తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ అధికారుల సోదాలు, దాడుల వ్యవహారం సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. మంత్రి మల్లారెడ్డి ఆఫీస్ నుంచి 6 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని ఐటి అధికారులు చెబుతున్నారు. అయితే ఐటీ అధికారులు విచారణ పేరుతో తన పెద్ద కుమారుడిని సిఆర్పిఎఫ్ పోలీసులతో కొట్టించారని మల్లా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి ఇంట్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఐటి అధికారులపై మర్రి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పెద్దల ఆదేశాలతోనే తన నివాసంలో ఐటి అధికారులు సోదాలను నిర్వహించారని రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఐటీ అధికారులకు ఇంగిత జ్ఞానం లేదని, చిన్న పిల్లలతో, వృద్ధులతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. తన కూతురు, తల్లిదండ్రులను అధికారులు భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు.
తన కుటుంబ సభ్యుల ఫోన్లు స్వాధీనం చేసుకున్న విషయం మీడియా ద్వారానే తనకు తెలిసిందని రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. తమ విద్యాసంస్థలలోని ఉద్యోగులను ఐటి అధికారులు బెదిరించారని ఆరోపించారు. చదువుకున్న ఐటి అధికారులు ఢిల్లీ పెద్దలకు గులాంగిరీ చేస్తూ వారికి వేట కుక్కల్లాగా పని చేయడం బాధాకరం అంటూ రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టర్కీలో ఉన్న రాజశేఖర్ రెడ్డి ఐటీ సోదాల నేపథ్యంలో హుటాహుటిన బయలుదేరి తెలంగాణకు వచ్చారు.