రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గత వారం రోజులుగా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు కంపెనీల సీఈవోలతో, ఎండీలతో, పారిశ్రామికవేత్తలతో లోకేష్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా శాన్ ఫ్రాన్సిస్కో లోని గూగుల్ క్యాంపస్ ను సందర్శించిన లోకేష్…గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, బికాస్ కోలే (వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ నెట్ వర్కింగ్), రావు సూరపునేని (వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ అప్లికేషన్ ప్లాట్ ఫామ్స్), చందు తోట (వైస్ ప్రెసిడెంట్, గూగుల్ మ్యాప్స్) లతో భేటీ అయ్యారు.
క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ గా ఏపీ రూపుదిద్దుకుంటోందని, విశాఖపట్నంలో డేటా సెంటర్ల ఏర్పాటుపై దృష్టిసారించామని అన్నారు. పీపీపీ మోడ్ లో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని లోకేష్ కోరారు. విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో ఏపీ ఏఐ ఆధారిత ఈ-గవర్నెన్స్, స్టార్ట్ సిటీ కార్యక్రమాలను అమలు చేస్తోందని వారికి వివరించారు.
స్టార్ట్ సిటీల్లో జియో స్పేషియల్ సేవల్లో భాగంగా రియల్ టైమ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, డిజాస్టర్ రెస్పాన్స్, అర్బన్ ప్లానింగ్‌తో సహా స్మార్ట్ సిటీ కార్యక్రమాలను గూగుల్ మ్యాప్స్ తో అనుసంధానించడం కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. లోకేష్ ప్రతిపాదనలపై గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. సహచర బృందంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.