ఏపీలో పంచాయితీ ఎన్నికలు ముగిసాయి. నాలుగు విడతల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు రావటం.. పలుచోట్ల ప్రమాణస్వీకారం చేయటం.. సంబరాలు చేసుకోవటం అన్ని అయిపోతున్నాయి. అయితే.. శ్రీకాకుళం జిల్లాలోని పలు గ్రామాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
ప్రధాన మీడియాలో పెద్దగా కవరేజ్ రావట్లేదు కానీ.. పంచాయితీ ఎన్నికల అనంతరం ఆయా గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవటమే కాదు.. పరస్పర దాడులు.. గాయపర్చుకోవటం. తీవ్ర గాయాలతో ఆసుపత్రులకు చేరటం లాంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి.
అలాంటి పరిస్థితి ఉన్న గ్రామాల్లో బుడగట్లపాలెం.. మెట్ట వలస గ్రామాలు ముందుంటాయి. ఇప్పుడా రెండు గ్రామాల్లో యుద్ధ వాతావరణమే కాదు.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనంతటికి కారణం పంచాయితీ ఎన్నికల ఫలితాలే అని చెప్పక తప్పదు. ఈ ఊళ్లు రణరంగంగా మారటమే కాదు.. పలువురికి తీవ్ర గాయాలతో పాటు.. లక్షలాది రూపాయిల ఆస్తి నష్టం వాటిల్లిన పరిస్థితి.
శ్రీకాకుళం జిల్లాలోని అధికార వైసీపీ – విపక్ష టీడీపీకి మధ్య నెలకొన్న గొడవలు దాడుల వరకు వెళ్లాయి. గెలిచిన వారిపై ఓడిన వారు చేస్తున్న దాడులకు గ్రామాల్లో ప్రశాంతత కరువైన పరిస్థితి.
బుడగట్లపాలెం ఉదంతాన్నే తీసుకుంటే.. ఇక్కడ జరిగిన పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుడైన రాంబాబు గెలుపొందారు. అంతే.. ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఆ ఊళ్లో గొడవలు జరుగుతున్నాయి. చిన్న చిన్న గొడవలు కాస్తా చిలికి చిలికి ఘర్షణలుగా మారటమే కాదు.. భౌతిక దాడుల వరకు వెళ్లాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు చెబుతున్నారు.
ఒక వర్గానికి చెందిన మహిళలు వీధిలో నడుచుకుంటూ వెళుతుంటే.. మరో వర్గంవారు అసభ్యంగా మాట్లాడటంతో గొడవ మొదైలంది. అది కోట్లాటగా మారటమే కాదు.. కర్రలు.. రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్న దుస్థితి. అంతేకాదు.. ఇళ్ల మీద పడి దాడులు చేసి.. విలువైన వస్తువుల్ని ధ్వంసం చేసిన వైనం చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో గాయపడిన ఎనిమిది మందిని శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. ఇరు వర్గాల ఫిర్యాదుతో ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.
మెట్ట వలసలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. గెలిచిన వారిపై ఓడిన వారు విరుచుకుపడటం.. గొడవ పడటంతో ఇబ్బందికర వాతావరణం నెలకొంది. తమ గ్రామాల్లో జరుగుతున్న ఉదంతాలు మీడియాలో ఎక్కడా రావటం లేదన్న మాట పలువురు నోటి నుంచి రావటం గమనార్హం. ఇలాంటి దారుణ పరిస్థితులు ప్రధాన మీడియాలో ప్రముఖంగా ఎందుకు రావటం లేదంటారు?
బెదిరించిన వాడు ఊరికే ఉంటాడా… ముందే చెప్పాడుగా తాము అరాచకవాదులం అని కింద వీడియో చూడండి. ఇది బుడగట్లపాలెం వీడియోనే