తెలంగాణ నాయకుడు, టీఆర్ ఎస్‌లో ఫైర్ బ్రాండ్‌గా ఉన్న మంత్రి మల్లారెడ్డిపై ఆదాయపన్ను శాఖ అధికారులు వరుసగా దాడులు చేయడం.. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురికావడం, ఫోన్‌ను డస్ట్‌బిన్‌లో దాచిపెట్టడం, ఆసుపత్రిలో చేరడం, ఐటీ అధికారులు మల్లారెడ్డి ఇంటి తలుపులు బద్దలు కొట్టే ప్రయత్నం చేయడం, ఈ క్రమంలో మల్లారెడ్డి సదరు అధికారులను నెట్టేయడం.. వంటి పరిణామాలు తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే.
అయితే,మల్లారెడ్డిపై ఐటీ దాడి ఇప్పటికిప్పుడు చేసింది కాదని, దాదాపు రెండు నెలల నుంచి ఐటీ అధికారులు ఆయనపై నిఘా పెట్టారని తెలుస్తోంది. అదేసమయంలో ఈ ఐటీ సోదాల్లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. మల్లారెడ్డి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఐటీ అధికారులు నిర్ధారించారు. ల్యాప్‌ట్యాప్ వ్యవహారం, అధికారులపై దాడి అంశాలను తీవ్రంగా తీసుకున్నారు. వీటిపై అధికారులు సీరియస్ అయ్యారు.
సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికతో ఈడీకి ఐటీ లేఖ రూపంలో నివేదికను పంపించింది. సేకరించిన సమాచారం, సాక్ష్యాలను ఈడీకి అధికారులు పంపించారు. ఆర్థిక లావాదేవీల అవకతవకలపై పూర్తిస్థాయి వివరాలు తెలియాలంటే.. ఈడీ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మల్లారెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు, సంస్థలపై మెరుపుదాడులు చేసిన విషయం తెలిసిందే.
మల్లారెడ్డి కుమారులు మహేందర్‌రెడ్డి, భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డితోపాటు సోదరులు, బంధువులు, సన్నిహితుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఏకంగా 50 బృందాలుగా విడిపోయి మల్లారెడ్డికి చెందిన 14 విద్యాసంస్థల్లో వరుసగా మూడు రోజులు తనిఖీలు చేపట్టారు. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన విషయం విధితమే.
ఈ క్రమంలో కోట్ల రూపాయలను గుర్తించారు. నగలను సీజ్ చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మునిసిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో గల మల్లారెడ్డి యూనివర్సిటీతో పాటు కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.
మల్లారెడ్డి, ఆయన భార్యతోపాటు.. కాలేజీల డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, ఇతర సిబ్బంది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు.. పన్ను చెల్లింపుల్లో అక్రమాలు, అధిక ఫీజుల వసూళ్లు, క్యాష్ పేమెంట్ల వివరాలు, వాటిని బ్యాంకుల్లో భద్రపర్చకపోవడానికి కారణాలను ఆరా తీసినట్లు సమాచారం.
కాగా ఐటీ అధికారులు రెండు నెలలుగా మంత్రి మల్లారెడ్డి లావాదేవీలపై నిఘా పెట్టినట్లు తెలిసింది. అన్ని ఆధారాలు సేకరించాకే.. వ్యూహాత్మకంగా దాడులు నిర్వహించినట్లు సమాచారం. కాలేజీ ఫీజుల వసూళ్లు.. వాటిని స్థిరాస్తులకు మళ్లించడం.. ఇతర వ్యాపారాలు వంటి అంశాలపై అధికారులు ముందుగానే ఓ బ్లూప్రింట్‌ను సిద్ధం చేసుకుని, దాడులకు చేసినట్లు తెలిసింది. ఇక, ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగితే.. ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.
https://twitter.com/Bleed_pink_/status/1595815174052925440