అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా జీవో నెంబర్ ఒకటిపై సభ లో చర్చకు టిడిపి సభ్యులు పట్టుబట్టినా స్పీకర్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో, పోడియం వద్ద టీడీపీ సభ్యులు నిరసనకు దిగడం…వారిని అడ్డుకునేందుకు వైసీపీ సభ్యులు కూడా వెళ్లడంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత బాల వీరాంజనేయపై వైసీపీ సభ్యులు దాడి చేశారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. దీంతో, ఆ ఘర్షణకు సంబంధించిన వీడియోలను విడుదల చేయాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సభలో పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఇది శాసనసభ కాదు… కౌరవ సభ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా రావడంతో పిచ్చెక్కిన జగన్ ముందస్తు ప్రణాళికతో ఇలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తమ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడికి తెగబడ్డారని ఆరోపించారు. మండిపడ్డారు.దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, స్వామిపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యేలను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి రాక్షస చర్యలతో చరిత్రలో జగన్ ఒక మాయని మచ్చలా మిగిలిపోతాడని దుయ్యబట్టారు.
అసెంబ్లీలో ఒక దళితుడిపై దాడి చేసి కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని, అసెంబ్లీలో ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే, జరిగిన ఘటనపై కూర్చుని చర్చించుకుని సమస్య పరిష్కారానికి పాటుపడేవారని చంద్రబాబు అన్నారు. అదీ ఆ సభ గౌరవం అని, అలాంటి సభా గౌరవాన్ని మంటగలిపిన సైకో జగన్ మోహన్ రెడ్డి సభాధ్యక్షుడిగా ఉండడం బాధాకరమని అన్నారు. తాను, జగన్ శాశ్వతం కాదని, అసెంబ్లీ..సభా సంప్రదాయాలు శాశ్వతం అని అన్నారు.
నేటి ఘటన చీకటిరోజుగా ఎప్పటికీ ఉండిపోతుందని, సభలో విజ్ఞత లేని పనికిమాలిన వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమను వ్యక్తిగత విరోధుల్లా చూస్తున్నారా? అంటూ వైసీపీ సభ్యులపై చంద్రబాబు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేస్తున్నామని, 151 మంది ఉన్నారని మమ్మల్ని చంపేస్తారా? అని ప్రశ్నించారు. రేపటి నుంచి మీరు బయటికి రాగలరా? మీ పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరు అని వార్నింగ్ ఇచ్చారు.