ప్రధాన నిందితుడు సుప్రీంకోర్టు సిజెకు లేఖ రాయడం హాస్యాస్పదం…
ఒక ప్రకటనలో ధ్వజమెత్తిన యనమల రామకృష్ణుడు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సిజె)కి లేఖ రాయడం, హాస్యాస్పదంగా ఉంది.
సిబిఐ 12 ఛార్జిషీట్లలో, ఈడి 5ఛార్జిషీట్లలో ఎ1 గా ఉన్న జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తూ సిజెకు లేఖ రాయడం ‘‘దయ్యాలు వేదాలు వల్లించడమే’’..
ఒకవైపు పౌరుల ప్రాధమిక హక్కులన్నీ కాలరాస్తూ, మరోవైపు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, రూల్ ఆఫ్ లా ను అడుగుగునా ఉల్లంఘిస్తూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్నే ధ్వంసం చేస్తూ, ఏ రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని తుంగలో తొక్కారో, మళ్లీ అదే రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి నీతిపన్నాలు వల్లించడం జగన్మోహన్ రెడ్డికే చెల్లింది.
కోర్టు బోనులో ఉండే వ్యక్తి (16ఛార్జిషీట్లలో ఎ 1 నిందితుడు) తీర్పుచెప్పే న్యాయమూర్తులపైనే బురద జల్లడం నిజంగా దుస్సాహసమే..గతంలో ఏ నిందితుడూ చేయని దుస్సాహసం ఇది.. దేశ న్యాయవ్యవస్థ ఎన్నడూ ఎదుర్కొనని ఉపద్రవం ఇది..
రూ43వేల కోట్ల అవినీతికి పాల్పడినట్లు సిబిఐ అఫిడవిట్ లో పేర్కొంది..దాదాపు రూ 4వేల కోట్ల అక్రమాస్తులను ఈడి జప్తు చేసింది. ఇంత తీవ్ర అభియోగాల్లో కోర్టుకు హాజరయ్యే వ్యక్తికి, ఇతరులపై లేఖ రాసే అధికారం ఎక్కడిది..? ప్రజలిచ్చిన అధికారాన్ని స్వలాభం కోసం దుర్వినియోగం చేయడమే ఇది..
16ఛార్జిషీట్లలో అభియోగాలు ఎదుర్కొనే వ్యక్తికి సిజెకు రాసే నైతికత ఉంటుందా..? ఆ లేఖకు ఏ మాత్రమైనా విలువ ఉంటుందా..?
జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ కూడా త్వరలోనే రోజువారీ ట్రయల్ కు వస్తున్న నేపథ్యంలో, దిగువ స్థాయి న్యాయవ్యవస్థనే(లోయర్ జ్యుడిసియరీని) బెదిరించడానికి రాసిన లేఖ కాదా..?
రాజ్యాంగం మీద, రూల్ ఆఫ్ లా మీద నమ్మకం లేని వ్యక్తి తీసుకున్న నిర్ణయాలపై బాధిత వ్యక్తులు, ప్రజా సంఘాలు కోర్టుకు వెళ్లితే, సదరు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను స్టే చేయడం తప్పా..?
రాజధానికి భూములిచ్చిన రైతులకు తీరని అన్యాయం చేసేలా సిఆర్ డిఏ రద్దు నిర్ణయాన్ని స్టే ఇవ్వడం తప్పా…?
పాలనా వికేంద్రీకరణ, సిఆర్ డిఏ రద్దు బిల్లులు పెండింగ్ లో ఉండగా పరిపాలనా కార్యాలయాలను తరలించడాన్ని అడ్డుకోవడం తప్పా..?
మాతృభాషలో విద్యాబోధన జరగాలని విద్యాహక్కు చట్టం చెబుతుంటే మాతృభాషలో బోధన దూరం చేసే నిర్ణయాన్ని స్టే చేయడం తప్పా…
ప్రభుత్వ భవనాలకు వేసిన వైసిపి జెండా రంగులు తొలగించాలని హైకోర్టు ఆదేశించడం తప్పా..? 74ఏళ్ల స్వతంత్రభారత చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వ భవనాలకు పార్టీ జెండా రంగులు వేశారా…? అన్నివర్గాల ప్రజలు హాజరయ్యే ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పార్టీ రంగులేయడం తప్పు కాదా..?
15అడుగుల లోతు ముంపు భూముల్లో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడాన్ని అడ్డుకోవడం తప్పా…వరదల్లో ఆ స్థలాలన్నీ మెడలోతు నీళ్లలో మునిగిపోవడం వాస్తవం కాదా..?
17నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక చర్యల్లో కొన్నింటిపై హైకోర్టు స్టే ఇచ్చింది, మరి కొన్నింటిని కొట్టేసింది. అది సహజంగా న్యాయవ్యవస్థలో జరిగే ప్రక్రియనే. దానినే సహించలేక కోర్టులనే టార్గెట్ చేయడం దుస్సాహసమే..
జగన్ కు రాజ్యాంగంపై విశ్వాసం లేదు, చట్టబద్దమైన పాలన( రూల్ ఆఫ్ లా)పై విశ్వాసం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై గౌరవం లేదు. బడుగు బలహీన వర్గాల ప్రజలంటే లెక్కే లేదు. తాను పట్టిందానికి మూడే కాళ్లనే మనస్తత్వం జగన్ ది..
చేసిన తప్పులు చక్కదిద్దుకోవడం, ఇకపై తప్పులు జరగకుండా చూడటం, ప్రజా వ్యతిరేక చర్యలను నిలువరించడం జగన్ కు రుచించవు.
న్యాయ సమీక్షాధికారం రాజ్యాంగం కల్పించిన అధికారం. సమీక్ష కోసం బాధిత ప్రజానీకం, సంఘాలు కోర్టులకెళ్లారు. వాటిపై న్యాయవ్యవస్థ ఆదేశాలు జారీ చేసింది. అందులో తప్పేముంది..?
సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పుచేతల్లోనే ఎసిబి పనిచేస్తుంది, కేబినెట్ సబ్ కమిటిలో ఉంది ఆయన అనుచరులే. వాళ్ల నిర్ణయాల వల్ల జరిగే అన్యాయంపై, కోర్టుకెళ్తే న్యాయస్థానం స్టే ఇచ్చింది, దానిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది, అక్కడ పెండింగ్ లో ఉండగానే ఈ విధంగా దేశ అత్యున్నత న్యాయమూర్తికే లేఖ రాయడం జగన్ మహాకుట్రలో భాగమే..
మీరు తీసుకున్న చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం అయినప్పుడు, ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకు కోర్టులకెళ్తే, వాటిపై సదరు కోర్టులు స్టే ఇస్తే, దానిని ఎలా తప్పు పడతారు..? ఇందులో కుట్ర లేదా..?
మీ నిర్ణయాలను కోర్టులు తప్పు పడితే, కోర్టులనే తప్పుపడుతూ లేఖ రాస్తారా..?
జగన్ ఈ లేఖ రాయడమే కుట్రపూరితం, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు..? ఉద్దేశపూర్వక కుట్ర దాగివుంది ఈ లేఖలో. ఇది జ్యుడిసియరీపై పన్నిన కుట్ర..న్యాయవ్యవస్థ స్వచ్ఛతనే మకిలం చేసే కుట్ర ఇది. ఇందులో మాజీ న్యాయమూర్తి, ప్రభుత్వ సలహాదారులతో పాటు ఎ1, ఎ2 ప్రధాన నిందితులంతా ఉన్నారు.
న్యాయవ్యవస్థనే అప్రదిష్ట పాల్జేసే కుట్ర ఇది. తన నిర్ణయాలపై నమ్మకం ఉంటే పైకోర్టులకు అప్పీల్ కు వెళ్లవచ్చుకదా..? కొన్నింటిపై ఇప్పటికే వెళ్లారు కదా..? అక్కడి తీర్పులు వచ్చేదాకా వేచిచూసే సహనం కూడా లేదా..?
అందుకే గత 2పర్యాయాలు ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోది ఇంటర్వూ ఇవ్వలేదు.
ఈ లేఖ చూస్తేనే చంద్రబాబుపై అక్కసు ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది..చంద్రబాబుపై కక్ష సాధింపునకు ఏకంగా న్యాయవ్యవస్థనే టార్గెట్ చేయడం కన్నా దుర్మార్గం ఇంకోటి లేదు.
ఏపిలో అమలు చేస్తోంది ఇండియన్ పీనల్ కోడ్ కాదు, ఇది జగన్ పీనల్ కోడ్…ఐపిసి కాదు, జెపిసి చేశారు..3నెలల్లో 3జిల్లాలలో శిరోముండనాలు, హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు, హింసా విధ్వంసాలు, ఏడాదిన్నర జగన్ పాలన అరాచకాలతో రాష్ట్రం తల్లడిల్లుతోంది. దళిత జడ్జి, దళిత డాక్టర్లు, దళిత విద్యార్ధులు, దళిత మహిళలు,గిరిజన మహిళలు,బిసి ముస్లిం మైనారిటీ వర్గాల ప్రజలు..ప్రతి ఒక్కరూ వైసిపి బాధితులే…ఈ పరిస్థితుల్లో బాధితులు కోర్టులను ఆశ్రయిస్తే, వాళ్లకు అనుకూలంగా కోర్టులు తీర్పులిస్తే, ఆ కోర్టులపైనే దాడి చేయడం కన్నా నీచం మరొకటి లేదు.
యనమల రామకృష్ణుడు
శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత