యువ కథానాయకుడు నితిన్ ఎన్నో ఏళ్ల పాటు ఓ మోస్తరు సక్సెస్ కూడా లేకుండా అల్లాడిపోతున్న సమయంలో అతడికి గొప్ప ఉపశమనాన్ని అందించిన చిత్రం.. ఇష్క్. నితిన్ సరసన నిత్యా మీనన్ నటించిన ఈ లవ్ స్టోరీ యూత్‌ను ఎంతగానో మెప్పించింది. ఆ చిత్రంతోనే విక్రమ్ కె.కుమార్ అనే దర్శకుడు తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. ఆ తర్వాత అతను వరుసగా తెలుగులో సినిమాలు తీశాడు.
‘మనం’ లాంటి క్లాసిక్ కూడా అందించాడు. ఐతే ప్రస్తుతం నితిన్‌తో పాటు విక్రమ్ కూడా సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ లాంటి డిజాస్టర్లలతో ఇబ్బంది పడుతున్నాడు. మరోవైపు విక్రమ్ కూడా థియేట్రికల్ రిలీజ్‌తో మంచి సక్సెస్ అందుకుని చాన్నాళ్లయింది. ‘థ్యాంక్యూ’ డిజాస్టర్ కాగా.. ‘గ్యాంగ్ లీడర్’ జస్ట్ యావరేజ్ అనిపించుకుంది.
ఈ నేపథ్యంలో నితిన్, విక్రమ్ కుమార్ ఒక సినిమా కోసం చేతులు కలుపుతున్నట్లు సమాచారం. వీళ్లిద్దరి కలకయికలో అంటే మళ్లీ ఓ ప్రేమకథే ఆశిస్తారు ప్రేక్షకులు. ఆ తరహా సినిమానే చేయబోతున్నారట. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా గురించి అధికారిక ప్రకటన రావచ్చని అంటున్నారు. ‘ఇష్క్’ సినిమా తరహాలోనే తమ శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లోనే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయాలని నితిన్ భావిస్తున్నాడట.
విక్రమ్ కుమార్ చివరగా ‘దూత’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించాడు. అది మంచి స్పందన తెచ్చుకుంది. దానికి రెండో సీజన్ కూడా రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ నెల 19న దీని గురించి అమేజాన్ ప్రైమ్ వాళ్లు అధికారిక ప్రకటన చేయబోతున్నారు. దీని పని పూర్తి చేశాక నితిన్ సినిమాను విక్రమ్ మొదలుపెడతాడట. నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్, తమ్ముడు అనే రెండు సినిమాలు చేస్తున్నాడు.