తిమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళ కొద్ది సంవత్సరాలుగా బెంగుళూరులోని పరప్ఫణ జైలులో శిక్ష అనుభవిస్తోన్న సంగతి తెలిసిందే. తమిళనాడు ఎన్నికలకు మరో ఏడాది సమయమున్న నేపథ్యంలో చిన్నమ్మ విడుదల కాబోతోందన్న ప్రచారం జరుగుతోంది.
రాబోయే ఎన్నికల్లో దినకరన్ తో కలిసి మరోసారి తమిళరాజకీయాల్లో చక్రం తిప్పేందుకు చిన్నమ్మ పెద్ద స్కెచ్ వేశారని ఆమె అనుచరులు అనుకుంటున్నారు. చిన్నమ్మ బయటకు వచ్చాక పళనిస్వామి, పన్నీర్ సెల్వంలకు చిక్కులు తప్పవని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆదాయపు పన్నుశాఖ ఇచ్చిన షాక్ తో చిన్నమ్మ ‘ఎన్ని‘కల చెదిరేలా ఉంది. శశికళకు సంబంధించిన సుమారు రూ.2వేల కోట్ల విలువైన ఆస్తులను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసింది. ఆ ఆస్తులను ఐటీ అధికారులు అటాచ్ చేయడంతో చిన్నమ్మ జైలు నుంచి విడుదలైనప్పటికీ…మునుపటి వైభవం ఉండదని తమిళనాట టాక్ వస్తోంది.
శశికళ విషయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చిన్నమ్మకు చెందిన ఆస్తులను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసింది. దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన ఆ ఆస్తులను బినామీ ఆస్తులుగా ఐటీ శాఖ గతంలోనే గుర్తించింది. అయితే, ఆ తర్వాత దర్యాప్తులో అవి శశికళ బినామీలవేనని నిర్ధారించుకుంది.
చిన్నమ్మతోపాటు దివంగత ముఖ్యమంత్రి జయలలిత దత్త పుత్రుడు, శశికళ అక్క కుమారుడు సుధాకరన్, ఆయన భార్య ఇలవరసి పేర్ల మీద ఉన్న ఆస్తులను కూడా ఐటీ శాఖ ఫ్రీజ్ చేసింది. చెంగల్పట్టు జిల్లాలోని సిరుదాఊరు బంగాళా, కొడనాడు ఎస్టేట్లోని ఆస్తులను ఐటీ శాఖ అధికారులు అటాచ్ చేశారు.
నెలరోజుల క్రితం శశికళ బినామీ ఆస్తిగా గుర్తించిన 200 కోట్ల విలువైన నిర్మాణంలో ఉన్న భవనాన్నిఐటీ శాఖాధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా , రెండువేల కోట్ల విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేయడంతో చిన్నమ్మకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.