగా భావించే అన్ని ప్రాంతాల్లో మద్యం షాపుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని.. పది రోజుల్లోనే ఆ ప్రదేశాలను గుర్తించాలని ఉన్నతాధికారులు ఎక్సైజ్ అధికారులను నిర్దేశించారు. దాంతో తమ తమ పరిధుల్లో బాగా ప్రసిద్ధి చెందిన.. లేదా ఓ మోస్తరు పర్యాటకులు వచ్చే అన్ని ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.
ఇప్పటికే ప్రాథమికంగా 65 చోట్ల షాపులు పెట్టుకునేందుకు అవకాశం ఉందని నివేదించగా.. ఎన్ని వీలైతే అన్ని పెట్టాలని.. పరిమితులేం లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రోజుకు 6 కోట్ల అమ్మకాలు..!
రాష్ట్రంలో ప్రస్తుతం 2,934 మద్యం షాపులున్నాయి. దుకాణాలు, బార్లలో కలిపి మొత్తం సగటున నెలకు రూ.2 వేల కోట్ల మద్యం విక్రయిస్తున్నారు. ఒక్కో షాపులో రోజుకు సరాసరి రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకూ అమ్ముతారు.
పర్యాటక ప్రాంతాల్లో 300 కొత్త దుకాణాలు ఏర్పడితే ఎంతలేదన్నా వాటి వల్ల నెలకు రూ.180-200 కోట్ల వరకు అమ్మకాలు పెరగొచ్చని అంటున్నారు. అంటే రోజుకు రూ.6 కోట్లన్న మాట. అందులో 80 శాతం.. అంటే సుమారు రూ.160 కోట్లు ప్రభుత్వానికి ఆదాయంగా మిగులుతుంది.
ఒక్కో సీసాపై ఏఆర్ఈటీ కింద ప్రభుత్వం రూ.40 నుంచి రూ.480 వరకు వసూలు చేస్తోంది (వాటి విలువ, పరిమాణాన్ని బట్టి ఆ పన్నును నిర్ణయించింది). ఈ లెక్కన చీప్ లిక్కర్ తాగేవారిపైనా ఒక్కో సీసాపై సగటున పడే రూ.50 భారం నేరుగా అప్పు ఇచ్చిన సంస్థకు వెళ్లిపోతుంది.