సందర్భం ఉంది.. సమయమే లేదు.. అన్నట్టుగా ఐటీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. కీలక నాయకుల ఇళ్లపై ఏ సమయంలో దాడులు జరుగుతాయో.. కూడా చెప్పలేని విధంగా అధికారులు వాలిపోతున్నారు. కొన్ని రోజుల కిందట మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లపై ఇదేవిధంగా ఐటీ దాడులు జరిగాయి. దీంతో తెలంగాణ నాయకులు ఉలిక్కి పడ్డారు.
అయితే.. ఇప్పుడు దాని నుంచి నాయకులు ఇంకా తేరుకోకముందే.. తాజాగా మంచిర్యాలలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్నికల కోసం భారీగా నగదు బదిలీ అయిందన్న సమాచారంతో సోదాలు చేపట్టారు. ఉదయం 5 గంటలకే ఆయన ఇంటిపై వాలిపోయిన ఐటీ అధికారులు అన్ని విషయాలనూ లోతుగా పరిశీలించారు. ఈ నెల 13న విశాఖ ఇండస్ట్రీస్, విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థల ఖాతాల్లోకి రూ.8కోట్ల నగదు బదిలీ జరిగింది.
గుర్తు తెలియని ఖాతా నుంచి నగదు బదిలీపై సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. రూ.8కోట్ల నగదును స్వాధీనం చేసిన ఈసీ, ఐటీ, ఈడీ అధికారుల దృష్టికి పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులిచ్చిన సమాచారం ఆధారంగా వివేక్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు చెన్నూరులో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. వివేక్, వినోద్ నివాసాలతో పాటు బంధువుల ఇళ్లలోనూ రైడ్ జరుగుతోంది.
మరోవైపు బీఆర్ ఎస్ అభ్యర్థి ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. దీంతో నాయకులు ఒకవైపు ఎన్నికల టెన్షన్ తో నే సతమతం అవుతుంటే.. ఇప్పుడు ఐటీ దాడులతో హడలెత్తిపోతున్నారు. పోలింగ్‌కు మరో వారం రోజుల గడువు ఉండడం, ఇప్పటికే తెలంగాణ విషయంలో ఎన్నికల సంఘం డేగ కన్ను సారించడంతో ఎప్పుడు ఎవరి ఇంటిపైకి ఐటీ అధికారులు దాడులు చేస్తారోనన్న బెంగ పట్టుకుంది.